Dalitha Bandhu Scheme: నిర్మల్ జిల్లాలో బతుకమ్మ చీరల పంపిణీకి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా నర్సాపూర్ - జి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దళితబంధు పథకం గురించి మాట్లాడుతుండగా.. మంత్రి ప్రసంగాన్ని కొందరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దళిత బంధుకు తాము అర్హులమైనా తమకు దళితబంధు ఎందుకు ఇవ్వడం లేదని మంత్రిని నిలదీశారు. దీంతో ఆవేశానికి లోనైన మంత్రి ఇంద్రకరణ్... తమకు ఇష్టం వచ్చిన వాళ్లకు మాత్రమే దళిత బంధు ఇస్తామంటూ మహిళలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దళిత బంధు వచ్చే వరకు ఓపిక పట్టాలని.. లేకుంటే ఏం చేయలేమని అన్నారు.
"మా ఇష్టం వచ్చినోళ్లకు దళితబంధు ఇచ్చుకుంటం.. నువ్వు బయటకు పో.. ఇచ్చింది ఎక్కువైతే ఇలాగే ఉంటది. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావో చూపెట్టు. దళిత బంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అవి అన్నం పెడుతాయా..? రూ.10 లక్షలతో ఏం చేసి బతుకుతారు..? మీకు ఏం అనుభవం ఉంది. చెబితేనే దళిత బంధు ఇస్తాం. దళిత బంధు మీకు మేమియ్యం. కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుండే తీసుకోండి. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా. వాళ్ల దగ్గరి నుండి దళిత బంధు తెచ్చుకోండి." - మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
మీకు ఇవ్వం.. మాకు ఇష్టం వచ్చిన వాళ్లకు మాత్రమే ఇస్తామంటూ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మహిళపై ఫైర్ అయ్యారు. ముందు నువ్వు బయటకు పో అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇచ్చింది ఎక్కువ అయితే అట్లానే ఉంటుందంటూ కామెంట్లు చేశారు. 10 లక్షలు ఇస్తే ఏం చేస్తావని మహిళను ప్రశ్నించారు. దళితబంధుతో కార్లు, ట్రాక్టర్లు కొంటే అన్నం పెడతాయా అంటూ అడిగారు. పది లక్షల రూపాయలతో ఏం చేసి బతుకుతారని అన్నారు. మీకు ఏం అనుభవం ఉందో చెబితేనే దళితబంధు ఇస్తామన్నారు. దళిత బంధు మీకు ఇవ్వం అంటూ మంత్రి మహిళపై మండిపడ్డారు. బీజేపీ వాళ్లతో తిరుగుతున్నారు కదా... కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ల నుంచే దళితబంధు తీస్కోండి అంటూ కామెంట్లు చేశారు. నిలదీసిన మహిళలను బయటకు పంపించాలని పోలీసులను ఆదేశించారు.
దళితుల అభివృద్ధి మా ధ్యేయం..
రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాల అభివృద్ధి కావాలంటే పేదల జీవితాలు మెరుగుపడాలని కలలు కన్నారని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దళితుల అభి వృద్ధి, సంక్షేమం కోసం అనేక చర్యలు చేపట్టిందని గుర్తు చేశారు హరీష్ రావు. ఏళ్లు గడుస్తున్నా దళిత జాతి ఇంకా అణగారిన వర్గంగానే ఉందన్నారు. షెడ్యూల్ కులాలు, తెగల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ప్రత్యేక ప్రగతి నిధి చట్టాన్ని ప్రవేశ పెట్టామన్నారు. ఎస్సీ, ఎస్టీల జనాభా నిష్పత్తి మించి నిధులు కేటాయిస్తున్న సంగతి వివరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో కేటాయించిన నిధులు పూర్తిగా ఖర్చు కాని పక్షంలో ఆ నిధులను తర్వాత ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేస్తున్నట్టు తెలిపారు. ఇలాంటి చట్టం తీసుకొచ్చిన తొలి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. దళితులకు కేటాయించిన నిధులు ఎక్కడ ఎలా ఖర్చు చేశామో ప్రతి సభ్యుడికి ఇచ్చామన్నారు.