Protest Against Amit Shah comments on Ambedkar | భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబి చౌరస్తాలో మంగళవారం రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్. అంబేద్కర్ కు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుండి కలెక్టరేట్ వరకు మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్, నస్పూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్, లక్షెటిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, నాయకులు, మహిళా నాయకురాలు, యువజన కాంగ్రెస్ నాయకులు, NSUI నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టి అనంతరం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కి వినతి పత్రం అందజేశారు.
అమిత్ షా కు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ
ఈ సందర్భంగా తెలంగాణ గిరిజన కోఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పోరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి మాట్లాడుతూ.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గురించి రాజ్యసభలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా AICC, TPCC పిలుపు మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కు వ్యతిరేకంగా భారీ నిరసన ర్యాలీ చేపట్టాం. ఐబి చౌరస్తాలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు నివాళి అర్పించాం. అక్కడినుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
రాజ్యాంగ నిర్మాత ఇచ్చిన హక్కుల తోనే నేడు రాజ్యసభలో అడుగుపెట్టి ఆయన పైనే అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. అమిత్ షా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో మోడీ చార్సోపార్ అనే నినాదం తీసుకువచ్చారన్నారు ఒకవేళ నిజంగానే 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చే కుట్రనే జరిగేదని, అదే విధంగా నేడు బీజేపీ నేతల ప్రయాణం కుట్రలకు తెరలేచిందన్నారు.
అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి
అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హేయమైనవని, అంబేద్కర్ అంటే ఒక వ్యక్తి కాదు ఒక శక్తి అన్నారు. అమిత్ షా వ్యాఖ్యలు చేసిన సమయంలో పార్లమెంటులో ఉన్న కొంతమంది సభ్యులు చప్పట్లు కొట్టడం సిగ్గుగా అనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఎవరైతే ఈ దేశానికి రాజ్యాంగాన్ని రచించి మనకోసం హక్కులు కల్పించారో, ఆయననే అవమానిస్తూ హేళన చేయడం సిగ్గుచేటు అన్నారు. అమిత్ షా ను తక్షణం మంత్రి పదవి నుంచి తొలగించి దేశ ప్రజలందరికీ కూడా ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు.