Asia Cup 2023: బీసీసీఐ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌లో అడుగు పెట్టబోమని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఆసియాకప్‌ను తటస్థ వేదికనే ఎంపిక చేయాలని డిమాండ్ చేసింది. ముంబయిలో జరిగిన ఏజీఏంలో బోర్డు సభ్యులు దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చారని తెలిసింది. కార్యదర్శి జే షా గట్టిగానే వాదించాడని సమాచారం.




'ఆసియాకప్‌ను తటస్థ వేదికలో నిర్వహించడం అనివార్యం. మేం పాకిస్థాన్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నాం. తటస్థ వేదికలోనే ఆడాలని మేం నిర్ణయం తీసుకున్నాం' అని జే షా అన్నారు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఆయనే ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవంగా 2022 ఎడిషన్‌ను శ్రీలంక ఆతిథ్యమివ్వాలి. అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో యూఏఈకి తరలించారు.


వచ్చే ఏడాది ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముందు ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ దక్కించుకుంది. మొదట్లో టీమ్‌ఇండియాను అక్కడికి పంపించాలనే బోర్డు భావించిందని సమాచారం. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరదని షా స్పష్టం చేశాడు.


ఐసీసీ ఎన్నికల్లో ఎవరికి మద్దతివ్వాలో బీసీసీఐ ఇంకా నిర్ణయించుకోలేదు. ప్రస్తుత ఛైర్మన్‌ గ్రెగ్‌ బార్క్‌లేకే రెండో దఫా అనుకూలంగా ఉండాలని భావిస్తోంది. అయితే అర్హత ఉందనుకున్నవాళ్లు నామినేషన్‌ దాఖలు చేయొచ్చని వెల్లడించింది. ఈ లెక్కన గంగూలీకి బోర్డు మద్దతు ఇవ్వబోదని స్పష్టమవుతోంది. 2021-22 ఆడిట్‌ చేసిన ఖాతాలను బీసీసీఐ ఆమోదించింది. 2022-23 వార్షిక బడ్జెట్‌ను జనరల్‌ బాడీ ఆమోదించింది. అలాగే మహిళల ఐపీఎల్‌కు పచ్చజెండా ఊపింది.