Telangana News: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో తెలంగాణ పోలీసులు భారతదేశంలోనే మొదటి స్థానంలో ఉన్నారు. మొబైల్ దొంగతనం, నకిలీ మొబైల్ పరికరాల ముప్పును అరికట్టడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం (DoT) అభివృద్ధి చేసిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR)ని ఉపయోగించి తెలంగాణ రాష్ట్ర పోలీసులు 5,038 దొంగతన బారినపడిన లేదా పోగొట్టుకున్నన మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. 67.98 శాతం రికవరీతో తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచారు. 54.20 రికవరీ రేటుతో కర్ణాటక రెండో స్థానంలో ఉండగా, 50.90 శాతంతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది.


సీఈఐఆర్ పోర్టల్ ను అధికారికంగా మే 17వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించారు. అయితే 2022 సెప్టెంబర్ లో కర్ణాటకలో పైలట్ ప్రాతిపదికన ప్రారంభించారు. తెలంగాణలో పైలట్ ప్రాతిపదికన ఏప్రిల్ 19వ తేదీ 2023న ప్రారంభించగా.. 110 రోజుల వ్యవధిలో మొత్తం 5,038 పోగొట్టుకున్న, దొంగిలించిన మొబైల్ ఫోన్లను రికవరీ చేశారు. ఇందులో చివరి 1000 మొబైల్ ఫోన్లను కేవలం 16 రోజుల్లో రికవరీ చేసి ఫిర్యాదుదారులకు అందజేశారు. మొత్తం 5 వేల 38 ఫోన్లను రికవరీ చేయడంలో నిరంతరం పర్యవేక్షణ చేసిన నోడల్ అధికారి, అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ మహేష్ భగవత్ ను.. డీఐజీ అంజనీ కుమార్ అభినందించారు. 


రాష్ట్రంలోని మొత్తం 780 పోలీస్ స్టేషన్లలో ఈ పోర్టల్ పనిచేస్తోంది. ఏడీజీపీ, సీఐడీ సీఈఐఆర్ పోర్టల్ కింద పని పురోగతిని పర్యవేక్షిస్తుంది. తెలంగాణకు సంబంధించిన సీఈఐఆర్ డేటా ప్రకారం.. 55 వేల 219 మొబైల్ ఫోన్లను బ్లాక్ చేశారు. 11 వేల 297 ట్రేస్‌బిలిటీ నివేదికలు అందుకోగా.. 5,038 ఫోన్లను అన్‌బ్లాక్ చేసి నిజమైన యజమానులకు అప్పగించారు. అయితే 402 మొబైల్ ఫోన్లతో హైదరాబాద్ కమిషనరేట్, 398 పరికరాలతో రాచకొండ కమిషనరేట్లు ఉన్నాయి. వినియోగదారు స్నేహ పూర్వకతను మెరుగు పరచడానికి, తెలంగాణ పౌరులకు మరింత సమర్ధవంతంగా సేవలు అందించడానికి, తెలంగాణ పోలీసులు డీఓటీ సమన్వయంతో తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌తో సీఈఐఆర్ పోర్టల్‌ను విజయవంతంగా అనుసంధానించారు. ఫలితంగా పోగొట్టుకున్న, తప్పిపోయిన మొబైల్ ఫోన్లను మీసేవా లేదా పోలీస్ స్టేషన్‌లకు వచ్చే బదులు పౌరులు తెలంగాణ పోలీస్ సిటిజన్ పోర్టల్‌లో ఈ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు. 


ఫోన్ పోగొట్టుకోగానే, చేయాల్సిన పని ఇదే


కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖా ఆద్వర్యంలో  CEIR (CENTRAL EQUIPMENT IDENTITY REGISTER ) సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ప్రవేశపెట్టింది. ఇందుకోసం www.ceir.gov.in  వెబ్ సైట్‌లోకి లాగిన్ కావాలి. అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/స్టోలెన్ మొబైల్ లింక్ కనబడుతుంది. దానిపై క్లిక్ చేయాలి. పోయిన మొబైల్లోని నంబర్లు, IMEI నంబరు, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్‌లోడ్ చేయాలి. మొబైల్ ఏ రోజు పోయింది? ఎక్కడ పోయింది? రాష్ట్రం, జిల్లా, పోలీసు స్టేషన్ లో  ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈ-మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. ఓటిపి (OTP) కోసం మరో ఫోన్ నెంబర్ ఇవ్వాలి.


ఇదంతా పూర్తయిన తర్వాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. ఆ ఐడి మిస్సయిన ఫోన్ స్టేటస్ తెలుపుతుంది. అది ఎక్కడుంది? ఎవరి చేతుల్లో ఉంది అనే వివరాలను ఐడెంటిఫై చేస్తుంది. మొబైల్ ఏ కంపెనీది అయినా సీఈఐఆర్ విధానం ద్వారా ఆ ఫోన్ పని చేయకుండా చేస్తుంది. ఈ సాంకేతికను ఉపయోగించి మొబైల్ ఫోన్లను వెతికి పట్టుకున్నారు పోలీసులు. ఫోన్ దొరికిన తర్వాత సదరు ఫిర్యాదుదారుడు చేయాల్సిన మరోపని- అన్ బ్లాక్! దీనికి ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఫోన్ దొరికిన అదే వెబ్‌ సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ అన్ బ్లాక్/ఫౌండ్ మొబైల్ అనే లింక్ పై క్లిక్ చేయాలి. అడిగిన ఐడి నమోదు చేయగానే ఫోన్ అన్ బ్లాక్ అవుతుంది. లేకుంటే ఫోన్ ఆన్ కాదు. ఫోన్ పనిచేస్తున్న విషయాన్ని దగ్గర్లోని పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలి.