Piramal Pharma Shares: పిరామల్ ఫార్మా లిమిటెడ్‌ (Piramal Pharma Ltd - PPL) షేర్లు ఇవాళ (బుధవారం) స్టాక్‌ మార్కెట్‌లోకి అడుగు పెట్టాయి. ఒక్కో షేరు BSEలో రూ.201.80 వద్ద; NSEలో రూ.200 వద్ద లిస్ట్‌ అయ్యాయి. 


లిస్టింగ్‌ టైమ్‌ నుంచి 5 శాతం పతనమైన స్టాక్‌ లోయర్‌ సర్క్యూట్‌లో ఆగింది. ఇంట్రా డే ట్రేడ్‌లో, BSEలో ఈ షేరు ధర రూ.191.75 కనిష్ట స్థాయికి పడిపోయింది. NSEలో రూ.191.35 కనిష్టానికి చేరింది. ఉదయం 10:06 గంటల సమయానికి NSE, BSEలో కలిపి 1.8 మిలియన్ ఈక్విటీ షేర్లు చేతులు మారాయి.


'T' గ్రూప్‌లో లిస్టింగ్‌
పిరామల్‌ ఫార్మా ఈక్విటీ షేర్లు 'T' గ్రూప్ సెక్యూరిటీస్‌ విభాగంలో లిస్ట్‌ అయ్యాయి. సాధారణ పద్ధతిలో కాకుండా, T లేదా T2T సెగ్మెంట్‌ నిబంధనల ప్రకారమే వీటిలో ట్రేడ్‌ చేయాలి. T2T సెగ్మెంట్‌లో, ప్రతి ట్రేడ్‌ను కచ్చితంగా డెలివరీగానే తీసుకోవాలి. డీమ్యాట్‌ అకౌంట్‌లోకి షేర్లు వచ్చాకే వాటిని అమ్మడానికి వీలవుతుంది. ఇంట్రా డే నెట్టింగ్‌కు అనుమతించరు. అంటే.. అదే రోజు కొని, అదే రోజు అమ్మడానికి వీల్లేదు. అప్పర్‌, లోయర్‌ సర్క్యూట్‌ లిమిట్స్‌ 5 శాతం. పడినా 5 శాతం దగ్గర, పెరిగినా 5 శాతం దగ్గర షేరు ఆగిపోతుంది.


పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ (PEL) నుంచి ఫార్మాస్యూటికల్స్ వ్యాపారాన్ని విడదీసి, ప్రత్యేక సంస్థగా స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ చేయడానికి గత ఏడాది అక్టోబర్‌లో PEL డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలిపింది. ఇప్పుడు, అంటే సంవత్సరం తర్వాత ఆ ప్రక్రియ సంపూర్ణంగా పూర్తయింది. ఇప్పుడు ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫార్మాస్యూటికల్స్‌ వేర్వేరుగా వ్యాపారాలు చేస్తున్నాయి.


4:1 రేషియోలో షేర్లు
విభజనకు ముందు పిరామల్ ఎంటర్‌ప్రైజెస్‌లో షేర్లను హోల్డ్‌ చేస్తున్న పెట్టుబడిదారులకు 4:1 నిష్పత్తిలో పిరామల్ ఫార్మా లిమిటెడ్‌ షేర్లను కేటాయించారు. అంటే, PELలో రూ.2 ముఖ విలువ గల ప్రతి ఒక్క ఈక్విటీ షేరుకు, రూ.10 ముఖ విలువ కలిగిన 4 PPL ఈక్విటీ షేర్లను జారీ చేశారు. 


ఫార్మా కంపెనీ కోసం గ్లోబల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రూప్‌ కార్లైల్‌ (Carlyle) నుంచి నిధులను సేకరించారు. ఈ డబ్బును ఆర్గానిక్‌, ఇన్‌ ఆర్గానిక్‌ మార్గాల్లో కంపెనీ పెట్టుబడులుగా వాడుకుంటోంది. ఆర్గానిక్‌ మార్గం అంటే ఒక కంపెనీ సొంతంగా అభివృద్ధి చెందడం. ఇన్‌ ఆర్గానిక్‌ మార్గం అంటే అదే పరిశ్రమలో ఉన్న ఇతర కంపెనీలను కొని వృద్ధి చెందడం. కంపెనీ అభివృద్ధి కోసం ఏమేం చేయాలో ముందుగానే పక్కా ప్లాన్‌ వేసుకున్నారు. ఆ ప్లాన్‌ ప్రకారమే నిధులు వినియోగిస్తున్నారు.


మధ్యకాలికం నుంచి దీర్ఘకాలంలో ఫార్మా వ్యాపారంలో దాదాపు 15 శాతం CAGR వద్ద ఆదాయ వృద్ధిని సాధించగలమని నమ్ముతున్నాం. పెరుగుతున్న ఆదాయాలతో పాటు వ్యయాలు పెరగకుండా గట్టి చర్యలు తీసుకుని, ఆపరేటింగ్‌ మార్జిన్‌లను మెరుగుపరుచుకోవాలని భావిస్తున్నాం. ఫలితంగా మూలధనంపై రాబడి (RoCE) మెరుగుపరుడుతుంది. - మేనేజ్‌మెంట్‌


పిరామల్ ఫార్మాకు విభిన్న వ్యాపార నమూనాలు ఉన్నాయి. అవి.. కాంట్రాక్ట్ డెవలప్‌మెంట్ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (CDMO; FY22 అమ్మకాల్లో 59 శాతం), కాంప్లెక్స్ హాస్పిటల్ జనరిక్స్ (CHG; FY22 అమ్మకాల్లో 30 శాతం), ఇండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌ (ICH; FY22 అమ్మకాల్లో 11 శాతం).


PPL వ్యాపారంలో గత 15 -18 నెలలుగా ఇబ్బందులు ఉన్నాయి. CDMO వ్యాపారం తిరిగి గాడిలో పడాలంటే కంపెనీ మరిన్ని వనరులను కూడగట్టాలని; కొవిడ్ సంబంధిత అడ్డంకులు పూర్తిగా తొలగిపోతే CHG సెగ్మెంట్‌ చకచకా నడుస్తుందని బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చెబుతోంది. ఒక్కో షేరుకు ఫెయిర్‌ వాల్యూగా రూ.210ని బ్రోకరేజ్‌ అంచనా వేస్తోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.