Online Gambling Games: 


తమిళనాడులో బ్యాన్..


తమిళనాడు ప్రభుత్వం ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌పై నిషేధం విధించింది. వాటిని పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు వీలుగా అసెంబ్లీలో ఓ బిల్లు పాస్ చేసింది. గతంలో ఆన్‌లైన్ గేమ్స్‌పై నిషేధం విధించిన స్టాలిన్ ప్రభుత్వం...ఇప్పుడు గ్యాంబ్లింగ్ గేమ్స్‌పైనా వేటు వేసింది. తమిళనాడు న్యాయశాఖమంత్రి ఎస్‌ రెగుపతి ఈ బిల్‌ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కొందరు ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌కి అలవాటు పడి, మోసపోయి ఆత్మహత్యలకు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో ఈ తరహా ఘటనలు పెరిగాయి. అందుకే...తమిళనాడు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి కూడా ఈ నిర్ణయానికి పూర్తి మద్దతు తెలిపారు. అక్టోబర్ 7వ తేదీనే ఈ ప్రకటన చేశారు. సెప్టెంబర్‌లో తమిళనాడు కేబినెట్ ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపింది. జస్టిస్ చంద్రు ప్యానెల్ ఇచ్చిన నివేదిక ప్రకారం...ఆన్‌లైన్ రమ్మీని పూర్తిగా నిషేధం విధిస్తున్నట్టు తెలిపింది ప్రభుత్వం. గతంలో రెండు సార్లు ఈ బిల్ పాస్ చేయాలని చూసినా...మద్రాస్ హైకోర్ట్ తీర్పుతో అది సాధ్యపడలేదు. గతేడాది ఆగస్టులోనూ ప్రయత్నం జరగగా...అప్పట్లో మద్రాస్ న్యాయస్థానం "ఇది రాజ్యాంగబద్ధం కాదు" అని స్పష్టం చేసింది. 
అయితే...గడిచిన మూడేళ్లలో ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ కారణంగా...తమిళనాడులో 20 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటి నుంచి ఈ గేమ్స్‌పై పూర్తి స్థాయి నిఘా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రతి కంపెనీని తమిళనాడు ప్రభుత్వం నియంత్రించనుంది. 










ఆన్‌లైన్ బెట్టింగ్‌పైనా వేటు..


దేశంలో ఆన్‌లైన్ బెట్టింగ్ ఓ జాడ్యంలా విస్తరిస్తూండటంతో అనేక దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్తులు కూడా ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడి లక్షలు పోగొట్టుకుని నిరాశా నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. దీంతో కేంద్రం ఈ ఆన్ లైన్ బెట్టింగ్ వ్యవస్థను నియంత్రించాలని నిర్ణయించుకుంది. అలాంటి సంస్థల ప్రకటనలపై కొత్త నియామవళి జారీ చేసింది. అలాంటి ప్రకటనలను పూర్తిగా నిషేధించింది. ఆన్‌లైన్ బెట్టింగ్‌ను ప్రోత్స‌హించే ప్ర‌క‌ట‌న‌ల‌పై నిషేధం విధిస్తూ సమాచార ప్ర‌సార మంత్రిత్వ శాఖ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. వినియోగ‌దారుల‌కు ఇవి సామాజికార్ధిక ముప్పుగా ప‌రిణ‌మిస్తు న్నందున ఈ త‌ర‌హా ప్ర‌క‌ట‌న‌ల‌ను నిలిపివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఆన్‌లైన్ బెట్టింగ్ వేదిక‌లకు సంబంధించిన ప్ర‌క‌ట‌న‌లకు దూరంగా ఉండాల‌ని ప్రింట్, ఎల‌క్ట్రానిక్, డిజిట‌ల్ మీడియాల‌ను కేంద్రం కోరింది.  నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు. ప‌లు ప్రింట్, ఎల‌క్ట్రానిక్‌, సోషల్‌, ఆన్‌లైన్ మీడియాలో పెద్ద‌సంఖ్య‌లో ఆన్‌లైన్ బెట్టింగ్ వెబ్‌సైట్స్, ప్లాట్‌ఫాంల గురించిన ప్ర‌క‌ట‌న‌లు వెల్లువెత్తిన క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం ఈ మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది. బెట్టింగ్‌, గ్యాంబ్లింగ్‌ను దేశంలోని ప‌లు ప్రాంతాల్లో చ‌ట్ట‌విరుద్ధ‌మైన‌విగా ప‌రిగ‌ణిస్తార‌ని, వీటిపై ప్ర‌క‌ట‌న‌లు ముఖ్యంగా చిన్నారులు, యువ‌త‌కు సామాజికార్ధిక ముప్పుగా ప‌రిణ‌మించాయ‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో స్ప‌ష్టం చేసింది.


Also Read: Congress President Kharge: లేబర్ యూనియన్ లీడర్‌ నుంచి ఓటమి ఎరగని స్థాయికి, ఖర్గే రాజకీయ ప్రస్థానమిదే