Telangana News: వర్షాభావ పరిస్థితుల కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలోని దాదాపు ఆరు లక్షల ఎకరాల భూమి బీడుగా మారింది. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ కింద ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఆరు లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకం అయింది. ఎడమ కాల్వ కింద మొత్తం 6 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో 3.5 లక్షల ఎకరాలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2.5 లక్షల ఎకరాలు సాగు అవుతోంది. బోర్లు, బావుల కింద మరో 50 వేల ఎకరాల్లో వరి వేశారు. సాగర్ నీటిపైనే ఆధారపడిన ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కింద పంటలు సాగయ్యాయి. నదిలో కనీస స్థాయి ప్రవాహం కూడా లేకపోవడంతో సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న పొలాలు బీడు భూములుగా మారిపోయాయి. ఎడమ కాల్వ పరిధిలో భూగర్భ జలాలు తగ్గిపోవడంతో బోర్లు సైతం వట్టిపోతున్నాయి. 


తెలంగాణలో అత్యధికంగా బోర్లు, బావుల కింద సుమారు 6 లక్షల ఎకరాలను ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగు చేస్తున్నారు. వీటి కింద వేసి పంటలు వర్షాలు లేక ఎండిపోతున్నాయి. నెల రోజుల క్రితం వేసిన వరి ఎర్రగా మారుతోంది. నారు మడులు కూడా ఎండిపోయాయి. ఎడమ కాల్వ మొదటి జోన్ లో ఉన్న నాగార్జున సాగర్, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లోని చాలా మండలాల్లో పంటలు అన్నీ ఎండిపోతున్నాయి. సాగర్ లో అందుబాటులో ఉన్న నీరు విడుదల చేస్తే పంటలు దక్కుతాయని రైతులు చెబుతున్నారు. నీరు విడుదల చేయాలంటూ ఆయుకట్టు పరిధిలోని నేరేడు చర్ల, హుజూర్ నగర్ మండలాల్లో రైతులు సోమవారం రాస్తారోకో చేశారు.  


మరోవైపు కాకినాడలోనూ ఇదే పరిస్థితి


పెద్ద ఎత్తున వర్షాలు పడినా, ప్రాజెక్టులన్నీ నిండుకుండల్లా మారినా.. ఆ ప్రాంతంలో మాత్రం పంట పొలాలకు సాగు నీరు అందడం లేదు. కారణంగా పంట భూములన్నీ బీటలు వారాయి. అది చూసిన రైతులకు ఏం చేయాలో తెలియక కన్నీరు పెడుతున్నారు. వ్యవసాయాన్నే నమ్ముకుని జీవిస్తున్న తాము ఏం చేయాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. పంట పొలాల వద్దకు వెళ్లి నెర్రలు వారిని భూమిలో కూర్చొని తల్లడిల్లిపోతున్నారు. బతకడం కంటే చావడమే నయం అని అంటున్నారు. 


ఆర్ఆర్బీ చెరువు ద్వారా 20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు


కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం మల్లవరంలో సుమారు 1300 ఎకరాల విస్తీర్ణంలో గల ఆడ్ ఆర్ బీ చెరువు ద్వారా గొల్లప్రోలు, తొండంగి, కొత్తపల్లి మండాల పరిధిలో పది గ్రామాల్లో ఉన్న సుమారు 20 వేల ఎకరాలు ఆయకట్టుకు సాగు నీరు అందుతుంది. ఈ చెరువుపై ఆధారపడే అక్కడి ప్రజలు పంటలు సాగు చేస్తుంటారు. సాధారణంగా జూన్, జులై నెలలలో కురిసే వర్షాలతో పాటు పీబీసీ ద్వారా వచ్చే గోదావరి నీటితో చెరువులోకి సాగునీరు అందుతుంది. ఈ ఏడాది వర్షాలు ఆలస్యంగా కురవడం, రెండు వారాల క్రితం కురిసిన భారీ వర్షాలతో ఏకే, ఏపీ మల్లవరం గ్రామాల్లోని రైతులు తమ పొలాలను దమ్ము చేసుకుని వెదజల్లు పద్ధతిలో వరిసాగును చేపట్టారు. రెండు వారాల వరకూ వర్షం ద్వారా లభించిన తడి సరిపోయింది.