Rahul Zodo Yatra : రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయాల్సి ఉందని .. తాము అధికారంలోకి రాగానే అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. కర్నూలు జిల్లా ఆదోనిలో భారత్ జోడోయాత్ర సాగుతోంది.ఈ సందర్భంగా ఆదోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ నిర్వహించారు. పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో అనేక హామీలు ఇచ్చాం..ఆ హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉందన్నారు.   పోలవరం ప్రాజెక్టు, ప్రత్యేక హోదా కూడా ఇచ్చిన హామీల్లో ఉంది. గతంలో జరిగిన విభజన కాకుండా..భవిష్యత్ పై దృష్టి పెట్టాలన్నారు.   


అమరావతికే మద్దతు !
 
ఏపీ రాజధానిపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు.   ఏపీకి ఒకటే రాజధాని.. అదే అమరావతి అని తేల్చి చెప్పారు. మూాడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. మంగళవారం కూడా ఇదే అంశంపై రాహుల్ గాంధీ స్పష్టత ఇచ్చారు. రాహుల్ ను కలిసేందుకు అమరావతి రైతులు కర్నూలు వచ్చారు. వారితో రాహుల్ సమావేశం అయ్యారు. అమరావతికే మద్దతని ప్రకటించారు. అలాగే తాము అధికారంలోకి వస్తే పోలవరం ప్రాజెక్టుని పూర్తిచేస్తాం.. పోలవరం వల్ల వచ్చే ప్రయోజనాలను రైతులకు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీలో పార్టీలు రాజకీయాలను బిజినెస్ లా చూస్తున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  ఏపీలో రైతులు, కార్మికుల హక్కులు కాపాడతామన్నారు. 


భారత్ జోడో  యాత్రకు మంచి స్పందన !


భారత్ జోడో యాత్ర దేశ సమగ్రతకు సంబంధించిందని రాహుల్ స్పష్టం చేశారు.  మా పార్టీ అందరిది. మేం దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విడదీయాలని చూడడం లేదన్నారు.  తన  దృష్టి అంతా భారత్ జోడో యాత్రపైనే ఉంది.. అందరినీ కలుస్తున్నాను.. వారి సమస్యలు వింటున్నాను.. భారత్ ఆర్థికవ్యవస్థను కాపాడాల్సి ఉందన్నారు.  దేశంలో రూపాయిని బలోపేతం చేయాలి. దేశంలో వన్ జీఎస్టీ-వన్ ట్యాక్స్ రావాల్సి ఉందన్నారు.  దేశంలో కుల రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శఇంచారు. కేంద్రం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కాంగ్రె్స పార్టీకి కొత్త అధ్యక్షుడు వస్తున్నారని..  రాబోయే రోజుల్లో నేను ఎలాంటి పాత్ర పోషించాలనేది అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ తెలిపారు.  కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరిగాయన్నారు.  శశిథరూర్ చేసిన విమర్శలపై రాహుల్ గాంధీ పరోక్షంగా స్పందించారు. 


వైఎస్ఆర్‌సీపీతో పొత్తుపై హైకమాండ్‌దే నిర్ణయం !


ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారా అని మీడియా ప్రతినిధులు రాహుల్ గాంధీని ప్రశ్నించారు. అయితే  ఆ విషయంలో నేను నిర్ణయం తీసుకోలేను. పార్టీ అధ్యక్షునిదే తుది నిర్ణయం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.  పొత్తుల విషయంపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని రాహుల్ పేర్కొన్నారు. కాంగ్రెస్ లో ఉన్నంత ప్రజాస్వామ్యం మరే పార్టీలోనూ లేదు. ఈ యాత్ర రాజకీయాలకు సంబంధించి కాదని అన్నారు.  అలాగే కాంగ్రెస్ పార్టీలో తన పాత్ర ఏంటో అధ్యక్షుడు నిర్ణయిస్తారని రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చివరి కోరిక అని జగన్ సొంత పార్టీ  పెట్టక ముదు చెప్పారు. అదే సమయంలో గతంలో ప్రశాంత్ కిషోర్.. ఏపీలో  వైఎస్ఆర్‌సీపీతో పొత్తు  పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదిక ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.