Vidadala Rajini No Arrest:   మాజీ మంత్రి విడదల రజనీకి హైకోర్టులో ఊరట లభించింది. ఆమెను అరెస్టు చేయకుండా 41ఏ నోటీసులు ఇచ్చి  విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. అలాగే ఇదే కేసులో ఉన్న ఐపీఎస్ అధికారి  పల్లె జాషువాకూ ఇదే తీర్పు ఇచ్చింది.  ఆయనను కూడా 41ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని పోలీసులను ఆదేశించింది.  విడదల రజనీ మరిది గోపి పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసినందున పిటిషన్‌  డిస్పోజ్ చేసింది. 

Continues below advertisement


కేసు ఏమిటంటే ?


 ‘2020 సెప్టెంబరు 4న పల్నాడు జిల్లా యడ్లపాడు మండలం విశ్వనాథుని కండ్రిక గ్రామంలోని శ్రీ లక్ష్మి బాలాజీ స్టోన్ క్రషర్ కండ్రికను అప్పటి చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని పీఏ దొడ్డ రామకృష్ణ సందర్శించారు. స్టోన్‌క్రషర్‌పై దాడులు చేయకుండా, స్టోన్ క్రషర్ ను మూయించకుండా ఉండాలంటే రజినిని కలవాలని ఆదేశించారు. దీంతో దాని యజమానులు నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు రజిని ఆఫీసుకు వెళ్లి కలిశారు. వ్యాపారం సజావుగా జరగాలంటే  అడిగినంత డబ్బులివ్వాల్సిందేనని, మిగతా విషయాలన్నీ తన పీఏ రామకృష్ణతో మాట్లాడాలని రజిని వారికి హుకుం జారీ చేశారు. వారిద్దరూ రామకృష్ణను కలవగా ఆయన రూ.5కోట్లు డిమాండ్ చేశారు.  


 ఆ తర్వాత వారం రోజులకే సెప్టెంబర్ 10న అప్పటి గుంటూరు రీజనల్ విజిలెన్స్ అండ్  ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి (ఆర్‌వీఈవో)గా ఉన్న ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా తన బృందంతో శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌లో తనిఖీలకు వెళ్లారు. ఆ స్టోన్‌ క్రషర్‌పై ఎవరూ ఫిర్యాదు చేయకుండానే హడావుడి చేశారు. అప్పటి విజిలెన్స్‌ డీజీ అనుమతి కూడా తీసుకోలేదు. విజిలెన్స్‌ మెయిన్ ఆఫీసుకు ఈ తనిఖీల గురించి సమాచారమే ఇవ్వలేదు. విచారణలో వెల్లడైన అంశాలతో నివేదిక రెడీ చేశారు.జాషువా ఆదేశాలతోనే తామంతా తనిఖీల్లో పాల్గొన్నామని మిగతా అధికారులను ఏసీబీకి తెలిపారు.                            
 
స్టోన్‌క్రషర్‌లో తనిఖీల అనంతరం జాషువా దాని యజమానులకు ఫోన్‌ చేశారు. వెంటనే విడదల రజినిని కలవాలని.. లేకపోతే రూ.50కోట్లు జరిమానాతో పాటు క్రషర్‌ను మూయించేస్తానని బెదిరించారు. దీంతో వారు రజినిని కలిశారు. పీఏ రామకృష్ణతో భేటీ కాగా ఆయన రూ.5 కోట్లు ఇవ్వాల్సిందేనని మరోమారు డిమాండ్ చేశారు. స్టోన్ క్రషర్ యజమానికి ఆయన నుంచి ఒత్తిడి పెరగడంతో  రజిని ఆదేశాల మేరకు.. ఆమె మరిది విడదల గోపిని కలిసి రూ.2 కోట్లు ఇచ్చారు. అదే రోజు గుంటూరులో ఐఏఎస్ జాషువాకు రూ.10 లక్షలు, గోపికి మరో రూ.10లక్షలు ఇచ్చారు. విడదల రజిని ఆదేశాల మేరకే తాము తనిఖీలు చేపట్టినట్లు జాషువా చెప్పారు. ఇన్ని డబ్బులిచ్చినట్లు ఎవరికైనా చెబితే  క్రిమినల్‌ కేసులు పెడతామని బెదిరించారని యజమానులు చెప్పారు’ అని ఏసీబీ ఎఫ్ఐఆర్‎లో తెలిపింది.