Today's Weather Report: తెలుగు రాష్ట్రాలకు మరోసారి తుపాను హెచ్చరికలను చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో వర్షావరణం ఏర్పడింది. ఇదే నెలలో బంగాళాఖాతంలో రెండు, అరేబియా సముద్రంలో ఒక తుపాను ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. రెండు మూడు రోజుల్లోనే దీని ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పడుతుందని అంటున్నారు.
పొంచి ఉన్న తుపానుల భయం
దసరా అంటేనే తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా ప్రాంత ప్రజలు వణికిపోతారు. చాలా కాలం నుంచి దసరా టైంలో తుపాను చుట్టు ముట్టి అల్లకల్లోలం చేయడాన్ని చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో మూడు తుపానులు రాబోతున్నాయని వాతావరణం చెబుతుంటే ప్రజల్లో భయం మొదలైంది.
ప్రస్తుతం బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు పడతాయని చెబుతోంది వాతావరణ శాఖ. రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయి. పశ్చిమ - మధ్య దక్షిణ బంగాళాఖాతం వద్ద సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి చేరువగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఏపీలోని మూడు ప్రాంతాల్లో కూడా వర్షావరణం(Andhra Pradesh Weather Today )
మూడు ప్రాంతాల్లో అంటే ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఒకేలాంటి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం మేఘావృతమై ఉంటుందని... అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపింది. ఆదివారం కూడా అటు సిక్కోలు నుంచి ఇటు అనంతపురం వరకు అక్కడక్కడ వర్షాలు పడ్డాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు కూడా ఒకట్రెండు డిగ్రీలు పెరిగాయి.
తెలంగాణలో వాతావరణం ఎలా ఉందంటే? (Telangana Weather Today)
తెలంగాణలో కూడా 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పిడన ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలతోపాటు పశ్చిమ, వాయువ్య దిశ నుంచి గాలులు వీస్తాయి. ఇవాళ వివిధ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవి నిజమాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలు.
హైదరాబాద్‌లో వాతావరణం (Hyderabad Weather Today)
హైదరాబాద్‌లో వాతావరణం కాస్త కూల్‌గా ఉంటుదని వాతావరణ శాఖ పేర్కొంది. మేఘావృతమై ఉంటుందని అక్కడక్కడ వర్షాలు పడొచ్చని పేర్కొంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో జల్లులు పడొచ్చని చెప్పింది. గరిష్ణ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలు ఉండొచ్చని అంచనా వేసింది. ఆదివారం గరిష్ణ ఉష్ణోగ్రత 32.3 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 23.5 డిగ్రీలుగా రిజిస్టర్ అయింది.
దేశంలోని 12 రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీలో ఎక్కువ వేడిని ఎదుర్కోవలసి ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలు 27 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉండే అవకాశం ఉంది.తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, దక్షిణ కర్ణాటక, లక్షద్వీప్‌లలో కూడా భారీ వర్షాలు కురవనున్నాయి. అరుణాచల్ ప్రదేశ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Also Read: ఐదో రోజు మహా చండి అలంకారంలో విజయవాడ కనక దుర్గమ్మ .. ఈ అలంకారం విశిష్టత ఏంటంటే!