Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్, విపత్తు విభాగం డిప్యూటీ కమాండెంట్ సింగ్‌ పర్యటించారు. ముందుగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని జిఎన్ఆర్ కాలనీలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలసి వర్షాకాలంలో ఏర్పడే వరద ముప్పును నివారించేందుకు శాశ్వత పరిష్కార చర్యలు తీసుకునేలా కాలనీలో పర్యటించారు. కాలనీవాసులతో ముఖాముఖీగా మాట్లాడి వరదల వల్ల ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరంగా అధికారులు తెలుసుకున్నారు. గత కొంతకాలంగా ప్రతి ఏటా వర్షాకాలంలో తీవ్రంగా వరదలు సంభవిస్తున్నాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నివాసితులు పేర్కొన్నారు. అధిక వర్షపాతం కారణంగా వరద ముప్పు తలెత్తుతుందని, పరివాహక ప్రాంతాల్లో నిర్మించిన చెక్‌డ్యామ్ వల్ల నీటి ప్రవాహం వరదనీరు కాలనిలో చేరుతుందని కలెక్టర్ తెలిపారు. చెక్‌డ్యామ్ ఎత్తు తగ్గించేందుకు అనుమతులు లభించాయని, తగిన చర్యలు తీసుకుని సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం గతంలో సంభవించిన వరదల ఫోటో ఎగ్జిబిషన్‌ ద్వారా వాటి తీవ్రతను అధికారులకు వివరించారు.

Continues below advertisement


కడెం పరివాహక ప్రాంతాల్లో ముంపు నివారణకు చర్యలు చేపడతాం 


కడెం నది పరివాహక ప్రాంతాలు ముంపునకు గురికాకుండా అవసరమైన పటిష్ట చర్యలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ అన్నారు. శనివారం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన కడెం ప్రాజెక్టును సందర్శించి, గేట్ల పనితీరు, వరద నియంత్రణ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎన్ డి ఆర్ ఎఫ్ డిప్యూటీ కమాండర్ దామోదర్ సింగ్, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌తో కలిసి ప్రాజెక్టు వద్ద జరిగిన విస్తృత సమీక్షలో ప్రత్యేక కార్యదర్శి పాల్గొన్నారు. గతంలో ప్రాజెక్టులో నీటి మట్టం పెరిగిన సమయంలో గేట్లు ఎత్తే ప్రక్రియలో లోపాలు తలెత్తిన నేపథ్యంలో ప్రమాదకర పరిస్థితులు ఏర్పడినట్టు జిల్లా కలెక్టర్ వివరించారు. దీనిపై స్పందించిన అర్వింద్ కుమార్, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కడెం, దస్తురాబాద్ మండలాల్లో వరద ముప్పుకు గురయ్యే 10 నుంచి 12 గ్రామాల్లో మెరుగైన అలారం వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వర్షాలు అధికంగా కురిసినప్పుడు వరద నీటిని సమర్ధవంతంగా నియంత్రించేందుకు నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యచరణ సిద్ధం చేయాలని సూచించారు. అనంతరం ప్రాజెక్టు నిర్వహణ తీరును పరిశీలించిన ప్రత్యేక కార్యదర్శి ఇంజనీరింగ్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, ఆర్డీవో రత్న కళ్యాణి, ఎస్ఈ రవీందర్, ఈఈ విట్టల్, తహసిల్దార్లు ప్రభాకర్, సర్పరాజ్, ఎంపిడిఓ అరుణ, తదితరులు పాల్గొన్నారు.


ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు, వరదలు ఎదుర్కోవడానికి ప్రత్యేక చర్యలు


ప్రకృతి వైపరీత్యాలు, వరదలను ఎదుర్కొవడానికి అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఐటిడిఎ కార్యాలయంలో శనివారం పీవీటీజి, వరద ముంపు ప్రభావిత ప్రాంతాలపై సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో వరదలు, ప్రకృతి వైపరీత్యాలు సంభంవించినప్పుడు తీసుకోవలిసిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ.. వర్షాకాలంలో వచ్చే ఫ్లడ్ డ్యామేజ్, వేడిగాలుల పై తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వరద సహాయ చర్యలు అందించడానికి  ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అలాగే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వలన వేడి గాలులు వీస్తుండడంతో ఎండలో పనిచేసేవారు తలకు రుమాలు చుట్టుకోవాలని, టోపీ, గొడుగు లాంటివి వెంట ఉంచుకోవాలన్నారు. అలాగే గతంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో వరదలకు కల్వర్టులు, రోడ్స్ డ్యామేజ్, నిధులు కేటాయించిన, నిర్మాణ పనుల వివరాలు టోకెన్‌తో సహా సమర్పించాలని ఆన్నారు. ముఖ్యంగా పీవీటీజలపై ప్రత్యేక శ్రద్దవహించాలని ఆన్నారు.