India - Pakistan: బీసీసీఐ కార్యదర్శి జే షా చేసిన వ్యాఖ్యలు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డును కలవరపెట్టాయి. ఒకవేళ ఆసియాకప్‌ ఆడేందుకు టీమ్‌ఇండియా రాకపోతే భారత్ ఆతిథ్యమిచ్చే వన్డే ప్రపంచకప్‌ ఆడబోమని పీసీబీ అంటోంది. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ నుంచి తప్పుకొనే అంశాన్నీ పరిశీలిస్తామని బెదిరింపులకు దిగనున్నట్టు తెలిసింది.




'ఆసియాకప్‌ను తటస్థ వేదికలో నిర్వహించడం అనివార్యం. మేం పాకిస్థాన్‌లో పర్యటించకూడదని నిర్ణయించుకున్నాం. తటస్థ వేదికలోనే ఆడాలని మేం నిర్ణయం తీసుకున్నాం' అని జే షా అన్నారు. ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌గా ఆయనే ఉన్న సంగతి తెలిసిందే. వాస్తవంగా 2022 ఎడిషన్‌ను శ్రీలంక ఆతిథ్యమివ్వాలి. అక్కడ పరిస్థితులు బాగా లేకపోవడంతో యూఏఈకి తరలించారు. వచ్చే ఏడాది ఆసియాకప్‌ వన్డే ఫార్మాట్లో జరగనుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ ముందు ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుంది. అయితే ఆతిథ్య హక్కులను పాకిస్థాన్‌ దక్కించుకుంది. మొదట్లో టీమ్‌ఇండియాను అక్కడికి పంపించాలనే బోర్డు భావించిందని సమాచారం. కానీ ఇప్పుడు వెళ్లడం కుదరదని షా స్పష్టం చేయడం గమనార్హం.


'పీసీబీ ఇప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే బహుళ జట్లు ఆడే టోర్నీలో భారత్‌, పాక్‌ తలపడకపోతే వాణిజ్యపరంగా చాలా నష్టపోవాల్సి వస్తుంది' అని సీనియర్‌ ఓసీబీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. అసలు తటస్థ వేదిక గురించి చెప్పేందుకు జే షా ఎవరని పీసీబీ ప్రశ్నిస్తోంది. ఏసీసీ బోర్డు తమకు ఆతిథ్య హక్కులు ఇచ్చిందని, ఛైర్మన్‌ అయిన జే షా కాదని అంటోంది. ఒకవేళ ఆసియాకప్‌ కోసం టీమ్‌ఇండియా పాకిస్థాన్‌కు రాకుంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే వన్డే ప్రపంచకప్‌ నుంచి తప్పుకొనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.




సీమాంతర ఉగ్రవాదాన్ని విడిచిపెట్టేంత వరకు పాకిస్థాన్‌లో అడుగుపెట్టొద్దని భారత్‌ నిర్ణయించుకుంది. 2008 నుంచి వారితో ద్వైపాక్షిక సిరీసులు ఆడటం లేదు. 2006లో టీమ్‌ఇండియా చివరి సారిగా పాక్‌లో పర్యటించింది. 2012లో దాయాది 6 మ్యాచుల సిరీసు కోసం భారత్‌కు వచ్చింది. ఫ్యూచర్స్‌ టోర్నీ ప్రోగ్రామ్‌ (FTP) ప్రకారం రాబోయే మూడేళ్లలో పాకిస్థాన్‌ రెండు కీలక టోర్నీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. వచ్చే ఏడాది 50 ఓవర్ల ఫార్మాట్లో ఆసియాకప్‌ నిర్వహించనుంది. 2025లో ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ సైతం అక్కడే జరగాల్సి ఉంది. చాలా ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌కు ఐసీసీ ఈవెంట్ల హక్కులు దక్కాయి.