‘‘మీరు ఉంటున్న ఇల్లు మీదే... కానీ అది మీదే అని ధృవీకరిస్తూ.. మీకు ఓ పట్టా ఇస్తాం. అందుకు 10 వేల నుంచి ఇరవై వేలు  కట్టాలి.."  వన్‌ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో... ఇప్పుడు పల్లెల్లో, పట్టణాల్లోని వార్డుల్లో వాలంటీర్లు చెబుతున్న మాటలు దాదాపు ఇవే.. దీనిపైనే రగడ నడుస్తోంది. 


ఇప్పటికిప్పుడు డబ్బులు కట్టడం ఏంటని జనాలు ఓ వైపు గగ్గోలు పెడుతుంటే.. మా ఇంటిని మీరు సర్టిఫై చేసేది.. ఏందీ అని కొంతమంది నిలదీస్తున్నారు.. ఇంకొంత మంది .. కొన్ని రకాలుగా... సామెతలతో.. వాలంటీర్లకు రిటార్ట్ ఇస్తున్నారు.. దీనిపై సోషల్‌ మీడియాలో వస్తున్న మీమ్స్‌ సరేసరి..


ఈ 10-15 రోజులుగా జరుగుతున్న రగడను పక్కన పెడితే.. ఓవరాల్‌గా ఈ స్కీమ్ ను చూస్తే.. అది ప్రజలకు ఉపయోగకరంగానే ఉంటుంది. ప్రభుత్వం చెబుతున్న దానిని బట్టి.. ఇది ప్రజలను ఇబ్బంది పెట్టేది కాదు.. ప్రజలకు లాభం చేకూర్చేది అంటోంది. ప్రజలకు లాభం చేకూర్చేది.. అయితే ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు.. అనేది పెద్ద ప్రశ్న.. ప్రజలకు కలిగే లాభాన్ని మరి ప్రభుత్వం సరిగ్గా జనాలకు చెప్పలేకపోతోందా..? దీని గురించి మాట్లాడుకునే ముందు సంపూర్ణ గృహ హక్కు పథకం గురించి తెలుసుకుందాం...
అసలేంటి జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం..?


జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ఉద్దేశం ఏంటంటే..


అంటే, ఇది ప్రభుత్వం ద్వారా ఇంటి పట్టా పొందిన వారికి .. వారి ఇళ్లపై సంపూర్ణ హక్కులు కల్పించడం అన్నమాట.. ఈ వన్‌ టైం సెటిల్‌ స్కీం 24 జనవరి 2000లో ప్రారంభమైంది. పేదలకు డీ ఫామ్ పట్టాలు, ఇస్తే... హౌసింగ్ కార్పోరేషన్.. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం ఇస్తుంది. ఇదంతా రుణం. ఈ రుణం తీరేవరకూ.. పట్టాలు  ప్రభుత్వం దగ్గరే తనఖాలో ఉంటాయి. రుణం తీర్చిన తర్వాత.. పట్టాలు ఇస్తారు. అయితే రుణాన్ని చెల్లించని వారు.. OTS కింద నిర్ణీత మొత్తాన్ని చెల్లించి..  తమ పట్టాలు విడిపించుకోవచ్చు. 31–03–2014 వరకు అంటే  14 సంవత్సరాల 2 నెలల కాలంలో 2,31,284 మంది వన్‌టైం సెటిల్‌ మెంట్‌ స్కీంను వినియోగించుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. 


ప్రస్తుతం ప్రభుత్వ పట్టాలు తీసుకున్న లబ్ధిదారులు.. మొత్తం 56,69,000 మంది. ఇందుకోసం గ్రామాల్లో అయితే 10 వేలు, పట్టణాల్లో 15 వేలు, నగరాల్లో 20 వేలు కట్టాలి. దాదాపు 40 లక్షల మంది హౌసింగ్ కార్పోరేషన్ నుంచి రుణం తీసుకున్నారు. వీరి రుణ బకాయిలు.. వన్‌ టైమ్ సెటిల్ మెంట్ కన్నా తక్కువ ఉంటే ఆ మెత్తం కడితే సరిపోతుంది. ఒకవేళ ఎక్కువ ఉంటే.. ఈ స్కీమ్ లో చెప్పిన మొత్తం కట్టి సెటిల్ చేసుకోవచ్చు. రుణం తీసుకోని వారు.. 12 లక్షల మంది వరకూ ఉన్నారు.. వాళ్లు కేవలం 10 రూపాయలు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 


