దోస్త్ మేరా దోస్త్ అని పాడుకున్నారు. కలిసి చాలా చదువుకున్నారు. వ్యాపారం కూడా చేస్తున్నారు. ఎవరి ఫ్యామిలీ వాళ్లకు ఉంది. చిన్నప్పుడు మొదలైన స్నేహం అలాగే కొనసాగుతోంది. కాలం మారుతున్న కొద్ది వాళ్ల చెలిమి మరింత బలపడింది.
ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒకరిని కాదని మరొకరు ఉండలేకపోవడం చాలా విచిత్రం అనుకున్నారు అంతా. ఇదెక్కడి విడ్డూరమని చెవుళ్లు కొరుకున్నారు. అందర్నీ విషాదంలో నింపేస్తూ ఒకర్ని విడిచి మరొకరు ఉండలేమంటూ కన్నుమూశారు.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. చిన్ననాటి మిత్రుడు 15 రోజుల క్రితం కరోనాతో చనిపోయాడు. దాన్ని జీర్ణించుకోలేకపోయాడు మరో యువకుడు.
పోచంపాడ్ శ్రీనివాస్, కంచు రవి ఇద్దరు ప్రాణ మిత్రులు. ఒకరిని ఒకరు విడిచి ఉండేవారు కాదు. చదువు, వ్యాపారం అంతా కలిసే చేసుకునేవారు. శ్రీనివాస్, కంచు రవి ఇద్దరూ పదో తరగతి వరకూ కలిసే చదువుకున్నారు. ఇద్దరూ కలిసే పాల వ్యాపారం చేసేవారు.
శ్రీనివాస్‌కు ఈ మధ్య కరోనా సోకింది. చికిత్స పొందుతూ చనిపోయాడు. శ్రీనివాస్‌కు ఇంకా పెళ్లికాలేదు. ఆయన తండ్రి కూడా మూడు రోజుల క్రితం చనిపోయాడు.
వీళ్ల ఇద్దరి అంత్యక్రియలను కంచు రవి దగ్గర ఉండి జరిపించాడు. అప్పటి నుంచి చాలా ముభావంగా ఉంటూ వచ్చాడు. ఇంట్లో కూడా పెద్దగా ఎవరితో మాట్లాడేవాడు కాదు. శ్రీనివాస్‌తో స్నేహం మరిచిపోలేకపోయాడు రవి. అతని జ్ఞాపకాలు రవిని వెంటాడాయి.
ప్రాణంగా కలిసి తిరిగిన స్నేహితుడే లేని బతుకు తనకేందుకనుకున్నాడు రవి. శ్రీనివాస్ మృతిని తట్టుకోలేక తాను చనిపోతున్నట్లు రవి సూసైడ్ నోట్ రాసి పెట్టి చనిపోయాడు. ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకుని చనిపోయాడు.
మిత్రుడు శ్రీనివాస్ సమాధి పక్కనే తనను ఖననం చేయాలని.. అక్కడే సమాధి కూడా ఏర్పాటు చేయాలని కంచు రవి సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
శ్రీనివాస్, రవి విషాద కథనం తెలుసుకున్న వారంతా తీవ్ర మనో వేదనకు లోనయ్యారు. శ్రీనివాస్, కంచు రవి ఇంట్లోవాళ్లు కన్నీరుమున్నీరు అవుతున్నారు.
Also Read: పనికి మాలిన, పసలేని, గోల్ మాల్ బడ్జెట్ : కేసీఆర్
Also Read: ఆశల్లేవన్న కేసీఆర్ అంచనాలను నిజం చేసిన నిర్మలమ్మ .. బడ్జెట్‌లో తెలంగాణకు నిరాశే !