Karthik Meiyappan Hat Trick: చెన్నై కుర్రాడు కార్తీక్‌ మెయప్పన్‌ (Karthik Meiyappan) సంచలనం నమోదు చేశాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ 2022లో తొలి హ్యాట్రిక్‌ వికెట్లు పడగొట్టాడు. యూఏఈ తరఫున ఆడుతున్న అతడు శ్రీలంకపై ఈ అద్భుతం చేశాడు. 15వ ఓవర్లో వరుసగా మూడు వికెట్లతో చరిత్ర సృష్టించాడు.




సాధారణంగా టీ20 ఫార్మాట్లో బ్యాటర్లదే రాజ్యం! అప్పుడప్పుడు బౌలర్లు సైతం ఆధిపత్యం చెలాయిస్తారు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో తొలి రౌండ్‌ పోటీలు జరుగుతున్నాయి. గీలాంగ్‌ వేదికగా యూఏఈ, శ్రీలంక తలపడ్డాయి. చెన్నైలో జన్మించిన కార్తీక్‌ మెయప్పన్‌ యూఏఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 15వ ఓవర్‌ నాలుగో బంతికి అతడు భానుక రాజపక్సను ఔట్‌ చేశాడు. ఆ తర్వాతి బంతిని ఆడిన చరిత్‌ అసలంక వికెట్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి గోల్డెన్‌ డకౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఆఖరి బంతికి దసున్ శనకను క్లీన్‌బౌల్డ్‌ చేసి సంబరాల్లో మునిగిపోయాడు.




పురుషుల ప్రపంచకప్‌లో టెస్టు జట్టుపై హ్యాట్రిక్‌ సాధించిన తొలి అసోసియేట్‌ జట్టు ఆటగాడిగా కార్తీక్‌ చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20ల్లో యూఈఏ తరఫున తొలి హ్యాట్రిక్‌ తీసిన క్రికెటర్‌గా రికార్డు అందుకున్నాడు. కాగా మెయప్పన్‌ కన్నా ముందు  టీ20 ప్రపంచకప్‌ టోర్నీల్లో నలుగురు మాత్రమే హ్యాట్రిక్‌ తీశారు. 2007లో బ్రెట్‌లీ, 2021లో కర్టిస్‌ కాంఫర్‌, వనిందు హసరంగా, కాగిసో రబాడా సాధించారు.


కార్తీక్‌ మెయప్పన్‌ అద్భుతం చేసినా ఈ మ్యాచులో యూఏఈకి ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్‌ చేసిన శ్రీలంక 20 ఓవర్లకు 8 వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. ఓపెనర్‌ పాథుమ్‌ నిసాంక (74; 60 బంతుల్లో 6x4, 2x6) దూకుడుగా ఆడాడు. ధనంజయ డిసిల్వా (33; 21 బంతుల్లో 3x4, 1x6) ఫర్వాలేదనిపించాడు. ఛేదనకు దిగిన యూఏఈకి దుష్మంత చమీరా (3/15), వనిందు హసరంగ (3/8) చుక్కలు చూపించారు. వెంటవెంటనే వికెట్లు పడగొట్టారు. 17.1 ఓవర్లకే 73కు యూఏఈని కూప్పకూల్చారు. 79 పరుగుల తేడాతో విజయం అందించారు. అయాన్‌ అఫ్జల్‌ ఖాన్‌ (19) యూఏఈ టాప్‌ స్కోరర్‌.