నిజామాబాద్ జిల్లాలో వేరు శనగ రైతులు దిగాలు చెందుతున్నారు. వరి కాదనుకుని పల్లి పంట వేస్తే మార్కెట్లో గిట్టుబాటు ధర రావటం లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. మార్కెట్లో పల్లీ పంటకు గిట్టుబాటు ధర కరవైంది. పంటను కొనేవారు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు.


వరి వేస్తే ఉరేనని సీఎం కేసీఆర్ అన్నమాటలతో మాక్లూర్ మండలంలోని కొత్తపల్లి, మెట్పల్లి, గొట్టిముక్కల, మాణిక్ భండార్, ఢీకంపల్లి, కల్లెడి, మదనపల్లి, గుత్ప, రాంచంద్రపల్లి తదితర గ్రామాల్లో రైతులు సుమారు 300 ఎకరాల్లో పల్లీ సాగు చేశారు. నూనె గింజల పంటలకు డిమాండ్ ఉంటుందని వ్యవసాయ అధికారులు రైతు సదస్సుల్లో చెప్పడంతో ఈ వేరుశనగ సాగు కోసం రైతులు అంగీకరించారు.


తాము కొన్న విత్తనాలతో ఎకరానికి 6 క్వింటాళ్ల నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే దిగుబడి వచ్చిందని రైతులు చెబుతున్నారు. తీరా సాగు చేసిన పల్లీ అమ్ముడుపోక రైతులు తల్లడిల్లుతున్నారు. ఆయిల్ మిల్లర్లు క్వింటాలు పల్లీకి 3వేల రూపాయల నుంచి 3500 రూపాయల వరకే చెల్లిస్తామన్నారని రైతులు వాపోతున్నారు.


గత్యంతరం లేని పరిస్థితిలో మహారాష్ట్రలోని ధర్మాబాద్ తీసుకువెళ్తే వ్యాపారులు కొనుగోలు చేయడానికే ముందుకు రావడం లేదని అంటున్నారు పల్లీ రైతులు. అక్కడ కూడా మధ్యవర్తుల దందా పెరిగిపోయిందని ఆరోపిస్తున్నారు రైతులు. నిజామాబాద్‌కు చెందిన ఒకే ఒక ఆయిల్ మిల్ యజమాని ఉన్నాడని...  మధ్యవర్తుల ద్వారా అతి తక్కువ ధరకే అడిగారని చెబుతున్నారు. 3500 రూపాలకు అమ్మితే ఎకరానికి మరో 20వేల నష్టం వస్తుందని రైతులు చెబుతున్నారు. సీఎం కేసీఆర్ మాటలు నమ్మి పల్లి సాగు చేసి అవస్థలు పడుతున్నామని ఆందోళ చెందుతున్నారు రైతులు.


నిజామాబాద్ మార్కెట్లో పల్లి కొనుగోలు కేంద్రాలు లేవు. అందువల్లే ఆయిల్ మిల్లుల యజమానులు కుమ్మకై ధర తక్కువ చేస్తున్నారని రైతులు చెబుతున్నారు. దళారీ వ్యవస్థను అరి కట్టాలంటే జిల్లాకు ఒక పల్లీ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత జిల్లా యంత్రాంగం తీసుకోవాలని సూచిస్తున్నారు. పెట్టుబడి ఖర్చులకు అనుగుణంగా కనీసం పల్లీ క్వింటాలు 6వేల రూపాయల నుంచి 7వేల రూపాయల వరకు గిట్టుబాటు ధర కల్పిస్తేనే తమకు కొంతైనా లాభం ఉంటుందంటున్నారు రైతులు.


వరి వద్దనటంతో వేరుశనగ సాగు


కేసీఆర్ మాటలు నమ్మి వరి సాగును కాదని పల్లి పంటను సాగు చేశామనని.... అయితే పల్లి విత్తనాలకు ఎకరానికి 7వేల రూపాయలు ఖర్చు చేశామంటున్నారు రైతులు. అయితే దిగుబడి మాత్రం 6 నుంచి 7 క్వింటాళ్లు మాత్రమే వచ్చిందని ఇది తమకు తీవ్ర నష్టం మిగిల్చిందంటూ ఆవేదన చెందుతున్నారు రైతులు. పల్లి పంట సాగుకు ఎకరానికి 35 వేల రూపాయలు ఖర్చయ్యిందని అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు పల్లి 3వేల రూపాయల నుంచి 3500 రూపాయల వరకు మాత్రమే అడుగుతున్నారు. దీంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని చెబుతున్నారు పల్లి రైతులు. కనీసం క్వింటాలు పల్లి ధర 6వేల రూపాయలకైనా కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. లేదంటే తాము అప్పుల పాలు కావాల్సిందే అంటున్నారు అన్నదాతులు.