సాంకేతికత రాన్రానూ కొత్త పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా డ్రోన్లు ప్రస్తుతం మన ఎన్నో అవసరాలను తీర్చుతున్నాయి. వ్యవసాయ రంగం నుంచి మెడికల్ రంగం వరకూ దాదాపు ప్రతి అవసరానికి డ్రోన్లు వాడుతున్నారు. గత ఏడాది కరోనా సంక్షోభ సమయంలో వికారాబాద్ జిల్లాలో ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి డ్రోన్ల ద్వారా కొవిడ్ వ్యాక్సిన్లు పంపి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తిన సంగతి తెలిసిందే. విదేశాల్లో అయితే ఇప్పటికే ఫుడ్ డెలివరీలు కూడా కొన్ని చోట్ల జరుగుతున్నాయి. మన దగ్గర ఇలాంటి ప్రయోగాలు ఇప్పుడిప్పుడే చేపడుతున్నారు. అందులో భాగంగానే గత ఏడాది వికారాబాద్ జిల్లాలో వ్యాక్సిన్లను డ్రోన్ల ద్వారా సరఫరా చేశారు. తాజాగా నిజామాబాద్ జిల్లాలోనూ ఈ తరహా ప్రయోగం జరిగింది.
నిజామాబాద్ నుంచి నిర్మల్ కు తొలిసారి డ్రోన్ ద్వారా మందులు సరఫరా చేసింది టీశా - మెడికార్ట్ అనే స్టార్టప్ కంపెనీ. డ్రోన్ ద్వారా ఔషధాల సరఫరాను సోమవారం ప్రారంభించింది. తొలి ప్రయత్నంగా నిజామాబాద్ నుంచి నిర్మల్ జిల్లా కేంద్రానికి విజయవంతంగా చేరవేసింది. నిర్మల్ జిల్లా కేంద్రంలో డాక్టర్ ప్రశాంత్ ఆ మందులను స్వీకరించారు. ఏకంగా 70 కిలో మీటర్ల పాటూ డ్రోన్ ఆ మందులను మోసుకెళ్లింది.
నిజామాబాద్ నుంచి నిర్మల్ దాదాపు 70 కిలో మీటర్ల దూరంలో ఉంది. రోడ్డుపై వెళ్లాలంటే ఎంత తక్కువ అనుకున్నా గంటన్నరకు పైగా సమయం పడుతుంది. డ్రోన్ ద్వారా మందులను పంపడంతో గాలిలో అరగంట కన్నా తక్కువ సమయంలోనే ఔషధాలు నిర్ణీత ప్రదేశానికి చేరుకున్నాయి. ఉపగ్రహ పరిజ్ఞానం ఆధారంగా డ్రోన్ ఎక్కడకు చేరుకోవాలో, ఎలా చేరుకోవాలో ముందుగానే నిర్ణయిస్తారు. భూమికి 400 అడుగులపైన గాలిలో ప్రయాణించే ఈ డ్రోన్ చేరుకోవాల్సిన ప్రదేశంలో క్యూఆర్ కోడ్ ను అతికిస్తారు. 60 మీటర్ల దూరం నుంచే ఆ క్యూఆర్ కోడ్ ను రీడ్ చేసి డ్రోన్ అక్కడ దిగుతుంది. ఈ విధానంలో 20 కిలోల వరకు మందులను సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుందని డాక్టర్ ప్రశాంత్ తెలిపారు. తొలిసారిగా ఇలా డ్రోన్ తో మందులను సరఫరా చేశామని ఆయన పేర్కొన్నారు.
డాక్టర్ ప్రశాంత్ మాట్లాడుతూ.. బిజినెస్ టు బిజినెస్ పద్ధతిలో సదరు సంస్థ నిర్వహకులు మందులను సరఫరా చేస్తారని అన్నారు. ట్రాఫిక్ రద్దీని అధిగమించేందుకు, తక్కువ సమయంలోనే మందులు తీసుకొచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతోందని చెప్పారు. డ్రోన్ ద్వారా ఆసుపత్రికి మందులను సరఫరా చేయడం దేశంలోనే తొలిసారని అన్నారు.
మంత్రి కేటీఆర్ స్పందన
తొలిసారిగా నిజామాబాద్ నుంచి నిర్మల్‌కు తొలిసారిగా డ్రోన్ సాయంతో ఔషధాల తరలింపుపై మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా హర్షం వ్యక్తం చేశారు. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఔషధాలు సరఫరా చేయడం సంతోషకరమని అన్నారు. ఈ మేరకు మంత్రి ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక ప్రాజెక్టు మెడిసిన్ ఫ్రం ద స్కైలో తెలంగాణ ముందు ఉండడం గర్వకారణమని అన్నారు. సమాజానికి ఉపయోగపడని, మేలు చేయని సాంకేతికత ఎందుకు ఉపయోగపడదని ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు పదేపదే చెబుతుంటారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.