Southwest Monsoon : ఏపీ ప్రజలకు శుభవార్త. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీర ప్రాంతాలన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో మరో మూడు రోజులు ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఏపీలో కోస్తాంధ్రలో 2 నుంచి 4 డిగ్రీల వరకు కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలో వేడి గాలులు వీచడంతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఈ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు వడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వెదర్ మ్యాన్ సైతం హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఈ ప్రాంతాల్లో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా, మరోవైపు ఎండలు, ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు..
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉదయయం చల్లని గాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.