- గిరిజనుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది 
- రాష్ట్ర అటవీ దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి 
గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తున్నదని, తండాలకు, గుడాలకు పంచాయతీల హోదాతో గిరిజనులకు పాలనాధికారం కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రిదేనని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహించిన గిరిజన ఉత్సవాల్లో పాల్గొన్నారు. ముందుగా గిరిజన దినోత్సవాని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లోని HKGN గార్డెన్ లో ఐటిడిఏ అధ్వర్యంలో నిర్వహించిన గిరిజన సంబురాలలో ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. గిరిజన సంప్రదాయ గుస్సాడి నృత్యాలతో మంత్రికి ఘన స్వాగతం పలికారు. 


ఐటీడీఏ ద్వారా ఏర్పాటు చేసిన వివిధ స్టాల్ లను మంత్రి, ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి, శాసన సభ్యులు ప్రారంభించి పరిశీలించారు. అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించి, తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేశారు. ముందుగా డిడి దిలీప్ కుమార్ గిరిజన సంక్షేమ శాఖ ప్రగతి నివేదిక ను సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తొమ్మిదేళ్ల పాలనలో గిరిజనుల అస్తిత్వాన్ని గుర్తించి వారి అభివృద్ధి, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నదని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలోని 362 గిరిజన తండాలు, గోండు గూడాలను స్వయం పరిపాలన కోసం నూతన పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో గిరిజనులే సర్పంచులు, వార్డ్ మెంబర్లుగా ఎన్నికై పాలించుకుంటున్నారని తెలిపారు. నూతన గ్రామ పంచాయతీలకు రూ. 20 లక్షల చొప్పున నిధులతో గ్రామ పంచాయతీ భవనాలు నిర్మించడం జరుగుతుందని తెలిపారు. కేస్లాపూర్ నాగోబా జాతర, దర్బార్, కొమురం భీం జయంతి, వర్ధంతిల సభలను ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ సందర్బంగా గిరిజనుల సమస్యలను దశల వారీగా పరిష్కరిస్తున్నామన్నారు. త్వరలోనే పోడు భూములకు పట్టాలను ఇవ్వనున్నామన్నారు. 


బీసీ చేతి, కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నామని, అర్హులందరు ఈ నెల 20 లోగా దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించేందుకు ఉమ్మడి జిల్లాకు 4 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. గిరిజనులకు ఆత్మగౌరవం కల్పించే విధంగా ప్రభుత్వం హైదరాబాదులో ఆదివాసీ, బంజారా భవనాలను నిర్మించి ప్రారంభించిదన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని మారుమూల గిరిజన తండాలు, గుడాలకు రోడ్డు సదుపాయం కల్పించేందుకు 350 కోట్లతో పనులు చేపట్టి జరుగుతున్నాయన్నారు. 100 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగిస్తున్న గిరిజన కుటుంబాలకు ఉచిత విద్యుత్ అమలవుతోందని గుర్తు చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యా బోధన అందించాలనే సంకల్పంతో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో 25 గురుకులాలు, 4 ఏకలవ్య మోడల్ రెసిడెషియల్ పాఠశాలలు ప్రారంభించడం జరిగిందన్నారు. ఆశ్రమ పాఠశాలలను ఇంగ్లీష్ మీడియం బోధనను అందుబాటులోకి తీసుకురావడం పాటు కంప్యూటర్ ల్యాబ్ సదుపాయం కల్పించడం జరిగిందన్నారు. 
విదేశీ విద్యకు రూ.20 లక్షల ఆర్థిక సహాయం
గిరిజన విద్యార్థులు విదేశీ విద్యనభ్యసించేందుకు 20 లక్షల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, ఇప్పటి వరకు 10 మంది విద్యార్థులకు 1.83 కోట్ల రూపాయలు మంజూరు చేశామన్నారు. ఆరు శాతానికి పరిమితమైన గిరిజన రిజర్వేషన్ ను జనాభా ప్రాతిపదికన పది శాతానికి పెంచిన ఫలితంగా ఎంతో మంది గిరిజనులకు విద్యా, ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయన్నారు. మిషన్ భగీరథ ద్వారా గిరిజన తండాల్లోని ప్రతి గుడిసె, ప్రతి ఇంటికి ప్రభుత్వం కుళాయిల బిగించి, సురక్షిత మంచినీటిని అందించడంతో అనారోగ్యాల బారిన పడే పరిస్థితి దూరమయ్యిందని అన్నారు. నేడు గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో రోడ్లు, మంచినీరు, విద్యుత్, ప్రాథమిక విద్యా, ప్రాథమిక ఆరోగ్యం వంటి అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. 


ఆదిలాబాదు జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ మాట్లాడుతూ, రాష్ట్రం ఆవిర్భవించి తొమ్మిది సంవత్సరాలు పూర్తైన సందర్బంగా దశాబ్ది ఉత్సవాలలో భాగంగా నేడు గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. దేశంలో మారె రాష్ట్రంలో లేని విధంగా బడుగు బలహీన వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు పరుస్తున్నదని వివరించారు.


ఖానాపూర్ శాసన సభ్యురాలు రేఖ శ్యామ్ నాయక్ మాట్లాడుతూ.. గిరిజన దినోత్సవం సందర్బంగా అందరి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్నో అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాలను ప్రభుత్వం చేపట్టిందన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలలో మౌళిక సదుపాయాల కల్పనకు వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, సేగ్రిగేషన్ షెడ్ లు, సీసీ రోడ్లు, రహాద్రుల నిర్మాణం, పచ్చదనం పెంపునకు నర్సరీలో మొక్కల పెంపకం,  హరితహారం క్రింద మొక్కలు నాటడం వంటి  అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు కోట్లాది రూపాయల నిధులను మంజూరు చేసిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో గిరిజనులను మెరుగైన సేవలు అందుతున్నాయని, కెసిఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, అమ్మ ఒడి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు.


బోథ్ శాసన సభ్యులు రాథోడ్ బాపూరావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గిరిజన గ్రామాల రూపురేఖలే మారిపోయాయని అన్నారు. గ్రామాల అభివృద్దే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించిందని గుర్తుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలే అందుకు నిదర్శనమన్నారు. రైతుబంధు, రైతు భీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా ఫించన్లు వంటి వినూత్న సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నదని తెలిపారు. 


ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి కర్నాటి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. గిరిజనుల అభ్యున్నతికి గత తొమ్మిది సంవత్సరాలలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు పరుస్తున్నామని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాలలో నూతనంగా ఏర్పడిన 230 గ్రామపంచాయితీ భవనాలను నిర్మించడం జరుగుతుందన్నారు. గ్రామాలలో పారిశుధ్య నిర్వహణ, పరిశుభ్రతే ధ్యాయంగా నిరంతరం పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిచడంతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులను నియంత్రించగలిగామన్నారు. రహదారులతో పాటు గిరిజన తండాలు, గుండాలకు సీసీ రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు. స్వయం ఉపాధి పథకాలను మంజూరు చేయడం ద్వారా PVTG కుటుంబాలు ఆర్థికాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. అక్షర జ్యోతి కార్యక్రమంతో విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించడం జరిగిందన్నారు. పాఠశాలల్లో సైన్స్ ఫెయిర్, క్రీడ పోటీలు, వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహించి విద్యార్థులలో విజ్ఞాన, నైపుణ్యాలను పెంపొందించడం జరుగుతుందన్నారు. 


గిరిజన రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి అధిక దిగుబడులు సాధించేలా ఉద్యానవన శాఖ ద్వారా శిక్షణలు అందిస్తున్నామని, మలబార్, ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. సిఎం గిరి వికాస్ పథకం ద్వారా గిరిజన రైతులకు వంద శాతం సబ్సిడీతో మోటార్ లను పంపిణీ చేశామన్నారు. 600 గిరిజన ఆవాసాలకు త్రి ఫెస్ విద్యుత్ సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా నాణ్యమైన వైద్యసేవలను అందించడంతో పాటు పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు మగువలడ్డు, గుడ్లు వంటి పౌష్టికాహారం అందించి రక్తహీనతను నియంత్రిస్తున్నామన్నారు. ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు గాను ఉట్నూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆసుపత్రికి జాతీయ స్థాయి ముస్కాన్ అవార్డు రావడం జరిగిందన్నారు. గిరిజనుల సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతూ వారి అభ్యున్నతికి ఐటిడిఎ ద్వారా మున్ముందు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ప్రాజెక్టు అధికారి ఈ సందర్బంగా పేర్కొన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు కార్యక్రమంలో ఎంతగానో అలరించాయి. అనంతరం MSME ద్వారా గిరిజన లబ్దిదారులకు 1.50 కోట్ల చెక్కును, హాకీ క్రీడా కారులకు క్రీడా సామాగ్రిని అందజేశారు.


అంతకుముందు ఉట్నూర్ లో 500 లీటర్ల పాలసేకరణ సామర్థ్యం గల డైరీ యూనిట్ ను మంత్రి, శాసన సభ్యులు, ప్రాజెక్టు అధికారి ప్రారంభించి, పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు ఈశ్వరి బాయి, ఆదిమ గిరిజన సలహా మండలి చైర్మన్ కనక లక్కే రావు, అధికారులు, సిబ్బంది, జడ్పీటీసీలు, ఎంపీపీ లు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.