T20 World Cup 2022: టీమ్‌ఇండియా అభిమానులకు బ్యాడ్‌న్యూస్! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరగాల్సిన రెండో వార్మప్ మ్యాచ్ రద్దైంది. బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఎడతెరపి లేకుండా వర్షం కురవడమే ఇందుకు కారణం. వరుణుడు కరుణిస్తే 5 ఓవర్ల మ్యాచ్ పెట్టాలని నిర్వాహకులు భావించారు. వానదేవుడు అస్సలు తెరపినివ్వకపోవడంతో కనీసం టాస్, బంతి పడకుండానే మ్యాచ్ రద్దు చేయాల్సి వచ్చింది. ఇక ఆదివారం పాక్‌తో భారత్ తలపడనుంది.
కీలకమైన సూపర్ 12కు ముందు ప్రధాన జట్లు వార్మప్ మ్యాచులు ఆడుతున్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ గేమ్‌లో టీమ్‌ఇండియా థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. ఆఖరి ఓవర్లో షమి 3 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్, న్యూజిలాండ్ రెండో వార్మప్ మ్యాచ్ రెండు జట్లకు అత్యంత కీలకం. మెగా టోర్నీకి ముందు తమ జట్ల సన్నద్ధత, సమతూకం పరీక్షించుకొనేందుకు ఇదే చివరి అవకాశం. చివరికి వర్షం కారణంగా ఇది రద్దైంది.
వాస్తవంగా మిస్టర్ 360, సూపర్ ఫామ్‌లో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు విశ్రాంతినివ్వాలని టీమ్‌ఇండియా నిర్ణయించుకుంది. పాకిస్థాన్ పోరుకు అతడిని తాజాగా ఉంచాలని భావించింది. ఏడాది కాలంగా సూర్య ఎడతెరపి లేకుండా సిరీసులు ఆడుతున్నాడు. ఐపీఎల్ 2022 తర్వాత దాదాపుగా అన్ని సిరీసుల్లో ఆడాడు. కాగా అతడి స్థానంలో దీపక్ హుడాను ఆడించాలని అనుకున్నారు. కేఎల్ రాహుల్‌కు విశ్రాంతినిచ్చి రిషభ్ పంత్‌ను ఆడించాలని అనుకున్నారట. మరోవైపు న్యూజిలాండ్ ఈ మ్యాచును సీరియస్‌గా తీసుకుంది. ఎందుకంటే తొలి వార్మప్ మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో కివీస్ ఘోర పరాజయం చవిచూసింది. కేవలం 98కే ఆలౌటైంది.
గబ్బాలో ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంది. మధ్యాహ్నం నుంచి జల్లులు మొదలయ్యాయి. సాయంత్రానికి అవి తీవ్రమయ్యాయి. కొంత సమయమైన వరుణుడు తెరపినిస్తాడని ఆశించినా అది జరగలేదు. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4:16 గంటలకు 5 ఓవర్ల మ్యాచ్ ఆడించాలని నిర్వాహకులు భావించారు. కానీ వర్షం మరింత పెరిగి ఔట్‌ఫీల్డ్ చిత్తడిగా మారింది. దాంతో మ్యాచును రద్దు చేయక తప్పలేదు.