2014-19 మధ్య ఈ పథకాన్ని అమలు చేయలేదు అని ప్రస్తుత ప్రభుత్వం చెబుతోంది. 2016- 19 మధ్య హౌసింగ్ కార్పొరేషన్ బోర్డు నాలుగుసార్లు తీర్మానం చేసి పంపినా కానీ ఇంతకు ముందున్న ప్రభుత్వం ఈ పథకా‌న్ని అమలు చేయడంలో చొరవ చూపలేదు అని చెబుతోంది. అయితే ఈ గృహ రుణం మీద వడ్డీని అంతకు ముందున్న ప్రభుత్వాలు మాఫీ చేసేవి.. కిందటి ప్రభుత్వం ఆ పని కూడా చేయలేదని చెబుతోంది. 


జగన్ పాదయాత్రలో గుర్తించారంటున్న ప్రభుత్వం


ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు.. ప్రజలు పెద్ద సంఖ్యలో ఆయన వద్దకు వచ్చి.. OTS స్కీమ్‌ను నిలిపేశారని.. దాని వల్ల తాము ఇబ్బందులు పడుతున్నామని... చెప్పారని.. అందువల్లే ఈ స్కీమ్‌ను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. ఈ స్కీమ్ వల్ల ఉండే లాభాలను కూడా ప్రభుత్వం చెబుతోంది. పేద ప్రజలకు పట్టాలివ్వడం, నివసించే హక్కు ఇవ్వడం తప్ప అమ్ముకునే హక్కు  కల్పించలేదని.. వారసులకు బహుమతిగా ఇచ్చే అవకాశం కూడా లేదన్న విషయం ... పాదయాత్రలో తెలుసుకుని... అప్పటి పథకం కంటే.. మంచి పథకానికి రూపకల్పన చేశారని ... ప్రభుత్వం చెబుతోంది.  దానికి అనుగుణంగా వైఎస్‌.జగన్‌ సంపూర్ణ గృహహక్కు పథకం వచ్చిందని.. ఇందులో స్థలం, ఇంటిపై సంపూర్ణ హక్కులు లబ్ధి దారులకు వస్తాయని చెబుతున్నారు. ఈ పథకాన్ని అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్‌ అసైన్డ్‌ భూములు (ప్రొహిబిషన్‌ ఆఫ్‌ ట్రాన్స్‌ఫర్‌) చట్టం 1977 చట్టానికి సవరణలు కూడా తీసుకువచ్చారు.


15 ఆగష్టు 2011 కంటే ముందు ఇచ్చిన నివేసిన పత్రాలు కానీ, డీఫామ్ పట్టాలు కింద ఇళ్లు కట్టుకున్న వాళ్లు ఈ పథకంలో లబ్ధిపొందుతారు. 
పూర్తి హక్కులు వస్తున్నాయి కాబట్టి వాస్తవానికి ఇది మంచి పథకమే.. అలాగే దీనిపై రుణ సదుపాయం కూడా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. చిన్న చిన్న గ్రామాల్లో పెద్దగా లాభం లేకపోయినా... కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో అయితే.. కచ్చితంగా ఉపయోగం ఉంటుంది. 
మరి ఇంత ఉపయోగం ఉంటే.. ఎందుకు వ్యతిరేకత వస్తోంది..? 


Also Read: CM Jagan Banks : పథకాల అమలు.. అభివృద్ధిలో తోడుగా రండి.. బ్యాంకర్లకు సీఎం జగన్ పిలుపు !


అధికారంలోకి రాకముందే ఈ స్కీమ్ కావాలని ప్రజలు అడిగి ఉంటే.. దీనిపై వ్యతిరేకత రాకూడదు. కానీ... ప్రజలు మాత్రం చాలాచోట్ల ఎందుకు వ్యతిరేకిస్తున్నారు...?


చాలా మంది ప్రభుత్వం వద్ద పట్టాలు తీసుకుంటే.. అది తమకు ఫ్రీగానే వచ్చింది అని భావిస్తారు.. నూటికి 90 మందికి తాము రుణం తీసుకుంటున్నామన్న అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే ఈ రుణాన్ని దాదాపు ప్రభుత్వాలు అడగవ్.. హౌసింగ్ కార్పొరేషన్ కు వడ్డీ ప్రభుత్వం ఇస్తుంది.. అసలును కార్పొరేషన్ అడగదు. 


అలాగే ఎప్పుడో పాతిక ముప్పై ఏళ్ల కిందట తీసుకున్న ఇళ్లు, స్థలాలు.. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చి డబ్బులు కట్టమంటే.. ఎందుకు కట్టాలి అన్న ఆలోచన వస్తుంది. పైగా వారి తల్లిదండ్రులు ఎవరో తీసుకుని ఉంటారు. ఇప్పుడు తర్వాతి తరాలు కూడా వచ్చేశాయి. 


ఇంతకు ముందు వన్‌ టైమ్ సెటిల్ మెంట్ ఉంది. 14 ఏళ్లలో 2 లక్షల ౩4 వేల మంది నగదు చెల్లించారని అధికారులే చెబుతున్నారు. అంటే బహుశా... పట్టణ ప్రాంతాల్లో స్థలాలపై హక్కుల కోసం.. కొంతమంది దీనిని వాడుకుని ఉండొచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో అంత అవసరం ఉండకపోవచ్చు. 60లక్షల మంది లబ్ధిదారుల్లో 2 లక్షల మంది కట్టారు అంటే.. కేవలం నాలుగుశాతం మందే ఈ స్కీమ్‌ను వినియోగించుకున్నారు. అంటే ఎవరికి అవసరం అయితే వారు వాడుకున్నారు. 


ఇప్పుడు.. వాలంటీర్లు వారి ఇళ్లకువెళ్లి నేరుగా అడిగే వరకూ.. వాళ్లకు అసలు డబ్బులు కట్టాలి అన్న విషయం తెలియదు. అందుకే ఇంత వ్యతిరేకత వస్తోంది. పైగా ఇంతకు ముందు వాలంటీర్లు వ్యవస్థ లేదు. ప్రజలను నేరుగా అడిగిన వాళ్లూ లేరు. ఇప్పుడు వీళ్లు అడుగుతుండే సరికి.. ఎక్కడికక్కడ గొడవలు మొదలయ్యాయి.


ఆస్తి లబ్ధిదారుడిది అయినప్పుడు.. దానిని సొంతం చేసుకోవాల్సింది.. అతనే.. అది అతని అవసరం.. అలా కాకుండా.. కచ్చితంగా డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోండి.. అని ప్రభుత్వం చెప్పడమే అసలు గొడవకు కారణం. నిజానికి ఆస్తి తనది అయినప్పుడు.. ఆ అక్కర వాళ్లకే ఉండాలి కదా.. ప్రభుత్వానికి ఇందులో వచ్చిన నష్టం లేదు. అవగాహన కల్పిస్తే సరే.. కానీ.. ఇక్కడ కచ్చితంగా డబ్బు కట్టి చేసుకోండి.. అని చెప్పడమే.. సమస్యకు దారితీసింది. కొంతమంది సెక్రటరీలు సర్క్యులర్లు ఇచ్చారు. ఎంపీడీవోలు టార్గెట్లు ఫిక్స్ చేశారు. ప్రజలు వాళ్ల ఆస్తి గురించి.. వాళ్ల అంతట వాళ్లు చేసుకోవలసిన దానికి ప్రభుత్వం హైరానా పడాల్సిన అవసరం ఏముంది.. ? ఇదేమీ ప్రభుత్వానికి రావలసిన "టాక్స్" కాదు కదా.. కానీ ఇంత చేశారు. ఇక్కడే ప్రభుత్వం తీరుపై అనుమానాలు వచ్చాయి. 


అసలు అంతకు ముందు ప్రభుత్వం పూర్తిగా వదిలేసిన పథకాన్ని తీసుకొచ్చి పెట్టడం ఏంటి? డబ్బులు అడగడం ఏంటి అన్న ప్రశ్న వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ.. దేహీ అన్నట్లుగా ఉంది. ఇలాంటి సమయంలో ఖజానాకు ఏ కాస్త మొత్తం జమ అయినా అది పెద్ద భాగ్యమే.. అందు కోసమే చేశారా అన్నట్లుగా విమర్శలు వచ్చాయి.


40 లక్షల మంది లబ్ధిదారులున్నారని ప్రభుత్వమే చెబుతోంది. పట్టణాల్లో ఎంత, పల్లెల్లో ఎంత అని లెక్కలు పట్టించుకోకుండా.. అందరికీ.. 10వేల చొప్పున లెక్క గట్టినా 4 వేల కోట్లు గవర్నమెంట్‌కు వస్తాయి. ఇప్పుడు రెవెన్యూను సమకూర్చుకోవడానికి ఇంతకన్నా.. మంచి మార్గం లేదు. అందుకే చేస్తున్నారా.. అందుకే ఈ విమర్శలా... అనేది చూడాలి. 


దీనిపై విమర్శలు వచ్చాక.. ఇది పూర్తిగా స్వచ్ఛందమే అని ప్రభుత్వం వివరణలు ఇస్తోంది. అయినా అడపా దడపా.. వాలంటీర్లకు టార్గెట్లు ఇస్తున్న వాయిస్‌ రికార్డులు బయటకు వస్తూనే ఉన్నాయి. లబ్ధిదారుడికిచ్చే రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు కోసం రిజిస్ట్రేషన్‌ కార్యాలయానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. 


లబ్ధిదారుడికి చెందిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంటు గ్రామ, వార్డు సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేసి డిసెంబరు 21 తర్వాత సచివాలయంలోనే అందజేస్తారు అంటున్నారు. సబ్ రిజిస్టార్ కార్యాలయలో కాకుండా వార్డు సచివాలయంలో ఇచ్చే పత్రానికి... లింకు డాక్యుమెంట్లు లేని ఈ పత్రాన్ని రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌గా బ్యాంకులు అంగీకరిస్తాయా అనే డౌట్ ఉంది. కానీ ఈ పథకంలో లబ్ధిపొందిన లబ్ధిదారులను రిజిస్ట్రేషన్‌ శాఖ నిర్వహిస్తున్న నిషేధిత జాబితా 22–ఏ నుంచి తొలగిస్తామని... అందువల్ల భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు అని చెబుతున్నారు. రెవెన్యూశాఖ నుంచి ఏ విధమైన నిరభ్యంతర పత్రం అవసరం లేదంటున్నారు. అయితే ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం... గడచిన 15 రోజుల్లోనే లక్షన్నర మంది వినియోగించుకున్నారు.


ఇది ఎక్కడి వాళ్లు వినియోగించుకున్నారు? ఎవరు వినియోగించుకున్నారు? అనే విషయం పక్కన పెడితే.. ఒక్క మాట దేశం అడుగుతోంది.. 'ఏబీపీ దేశం' అడుగుతోంది..  ఓ మౌలికమైన ప్రశ్న..  అసలు ఇప్పుడు డబ్బులు ఎందుకు కట్టాలి...? అప్పట్లో పేదల ఇళ్లు తీసుకున్నవారి ఆర్థిక పరిస్థితి ఇప్పుడూ అంతంతమాత్రమే.. వాళ్లకు డబ్బులు లేవనే కదా... అమ్మ ఒడి, డ్వాక్రా రుణాలు అనే పథకాలు ఇస్తున్నారు. పైగా కరోనా.. ఎలాంటి ఆదాయాలు లేని వాళ్లు ఇప్పటికిప్పుడు.. 10 వేలు, 20 వేలు అంటే ఎలా కడతారు. ఇన్ని డబ్బులు ఉచితంగా ఇస్తున్న ప్రభుత్వం దీనిని ఎందుకు ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదు. దీనికోసం.. తాము ఖజానా నుంచి ఖర్చు చేయాల్సింది.. పైసా కూడా లేదు. జస్ట్ పట్టాలు ఇస్తే సరిపోతుంది. దాని వల్ల నష్టపోయేది రావలసిన ఆదాయమే కానీ.. తాను నేరుగా ఖర్చు చేయాల్సింది ఏం లేదు. అయినా ఎందుకు చేయడం లేదు. అంటే ప్రభుత్వం దీని ద్వారా ఆదాయాన్ని పొందాలనుకుంటుందా.. ? 


ఆదాయం వద్దనుకున్నప్పుడు.. యథాతథ స్థితినైనా కొనసాగించాలి కదా.. ఇప్పటికిప్పుడు.. వాళ్ల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుందని.. ఎందుకు భయపెడుతున్నట్లు.. ?


వాళ్లకి నిజంగా అవసరం అయితే.. వాళ్లే చేయించుకుంటారు...?


దేశం అడుగుతోంది..  ఈ పథకాన్ని ఉచితంగా ఇవ్వండి.. లేకుంటే.. స్వచ్చందంగా అమలు కానివ్వండి.. !


Also Read: AP Bank Loans : ఏపీ సర్కార్ బ్యాంకుల వద్ద తీసుకున్న అప్పు రూ.57,479 కోట్లు.. రాజ్యసభలో కేంద్రం ప్రకటన !


Also Read: AP Employees Division : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !


Also Read : కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి