New AICC President: ఏఐసీసీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే ఘన విజయం సాధించడం పట్ల తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అత్యంత ప్రజాస్వామికంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ సంస్థాగత ఎన్నికల్లో మల్లికార్జున ఖర్గే విజయం సాధించారని, ఖర్గే నాయకత్వంలో పార్టీ మరింత బలపడుతుందని అన్నారు.
ఖర్గే ఘనవిజయం
సోమవారం జరిగిన ఎన్నికల్లో ఎక్కువ మంది కాంగ్రెస్ శ్రేణులు ఖర్గేకు ఓటు వేశారు. పార్టీ అధ్యక్ష పీఠం కోసం కాంగ్రెస్ సీనియర్ నాయకులు మల్లికార్జున ఖర్గే, శశి థరూర్ పోటీ పడ్డారు. ఇవాళ(అక్టోబర్ 19న) ఫలితాలు వెలువడ్డాయి. దీంతో 24 ఏళ్ల తొలిసారిగా గాంధీయేతర కుటుంబానికి చెందిన మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పగ్గాలు చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌లో జరిగిన ఎన్నికల్లో 7,897 మంది ఖర్గేకు అనుకూలంగా ఓట్లు వేశారు. 1,072 మంది శశిథరూర్‌కు అనుకూలంగా ఓటు వేశారు. అంటే 6,800పైగా మెజారిటీతో ఖర్గే విజయం సాధించారు. 416 ఓట్లు చెల్లకుండా పోయాయి.
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో సీనియర్ నేతలు మల్లికార్జున ఖర్గే, శశిథరూర్ పోటీ పడ్డారు. వీరి మధ్య గట్టిగానే పోటీ నెలకొంది. ఎక్కువ మంది మాత్రం ఖర్గే వైపే మొగ్గు చూపతూ తీర్మానాలు కూడా చేశారు. చాలా రాష్ట్రాల్లో ఆయనకు అనుకూలంగా ప్రచారం చేశారు. తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ లీడర్లు ఖర్గేకు ఓటు వేశారు. ఆయన ప్రత్యక్షంగా వచ్చి అందర్నీ కలిసి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
'పార్టీని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని విశ్వాసముంది'
ఖర్గే అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ నాయకులు అశోక్ గహ్లోత్, దిగ్విజయ సింగ్, ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, ఎకె ఆంటోనీ, పవన్ కుమార్ బన్సాల్, ముకుల్ వాస్నిక్ వంటి సీనియర్ నేతలు ప్రతిపాదించారు. జీ 23 నాయకులు ఆనంద్ శర్మ, మనీష్ తివారీ కూడా మద్దతు ఇచ్చారు. అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్ ఖర్గేకు పోటీగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ నామినేషన్ దాఖలు చేశారు. తాను ఎవరికీ పోటీగా బరిలోకి దిగలేదని పార్టీపై ప్రేమతోనే ఇది చేస్తున్నట్లు శశి థరూర్ అన్నారు.
ఎన్నికల ఫలితాలపై శశి థరూర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ఖర్గేను అభినందిస్తూ సుదీర్ఘ లేఖ విడుదల చేశారు. కాంగ్రెస్ అధ్యభ పదవి అనేది గొప్ప గౌరవంతో పాటు చాలా పెద్ద బాధ్యత అని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో ఖర్గే విజయవంతం అవ్వాలని ఆశాభావం, సంతోషం వ్యక్తం చేశారు. ఖర్గే తన రాజకీయ అనుభవంతో పార్టీని నూతన శిఖరాలకు తీసుకెళ్తారని విశ్వాసం ప్రకటించారు. ఈ సదర్భంగా సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఆమె వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారని, అందుకు సోనియాజీకి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. అధ్యక్ష ఎన్నికలు తటస్థంగా జరిగేలా చూసిన రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ సభ్యుల గుండెల్లో ఎన్నటికీ గుర్తుండిపోయే స్థానం ఉంటుందని కొనియాడారు.