CM Chandrababu Appreciates Megastar Chiranjeevi: సామాజిక సేవ చేయాలన్న గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చిన మొదటి నటుడు చిరంజీవి (Chiranjeevi) అని ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) ప్రశంసించారు. విజయవాడలో గురువారం నిర్వహించిన 'మైండ్ సెట్ షిఫ్ట్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ కుమార్తె, మాజీ మంత్రి, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కోడలు శరణి రచించారు. ఫస్ట్ కాపీని మెగాస్టార్‌కు అందించారు.

ప్రజా సేవపై దృష్టి పెట్టిన స్టార్

పాజిటివ్ థింకింగ్, బలమైన అంకితభావమే సక్సెస్ సాధించడంలో తోడ్పడతాయని చంద్రబాబు అన్నారు. 'చిరంజీవి సాధారణ కుటుంబం నుంచి నటుడు కావాలనే సంకల్పంతో వచ్చారు. ఆయన మనస్తత్వం గొప్ప శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడింది. ఎన్టీఆర్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత, చిరంజీవి గారు అవకాశాన్ని ఉపయోగించుకుని, తీవ్ర కృషి, దృఢ సంకల్పంతో ఆ శూన్యాన్ని పూరించడం ద్వారా చిత్ర పరిశ్రమలో ఎదిగారు.

సామాజిక సేవ చేయాలన్న గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చిన మొదటి నటుడు చిరంజీవి. నేను ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్నప్పుడు, చిరంజీవిని క్రమం తప్పకుండా కలిసేవాడిని. బ్లడ్ బ్యాంక్ ఏర్పాటుకు భూమి కేటాయించమని ఆయన నన్ను కోరారు. నటులు సినిమాను దాటి ప్రజా సేవపై దృష్టి పెట్టడం చాలా అరుదు. కానీ అలాంటి చొరవ తీసుకున్న మొదటి నటుడిగా చిరంజీవి గారు నిలిచారు' అని ప్రశంసించారు.

Also Read: నా కొడుకుదే ఫస్ట్ సిక్స్ ప్యాక్ - సూర్య ఫాదర్ కామెంట్స్‌పై మొదలైన రచ్చ.. అవి మర్చిపోయి ఉండొచ్చన్న విశాల్

'నటనే నా నిజమైన ప్రేమ'

తన కెరీర్ తొలి నాళ్లలో విమర్శలు, ఇబ్బందులు, ప్రతికూల స్పందనలు ఎదురైనప్పటికీ ఒకే లక్ష్యంతో, అంకితభావంతో ముందుకు సాగానని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. 'వ్యక్తిత్వ వికాసంపై పుస్తకాల పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ఈ పుస్తకం అంతా దాని గురించే. నా గ్రాడ్యుయేషన్ తర్వాత నాకు కెరీర్‌పై ఓ స్పష్టత లేదు. కానీ చిన్నప్పటి నుంచి నటన పట్ల నాకున్న ఇష్టం నా మార్గాన్ని కనుగొనడంలో నాకు సహాయపడింది. నా పేరెంట్స్ నాకు సపోర్ట్ ఇచ్చారు. నటనే నా నిజమైన ప్రేమ అని నేను గ్రహించాను.' అని అన్నారు.

'జీవితంలో ప్రతి అడుగులోనూ సవాళ్లు, అడ్డంకులతో నిండి ఉంటుంది. మనం అవిశ్రాంతంగా పనిచేస్తాం. మన గోల్స్ చేరుకోవడానికి ముందుకు వెళ్తూనే ఉంటాం. అయినప్పటికీ చాలామంది ఊహించని ఆటంకాలు, నిరాశ, నిరుత్సాహాల కారణంగా పోరాడుతూనే ఉన్నారు. కానీ సంకల్పం బలం ఉంటే ఏదైనా సాధించగలం. కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ఆటంకాలను అధిగమించి ప్రతీ అవకాశాన్ని సక్సెస్‌గా మలుచుకున్నాను. ప్రేక్షకులు నాలోని స్పార్క్‌ గమనించారు. ఆ తర్వాత నేను నటుడి నుంచి స్టార్‌గా ఎదిగాను.' అని తెలిపారు.

ఉగ్రదాడిని ఖండించిన మెగాస్టార్

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడిపై చిరంజీవి తన విచారం వ్యక్తం చేశారు. 'ఇలాంటి భయంకరమైన చర్యలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం. మన రాష్ట్రానికి చెందిన ఇద్దరు అమరులయ్యారు. ఈ సమయంలో మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ సపోర్ట్‌గా నిలిచారు. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.' అని మెగాస్టార్ అన్నారు.