వరి కాకుండా వేరే ప్రత్యామ్నాయ పంటలు వేసేలా రైతులు సమాయత్తం కావాలని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రజలకు సూచించింది. వ్యవసాయశాఖ ఆ దిశగా రైతులకు అవగాహన కల్పిస్తోంది. అయినా నిజామాబాద్ జిల్లాలో మెజార్టీ రైతులు వరి పంటకే మొగ్గుచూపుతున్నారు. ఖరీఫ్ తర్వాత రబీ సంప్రదాయంగా వరి పంటనే పండిస్తూ వస్తున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం ముందస్తుగా చెప్పకుండా ఉన్నఫలంగా వరి పంట వేయద్దంటే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇంకా చాలా మంది రైతులు ఏ పంట వేయాలో తెలియక గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు. వరికి అలవాటైన రైతులు ఇతర పంటలకు వెళ్లలేక పోతున్నారు. ఈ సారి వానాకాలంలో వర్షాలు సంమృద్ధిగా కురిశాయి. ప్రాజెక్టులు, చెరువుల్లో నీరు సంమృద్ధిగా ఉంది. భూగర్భజలాలు పెరిగాయ్. దీంతో అధిక శాతం అన్నదాతలు వరి సాగుకే జై కొడుతున్నారు. ప్రభుత్వం ఓ వైపు వద్దంటున్నా.. రైతులు మాత్రం వినటం లేదు. 


రైస్ మిల్లర్లతో బై బ్యాక్ ఒప్పందం చేసుకుంటే ఓకే


రైస్‌మిల్లర్లు, వ్యాపారులతో బైబ్యాక్‌ ఒప్పందం చేసుకున్న వారు ముందుకెళ్లొచ్చని సూచిస్తోంది. వ్యవసాయ శాఖ బోధన్, నిజామాబాద్ డివిజన్లలో రైతులు చెరకు వైపు మొగ్గుచూపాలని సూచిస్తోంది. గతంలో ఇక్కడ వరికి ప్రత్యామ్నయంగా చెరకు సాగు భారీగా అయ్యేది. బోధన్, సారంగపూర్ సహకార చక్కెర ఫ్యాక్టరీ మూత పడటం వల్ల రైతులు పూర్తిగా చెరకు సాగుకు దూరమయ్యారు. గతంలో దాదాపు 2 లక్షలకుపైగా ఎకరాల్లో చెరకు పండించే వారు రైతులు. ప్రస్తుతం కనీసం 200 ఎకరాల్లో కూడా చెరకు పండించటం లేదు. ఈసారి ఎలాగైనా రైతులతో 7 వేల ఎకరాల్లో చెరకు సాగు చేసేందుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ప్రైవేట్ చెరుకు ఫ్యాక్టరీలతో ఒప్పందం కుదుర్చుకుని చెరకు సాగుకు వెళ్లాలని సూచిస్తోంది వ్యవసాయ శాఖ. అయితే బోధన్, సారంగపూర్ చక్కెర ఫ్యాక్టరీలను తిరిగి తెరిపిస్తే వరికి ప్రత్యామ్నయంగా చెరకు సాగుకు వెళ్తామంటున్నారు రైతులు.


మరోవైపు సన్ ప్లవర్ పంట సాగు వైపు మొగ్గు చూపాలంటోంది జిల్లా వ్యవసాయ శాఖ. 3 నెలల పంట. మద్దతు ధర కూడా బాగుంటుందని చెప్పున్నప్పటికీ ఈ పంటకు రిస్క్ ఎక్కువగా ఉంటుందని రైతులు చెబుతున్నారు. నిత్యం 10 మంది కూలీలు అవసరం ఉంటుందని... నాణ్యమైన విత్తనాలు ఉంటేనే పంట దిగుబడి వస్తుందని అభిప్రాయపడుతున్నారు రైతులు. మార్కెట్ నకిలీ విత్తనాలే చెలామణి అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. 2005కు ముందు జిల్లాలో సన్ ఫ్లవర్ సాగు కూడా రైతులు ప్రాధాన్యం ఇచ్చేవారు. తిరిగి ఆ పంటవైపు వెళ్లాలని అధికారులు సూచిస్తున్న ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రైతులు అటువైపు మొగ్గు చూపటం లేదు.


అయోమయంలో అన్నదాతలు


అసలు ఏ పంట వేయాలో అర్థంకాక అయోమయంలో ఉన్నారు చాలా మంది రైతులు. ప్రభుత్వం రైతు బంధు ఎకరానికి 15 వేలు ఇస్తే యాసంగిలో పంట విరామం ప్రకటిస్తామని కొందరు రైతులు అభిప్రపాయం వ్యక్తం చేస్తున్నారు. ఇతర పంటవైపు వెళ్తే కోతుల బెడద ఎక్కువగా ఉంటుందని కొందదరు రైతులు అభిప్రాయపడుతున్నారు. వాటి బెడద తొలగడం లేదు. వాటి తాకిడి ఉన్నంత వరకు ఇతర పంటలు వేయలేమంటున్నారు. చాలా ప్రాంతాల్లో ఈసారి చెరువులు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయ్. జల వనరులు పుష్కలంగా ఉన్నాయ్. దీంతో కొన్నేళ్లుగా బీడుగా ఉన్న భూముల్లో సైతం రైతులు చదును చేసి వరి పంట పండించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే కొందరు రైతులు మాత్రం మొక్కజొన్న వైపు వెళ్తున్నారు. గతంలో సోయా పంట సాగు చేసినప్పటికీ నకిలీ విత్తనాల వల్ల దాదాపు లక్ష ఎకరాల్లో సోయా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో రైతులు సోయా సాగు చేద్దామంటే భయపడుతున్నారు. ఇక ఉల్లి, ధనియాలు, పత్తి, సజ్జలు, కూరగాయలవైపు కూడా కొంత మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. 


నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో చాలా మంది రైతులు ఎక్కువగా వాణిజ్యపంటలవైపే మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ వరి తక్కువగానే పండిస్తున్నారు. అధికంగా పసుపు, మొక్కజోన్న, ఎర్రజోన్న, సజ్జలు, ఉల్లి, కూరగాయలు పండిస్తున్నారు. అయితే మెజార్టీ రైతులు మాత్రం వరి సాగుకే సిద్ధమయ్యారు. ఏదైనా కానీ ఈ సారి యాసంగికి వరినే పండిస్తామని మెజార్టీ అన్నదాతలు ముందుకొస్తున్నారు. 


Also Read: TSRTC: రేపటి నుంచి ప్రతి గురువారం టీఎస్ఆర్టీసీ ‘బస్ డే’.. ఆ రోజు అందరూ ఏం చేస్తారంటే..


Also Read: రెయిన్ అలర్ట్.. ఏపీలో మరో నాలుగు రోజులు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో చిరు జల్లులకు ఛాన్స్


Also Read: జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి?


Also Read: Vijayashanthi: అటుకులు బుక్కి ఉద్యమం చేస్తే ఇన్ని ఆస్తులు ఎట్ల వచ్చినయ్: విజయశాంతి