చారిత్రక కట్టడాల్లో మెట్ల బావులు ఒకటి. శతాబ్ధాల క్రితం నిర్మించిన మెట్ల బావులు ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అప్పట్లో ప్రజల దాహార్తి తీర్చేందుకు, పంటలు సాగు చేసుకునేందుకు మెట్ల బావులను వాడినట్టు చెబుతుంటారు. శిల్పకళా కౌశలంతో మెట్ల బావులు నిర్మించినట్టు అక్కడి ఆనవాళ్లు చెబుతుంటాయి. హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేటలో వందల ఏళ్ల క్రితం నాటి మెట్ల బావి వెలుగు చూసిన విషయం తెలిసిందే. అలాంటి కట్టడం ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా లింగంపేట మండల కేంద్రంలో కామారెడ్డి–ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై పోలీస్‌ స్టేషన్‌కు ఎదురుగా మెట్ల బావి నిర్మించారు. ఈ బావిని నాగన్నగారి బావిగా పిలుస్తారు. ఈ మెట్ల బావి నిర్మాణంలో కళానైపుణ్యం అబ్బురపరుస్తుంది. జక్సాని నాగన్న అనే వ్యక్తి ఈ దిగుడు బావిని నిర్మించాడని, అందుకే దాన్ని నాగన్న బావి అంటారని గ్రామస్తులు చెబుతారు.


అందమైన శిలలతో నిర్మాణం


బావి అడుగు భాగం నుంచి పైభాగం వరకు అందమైన శిలలతో నిర్మించారు. పై నుంచి అడుగు వరకు మెట్లు ఉన్నాయి. బావికి నలువైపులా మెట్లు ఉన్నాయి. ప్రధాన మార్గాన్ని పడమర దిశలో ఏర్పాటు చేశారు. ఉపరితలం నుంచి 20 అడుగులకు ఒక అంతస్తు చొప్పున ఐదు అంతస్తులు అంటే దాదాపు వంద అడుగుల లోతు ఈ బావి నిర్మించారు. దీన్ని 18 వ శతాబ్దంలో నిర్మించినట్టు కొందరు పేర్కొంటున్నారు. సంస్థానాదీషుల పరిపాలన కొనసాగిన కాలంలో ఈ కట్టడం నిర్మితమైందని తెలుస్తోంది. అయితే ఏ సంస్థానాదీషులు నిర్మించారన్నదానిపై సరైన ఆధారాలు లభించడం లేదు. 


మెట్ల బావికి నాగన్న బావి అని పేరు


లింగంపేటలోని నాగన్నబావిని చూస్తే అప్పటి కళానైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. నాలుగు వైపులా ఒకే రకమైన శైలితో అద్భుతమైన నిర్మాణం జరిగింది . బావి ఉపరితలం నుంచి అడుగు వరకు మెట్లు నిర్మించారు. శంఖుచక్రాలు, పుష్పాలు... ఇలా రకరకాల శిల్పాలు చెక్కించారు. బావికి నలువైపులా సుందర దృశ్యాలు ఉంటాయి. బావి పైభాగంలో చిన్నచిన్న కంకర రాళ్ల, డంగు సున్నంతో పైకప్పు వేశారు. తూర్పు భాగంలో బావి నుంచి నీటిని పైకి చేదడానికి మోటబావి లాంటి నిర్మాణం ఉంది. ఇక్కడి నుంచి నీటిని కాలువ ద్వారా తరలించి పంటలకు చేరేలా ఏర్పాట్లు ఉన్నట్టు తెలుస్తోంది. 


పాడుబడిపోతున్న సంపద....


ఎంతో కళానైపుణ్యంతో నిర్మించిన ఈ మెట్ల బావిని అభివృద్ధి చేసేందుకు పురావస్తు శాఖ చర్యలు చేపడుతొంది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న ఈ బావి చుట్టూ పెరిగిన చెట్లను గ్రామ పంచాయితీ ఇప్పటికే తొలగించింది. బావిలోపల పెరిగిన పూడికను తొలగించడం ద్వారా పురాతన కట్టడానికి పూర్వ వైభవం తీసుకురావచ్చు. బావి పూడిక తొలగిస్తూ నీటి ఊటలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఈ బావిపై దృష్టి సారించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 


నాగన్నబావికి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది. అప్పట్లో పంటలకు మోటలద్వారా నీరు పారేదని చెబుతారు. ఈ బావి చాలా లోతు ఉండేది. రానురాను పూడుకుపోయింది. మెట్లు ఎంతో అందంగా ఉంటాయి. గుమ్మటాలు ఆకర్శనీయంగా కనిపిస్తాయి. ఇలాంటి నిర్మాణాలు మరెక్కడా కనిపించవు. ఎంతో కళానైపుణ్యంతో బావిని, మెట్లను నిర్మించారు నాటి పాలకులు. వందల ఏళ్ల క్రితం నాటివైనా, నిర్లక్ష్యానికి గురవుతున్నపటికీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి చారిత్రక కట్టడాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు గ్రామస్తులు.