Bilkis Bano Case:


సత్ప్రవర్తన కిందే విడుదల..


బిల్కిస్ బానో కేసులో 11 మంది దోషులను ఇటీవలే గుజరాత్ ప్రభుత్వం విడుదల చేసింది. దీనిపై పెద్ద ఎత్తున దుమారం రేగింది. ఇప్పటికీ ఈ నిర్ణయంపై గుజరాత్ సర్కార్‌పై విమర్శలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా...ఇప్పుడు మరో విషయం తెరపైకి వచ్చింది. ఈ 11 మంది దోషుల్లో ఒకరైన మితేష్ చిమన్‌లాల్ భట్ 2020 జూన్‌లో పరోల్‌పై బయటకు వెళ్లాడు. ఆ సమయంలోనూ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడన్న అంశం వివాదాస్పదమవుతోంది. సుప్రీం కోర్టుకు గుజరాత్ ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్‌లో ఇది పేర్కొన్నారు. ఇప్పటి వరకూ ఈ కేసుపై విచారణ జరగనే లేదు. ఆగస్టులో 11 మంది దోషులను ప్రభుత్వం విడుదల చేసింది. 2002లో గోద్రా అల్లర్లలో బిల్కిస్ బానో అనే మహిళపై 11 మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే...వీరిని విడుదల చేసే సమయంలో గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. 1992 జులై 9న పాస్ చేసిన రెమిషన్ పాలసీ ఆధారంగా చూపిస్తూ...ఈ నిర్ణయం సరైందేనని తేల్చి చెప్పింది. "జీవిత ఖైదు అనుభవిస్తున్న వాళ్లను సత్ప్రవర్తన కింద 14 ఏళ్ల జైలు శిక్ష తరవాత విడుదల చేసేందుకు అవకాశముంది" అని వివరణ కూడా ఇచ్చుకుంటోంది. బిల్కిస్‌ బానో కేసులో దోషులకు రెమిషన్‌ మంజూరు చేసి విడుదల చేయడాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలవ్వగా...గుజరాత్ ప్రభుత్వాన్ని వివరణ కోరింది సర్వోన్నత న్యాయస్థానం. అందులో భాగంగానే...గుజరాత్ ప్రభుత్వం అఫిడవిట్‌ను సమర్పించింది. 






సుప్రీం కోర్టులో పిటిషన్ 


గతంలోనే...సుప్రీం కోర్టు బిల్కిస్ బానో కేసులో దోషులను విడుదల చేయటానికి వ్యతిరేకంగా వేసిన పిటిషన్‌ను విచారించింది. గుజరాత్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.  దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఆదేశించింది. అంతే కాదు. గుజరాత్ ప్రభుత్వం ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిల్కిస్ బానో అత్యాచార కేసులో 11 మంది దోషులను ఆగస్టు 15వ తేదీన విడుదల చేశారు. దీనిపై ఇంకా రగడ కొనసాగుతూనే ఉంది. ఇది అనుచిత నిర్ణయం అని భాజపాపై అందరూ విమర్శలు ఎక్కు పెడుతున్నారు. అటు బాధితురాలు బిల్కిస్ బానో కూడా ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు కూడా. అయితే..ఇప్పుడు ఈ కేసు సుప్రీం కోర్టుకు గడప తొక్కింది. దోషుల విడుదలను రద్దు చేయాలని కోరుతూ..మహిళా హక్కుల కార్యకర్తలు రేవతి లౌల్, సుభాషిణి అలీ, రూపా రేఖా వర్మలు సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. దోషులను విడుదల చేయటంపై బిల్కిస్ బానో స్పందించారు. "న్యాయ వ్యవస్థపై ఉన్న నా నమ్మకం చెదిరింది. ఉన్నట్టుండి శరీరం మొద్దుబారిపోయినట్టు అయిపోయింది" అంటూ కామెంట్ చేశారు. ఆ నిందితులను విడుదల చేయటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె...ఈ నిర్ణయం తీసుకునే ముందు తన భద్రత గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదని విమర్శించారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించిన బిల్కిస్ బానో...భయం లేకుండా జీవించే హక్కుకల్పించాలని కోరారు. 


Also Read: Delhi Firecrackers Ban: దీపావళికి బాంబులు కాలిస్తే నేరుగా జైలుకే, ఆ ప్రభుత్వం సంచలన నిర్ణయం