Delhi Firecrackers Ban: 


దీపాలు మాత్రమే వెలిగించాలి..


దీపాళికి బాణసంచా కాల్చితే నేరుగా జైలుకు పంపుతామంటున్నారు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్. రూ.200 జరిమానాతో పాటు ఆర్నెల్ల పాటు జైలు శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన..ఢిల్లీలో బాణసంచా తయారీ, నిల్వ, విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఎవరు ఈ నిబంధనలు ఉల్లంఘించినా రూ.5000 జరిమానాతో పాటు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తామని వెల్లడించారు. అక్టోబర్ 21న ప్రత్యేక అవగాహనా కార్యక్రమాన్ని ప్రారంభించనుంది ప్రభుత్వం. "బాంబులు పక్కన పెట్టి దీపాలు వెలిగించండి" అనే నినాదంతో ప్రచారం చేయనున్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలోనే శుక్రవారం ఢిల్లీలోని కన్నాట్‌లో సెంట్రల్ పార్క్‌లో 51,000 దీపాలు వెలిగించనున్నారు. బాణసంచాపై నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలు సిద్ధంగా ఉన్నాయని గోపాల్ రాయ్ తెలిపారు. ఏసీపీ కింద 210 బృందాలు, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ కింద 165 బృందాలు, ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ కింద 33 బృందాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయనున్నాయి. 






కాలుష్య కట్టడికి..


దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ తగ్గించేందుకు సెప్టెంబర్‌లోనే ఈ నిర్ణయం తీసుకుంది ఆప్ సర్కార్. వచ్చే ఏడాది జనవరి వరకూ బాణసంచా కాల్చడంపై నిషేధం విధించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్‌ ఈ విషయం వెల్లడించారు. "ఢిల్లీ ప్రజల్ని కాలుష్య ముప్పు నుంచి తప్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన స్పష్టం చేశారు. బాణాసంచా తయారీ, నిల్వ, విక్రయాలు.. అన్నింటిపైనా నిషేధం వర్తిస్తుంది. ఇలా కట్టడి చేయటం ద్వారా కాలుష్యాన్ని చాలా వరకూ కంట్రోల్ చేయొచ్చని ఢిల్లీ ప్రభుత్వం భావిస్తోంది. 2023 జనవరి 1 వ తేదీ వరకూ ఈ నిషేధం అమలవుతుంది. ఆన్‌లైన్‌లోనూ క్రాకర్స్‌ను కొనుగోలు చేయటానికి వీల్లేదు. ఢిల్లీ పోలీసులు దీనికి సంబంధించి ప్లాన్ రెడీ చేస్తున్నట్టు గోపాల్ రాయ్ చెప్పారు. దీపావళి సమయంలో పెద్ద మొత్తంలో బాణాసంచా కాల్చుతారు. ఇది దృష్టిలో ఉంచుకుని..ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఏటా ఢిల్లీ అక్టోబర్, నవంబర్ నెలల్లో కాలుష్య మేఘాలు కమ్మేస్తుంటాయి. ఆ సమయంలోనే బాణాసంచా కాల్చటం వల్ల సమస్య మరీ తీవ్రమవుతోంది. 


గతేడాది సెప్టెంబర్‌లోనూ ఢిల్లీలో బాణాసంచాపై నిషేధం విధించారు. సైలెంట్ జోన్స్‌ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి...ఆ ప్రాంతాల్లో బాణాసంచా కాల్చిన వారికి రూ.20,000 జరిమానా విధించారు. దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా వాయు కాలుష్యం (Delhi Air Pollution) గురించి ప్రస్తావన వస్తే, దిల్లీ సిటీ పేరు తప్పకుండా వినిపిస్తుంది. అంతర్జాతీయంగా అత్యంత కలుషిత నగరాల జాబితాలో దిల్లీ ఎప్పటి నుంచో ఉంది. ఎన్నో నివేదికలు ఇదే విషయాన్ని వెల్లడించాయి. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్య ఉన్నా..ఇప్పుడిప్పుడే పరిష్కరించేందుకు రకరకాల మార్గాలు వెతుక్కుంటోంది ప్రభుత్వం.


Also Read: Congress President Kharge: లేబర్ యూనియన్ లీడర్‌ నుంచి ఓటమి ఎరగని స్థాయికి, ఖర్గే రాజకీయ ప్రస్థానమిదే