Telangana Rains: రాష్ట్రవ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షం కురుస్తూనే ఉంది. నెలరోజులుగా కురవని వర్షం అంతా గురువారం ఒక్కరోజే కురిసింది. ఈ వర్షం వల్ల రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నా, పట్టణాలు, నగరాల్లో ఉండే చాలా మంది ప్రజలు మాత్రం తెగ ఇబ్బందులు పడుతున్నారు. ఇంకెన్ని రోజులు రా బాబు ఈ వర్షం అనుకుంటున్నారు. అయితే గురువారం రోజు కుమురం భీం జిల్లా బెజ్జూరులో 20 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. అలాగే హైదరబాద్ సహా అన్ని నగరాలు, పట్టణాలు, మండలాల్లో పెద్ద ఎత్తున వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో రహదారులు చెరువులను తలపించాయి. ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు, వంకలు, పొంగిపొర్లడంతో పలు ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించాయి. ఈదురుగాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అనేక చోట్ల విద్యుత్ కు తీవ్ర అంతారయం ఏర్పడింది. 


వర్షాకాలం వచ్చినప్పటి నుంచి గురువారం రోజు అత్యధికంగా 34.5 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం కురిసింది. కుమురం భీం, మంచిర్యాల, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, జనగామ, మహబూబాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, వరంగల్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. నిజామాబాద్ జిల్లాలో బుధువారం ఉదయం 8 గంటల నుంచి గురువారం రాత్రి ఉదయం 8 గంటల వరకు ఇందల్ వాయిలో అత్యధికంగా 105.6 మి.మీ వర్షం పడింది. ముఖ్యంగా హైదరాబాద్ లో గురువారం సాయంత్రం 6 గంటల వరకు నగరంలోని కొన్ని ప్రాంతాల్లో 188.3 మి.మీ వరకు వర్షం పడింది. హైదారాబాద్ వాతావరణ శాఖ రికార్డుల ప్రకారం 1991 నుంచి 2020 వరకు 30 ఏళ్లలో జులై నెల సగటు వర్షపాతం 162 మి.మీ గా ఉంది. 


వాస్తవానికి ఐఎండీ లెక్కల ప్రకారం ఉదయం 8.30 గంటల లోపు కురిసిన వర్షఆన్ని అంతక్రితం రోజు ఖాతాలో వేస్తారు. ఈ ప్రకారం బుధవారం రోజు గరిష్ఠంగా మియాపూర్ లో 88.3 మి.మీ వాన కురిసింది. రాత్రి 10 గంటల వరకు 20 మి.మీ మాత్రమే కురవగా... మిగిలిన వర్షం అంతా అర్ధరాత్రి దుమ్ములేపింది. గురువారం రోజు ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు దఫదఫాలుగా పెద్ద ఎత్తున వర్షం పడింది. మియాపూర్ లోనే గరిష్టంగా 99.8 మి.మీ వర్షం కురిసింది. జులై నెలలో అద్యధిక వర్షపాతం పదకొండేళ్ల క్రితం 2012లో 115.1 మి.మీ గా వాన పడింది. ఆ తర్వాత ఒక్కరోజు అత్యధికం బుధవారం రోజు నమోదు అయింది. గురువారం రాత్రి వరకు వాన కొనసాగితే దీన్ని అధిగమించే అవకాశం ఉంది. 


రాబోయే మూడ్రోజుల పాటు జోరు వానలు


రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే ఆదిలాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, హనుమకొండ, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.