కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల రూపాయల రుణ మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ‘ఉమ్మడి హైదరాబాద్ బిడ్డ మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడు అయ్యాక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేపు కర్ణాటకలో , ఏడాది చివర్లో తెలంగాణలోనూ మనం అధికారంలోకి రాబోతున్నాం. ఖర్గే నాయకత్వంలో కాంగ్రెస్ కు పూర్వవైభవం వస్తుంది, కేంద్రంలో నరేంద్ర మోదీని, రాష్ట్రంలో కేసీఆర్ మెడలు వంచేలా పార్టీ శ్రేణులు పని చేయాలని’ పిలుపునిచ్చారు. మంచిర్యాల నియోజకవర్గంలో నిర్వహించిన కాంగ్రెస్ భారత్ సత్యాగ్రహ సభలో సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. కొత్త తరం నాయకులకు బాధ్యతలు అప్పగిస్తామన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. 


వైద్య రంగాన్ని కేసీఆర్ నిర్వీర్యం చేశారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీతో రూ.5 లక్షల వరకు ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. సిలిండర్లను రూ.500కే ఇస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు, నియామకాల కోసం వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్ క్లాస్ పరీక్షలు సరిగ్గా నిర్వహించలేకపోయింది. టీఎస్ పీఎస్సీ ద్వారా ఎగ్జామ్ లు నిర్వహించడంలో ఫెయిల్ అయిందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.
ఉమ్మడి రాష్ట్రంలో డెవలప్ మెంట్ లో చిట్టచివరన 23వ స్థానంలో నిలిచిన జిల్లా ఆదిలాబాద్. రాష్ట్రం ఏర్పడ్డాక సైతం పరిస్థితిలో ఏ మార్పు రాలేదన్నారు. ఈ జిల్లాలో వెనుకబడిన వారు, గిరిజనులకు చేయూత అందిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామన్న నమ్మకం కల్పించేందుకు సభ నిర్వహించాలనుకున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సభలు నిర్వహిస్తే మాకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారని.. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఈ సభ నిర్వహణను విజయవంతం చేశారన్నారు  రేవంత్ రెడ్డి. 


ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టిన పార్టీ కాంగ్రెస్. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశామంటున్నారు. ఈరోజు అంబేద్కర్ విగ్రహం పెడితే దళిత సోదరులు, దళిత బిడ్డలు ఓట్లు వేస్తారని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెడితే కేసీఆర్ ఎందుకు తీసేశాడో చెప్పాలని, అంబేద్కర్ సాక్షిగా ముక్కుకు నేలకు రాసి దళిత బిడ్డలకు క్షమాపణ చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇసుక దోపిడీకి అడ్డం వచ్చారని దళిత బిడ్డలను ట్రాక్టర్లతో తొక్కించి చంపించారు కేసీఆర్. రాష్ట్రంలో ఒకే ఒక్క మంత్రి, దళిత మంత్రిని బర్తరఫ్ చేశారు. కానీ అవినీతి ఆరోపణలు వచ్చినా తన కుమారుడు కేటీఆర్, కూతురు కవితలను పదవుల నుంచి ఎందుకు తొలగించడం లేదని సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.