ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గతంలో చెరకు సాగు అధికంగా చేసేవారు రైతులు. జిల్లాలో నిజాo షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ ఉండేది. ఒప్పందంతో రైతులు చెరకు పండించే వారు. ఈ రెండు ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు జిల్లాలో చెరకు సాగుకు పూర్తిగా దూరమయ్యారు. 2010కి ముందు రైతులు వరి సమానంగా చెరకు సాగు చేసేవారు. నిజామాబాద్ డివిజన్‌లో పండించిన చెరకు సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీకి తరలించేవారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ రన్నింగ్ సమయంలో చెరకు సాగు విస్తారంగా చేశారు రైతులు. సారంగపూర్ ఫ్యాక్టరీ రైతుల సహాకారంతో ఏర్పాటు చేశారు. 


ప్రస్తుతం ప్రభుత్వo యాసంగికి వరి సాగు వద్దంటోంది. చెరుకు సాగు వైపు మొగ్గు చూపాలంటూ వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా రైతులకు చెరుకు సాగు అనుభవం ఉంది. అయితే చెరుకు సాగుకు వెళ్లాలని అధికారు చెబుతున్నారు. చెరకు సాగును పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలతో ఒప్పందం చేసుకుంటూ సాగుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెరకు సాగు వల్ల లాభాలు ఉండడం వల్ల వరికి బదులుగా ఈ పంట సాగును ప్రోత్సహించేందుకు నిర్ణయించారు. ప్రభుత్వ, సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడినా.. ప్రైవేట్‌ ఫ్యాక్టరీల ద్వారా క్రషింగ్‌కు ఒప్పందాలు చేసుకుని సాగును చేపట్టేవిధంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. బోధన్‌, నిజామాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో ఈ పంటను వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.


తొలుత 7వేల ఎకరాల్లో సాగుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో చెరకు సాగును యాసంగిలో పెంచేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో ఈ సీజన్‌లో 7వేల ఎకరాల్లో పంట వేసేందుకు రైతులతో చర్చిస్తున్నారు. గతంలో సాగుచేసిన రైతులతో పాటు ఇతర రైతులను ప్రోత్సహించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నైజాం కాలం నుంచి 2010 వరకు జిల్లాలో వేలాది ఎకరాల్లో చెరకు సాగు చేయడంతో మళ్లీ ఆ పంటవైపు రైతులు మళ్లించేందుకు సిద్ధమవుతున్నారు.


కామారెడ్డి జిల్లాలోని సదాశివనగర్‌ వద్ద ఉన్న గాయత్రి, నిజాంసాగర్‌ వద్ద ఉన్న షుగర్‌ ఫ్యాక్టరీలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. రైతులను సాగుకు ప్రోత్సహిస్తున్నారు. వరికి బదులు చెరకు సాగు చేస్తే లాభాలు ఉంటాయని వివరిస్తున్నారు. గతంలో సాగు చేసిన రైతులు మళ్లీ చెరకు సాగు చేయాలని కోరుతున్నారు. జిల్లాలో 1250 ఎకరాల్లో చెరకు సాగవుతుండగా.. కామారెడ్డి జిల్లాలో మూడున్నరవేల హెక్టార్‌లలో సాగవుతోంది. ఈ రెండు జిల్లాల్లో పండే చెరకును ఆయా జిల్లా పరిధిలో ఉన్న రెండు ఫ్యాక్టరీలకు ఒప్పందం ద్వారా ఇస్తున్నారు. చెరకు ప్రస్తుతం టన్ను రూ.3,250 నుంచి రూ.3,300 వరకు ధర ఉంది. ఈ రెండు ఫ్యాక్టరీల యజమానులు ముందే రైతులతో ఒప్పందాలు చేసుకుని సాగు చేపిస్తున్నారు. పంట చేతికి రాగానే క్రషింగ్‌కు తీసుకుంటున్నారు. చెరకు ఎకరాకు సరాసరి అతి తక్కువగా 30టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అన్ని పద్ధతులు అవలంబించి సాగుచేస్తే 50 టన్నుల వరకు వస్తుంది. రైతు పెట్టుబడి పోను మిగులు కూడా ఎక్కువగానే ఉంటుంది. చెరకు సాగుకు ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు కూడా సాగుకు కావాల్సిన అవగాహన కల్పించడంతో పాటు విత్తనం, సాంకేతిక అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. చెరకు రవాణాకు సగం వరకు ఖర్చులు భరిస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చక్కెర, బెల్లం కన్న ఇథనాల్‌కు డిమాండ్‌ పెరగడంతో చెరకు ఎక్కువగా సాగు చేయించేందుకు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలు రైతులతో ఒప్పందాలు చేసుకుంటున్నారు.


దశాబ్దం క్రితం చక్కెర ఫ్యాక్టరీలు దేశవ్యాప్తంగా పలుచోట్ల మూతబడగా ఆ తర్వాత పుంజుకున్నాయి. ఇథనాల్‌ డిమాండ్‌ పెరగడంతో కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లా, రాష్ట్రంలో చెరుకు సాగు తగ్గినా పక్కనే ఉన్న మహారాష్ట్రలో మాత్రం భారీగా సాగవుతోంది. రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్‌ చక్కెర కర్మాగారాలు కూడా లాభాల్లో నడుస్తుండడంతో ఇథనాల్‌ బేస్డ్‌ చక్కెర ఫ్యాక్టరీలను పెట్టేందుకు వ్యాపారులు కూడా ఆసక్తి చూపుతుతుండడంతో చెరుకు సాగు పెరుగుతోంది. వచ్చే కొన్నేళ్లలో మళ్లీ జిల్లాలో సాగు పెంచేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. వరికి బదులు చెరుకునే ఎక్కువగా సాగుచేసేవిధంగా రైతులతో ఒప్పందాలను చేయించడంతో పాటు ప్రస్తుతం ఉన్న డిమాండ్‌కు అనుగుణంగా సాగుచేయాలని కోరేందుకు సిద్ధవుతున్నారు. 


మరి మూత పడిన ఫ్యాక్టరీలను తెరిపిస్తారా?


నిజామాబాద్ జిల్లాలోని రైతులు మాత్రం మూతపడిన నిజాంషుగర్‌, నిజామాబాద్‌ సహకార చక్కెర ఫ్యాక్టరీలవైపే చూస్తున్నారు. ఈ రెండు ఫ్యాక్టరీలు మూతబడడతంతో వేలాది ఎకరాల్లో సాగుచేస్తున్న రైతులు చెరకు వదిలి వరిసాగువైపు మొగ్గుచూపారు. నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ పరిధిలో బోధన్‌, వర్ని, రుద్రూర్‌, కోటగిరి, రేంజల్‌, నవీపేట, ఎడపల్లి మండలాల పరిధిలో చెరకు సాగుచేశారు. నిజామాబాద్‌ సహకార చక్కెర కర్మాగారం పరిధిలో నిజామాబాద్‌ రూరల్‌, డిచ్‌పల్లితో పాటు ఇతర మండలాల్లో సాగుచేశారు. నైజాం కాలంలో మొదలుపెట్టిన బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీ 70 ఏళ్లకుపైగా కొనసాగింది. ప్రైవేట్‌ యాజమాన్యం ఆధ్వర్యంలో పదేళ్ల పాటు కొనసాగి మూతపడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ తెరుస్తారని భావించినా ఎలాంటి మార్పు ఉండకపోవడంతో చెరకు సాగు చేసిన వేల మంది రైతులు ఆయా మండలాల పరిధిలో వరి సాగుకు మొగ్గు చూపారు. సహకార చక్కెర ఫ్యాక్టరీ కూడా నష్టాలబారిన పడడంతో దశాబ్దంన్నర క్రితం మూతపడింది. ఈ రెండు ఫ్యాక్టరీలు మూతపడడం, దగ్గర వేరే ఫ్యాక్టరీలు లేకపోవడం వల్ల రైతులు సాగు తగ్గించారు. వరి డిమాండ్‌ తగ్గడం, ఆరుతడి పంటలు వేయాలని కోరుతున్నా ప్రభుత్వం ఈ రెండు ఫ్యాక్టరీలను మళ్లీ ప్రారంభిస్తే చెరకుసాగు భారీగా పెరిగే అవకాశం ఉంది. ఈ ఫ్యాక్టరీలు తిరిగి తెరిస్తే రైతులకు కూడా సులభం అవుతుంది. ఫ్యాక్టరీలకు పూర్వ వైభవంతో పాటు....చెరుకు సాగు కూడా పెరుగుతుంది. దీంతో రైతులు వరికి ప్రత్యామ్నాయoగా చెరకు వైపే మొగ్గు చూపే అవకాశం కూడా ఉంటుంది. 


చెరకు సాగుతో ఉపాధి పెరిగే అవకాశం.


నిజామాబాద్ జిల్లాలో బోధన్, సారంగపూర్ ఫ్యాక్టరీలు నడిచిన సమయంలో పరోక్షంగా వేల మంది ఉపాధి పొందే వారు. కూలీలకు ఉపాధి లభించేది. బెల్లం గానుగలతోను ఉపాధి లభించేది. అనేక ఉపాధి మార్గాలుoటాయ్. చెరకు సాగుకు వెళ్లాలంటే ఈ రెండు ఫ్యాక్టరీలను తెరిస్తే రైతులకు సైతం మేలు జరుగుతుంది.


Also Read : అంగ్ సాన్ సూకీకి నాలుగేళ్ల జైలు శిక్ష ..మయన్మార్ కోర్టు తీర్పు !


Also Read : కాసేపట్లో పెళ్లి.. వాంతి చేసుకున్న పెళ్లి కుమార్తె.. చివరకు వరుడు ఏమన్నాడంటే..


Also Read: Pak's Serbia Agency: ఇమ్రాన్ ఖాన్ రాజ్యంపై 'కట్టప్పల' తిరుగుబాటు.. పాక్ పరువు తీసిన ఉద్యోగులు!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి