Nizamabad Rape Incident: ప్రస్తుతం హైదరాబాద్‌లో వరుస అత్యాచార ఘటనలు, సామూహిక అత్యాచార ఘటనలు తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. మైనర్లే ఈ ఘాతుకాలకు పాల్పడుతుండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మరో అత్యాచార ఘోరం నిజామాబాద్ లో వెలుగులోకి వచ్చింది. బాలికను నమ్మించి దాగుడు మూతలు ఆడదామని చెప్పి వీలున్నప్పుడల్లా ఆమెతో బలవంతంగా లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.. ఓ యువకుడు.


పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. దాగుడుమూతలు ఆడదామని చెప్పి బాలికకు దగ్గరైన యువకుడు ఆమె నగ్న చిత్రాలు తీసి, వాటిని చూపి బెదిరిస్తూ పలుసార్లు లైంగిక దాడిని కొనసాగించాడు. ఇన్‌స్టాగ్రాంలో ఇటీవల పరిచయమైన ఇంకొక వ్యక్తి అదే బాలికను లొంగదీసుకున్నాడు. వేధింపులు తట్టుకోలేని బాలిక తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


నిజామాబాద్‌ ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్టుమెంట్‌లో బాధిత బాలిక కుటుంబం నివాసం ఉంటోంది. అదే అపార్టుమెంట్‌లో రోహిత్‌ అనే యువకుడు కూడా ఉంటున్నాడు. 2017 నుంచే వీరిద్దరికి పరిచయం. బాలికతో చనువు బాగా పెంచుకొని, ఒంటరిగా ఉన్నప్పుడు దొంగాపోలీస్ ఆట పేరుతో అపార్ట్ మెంట్‌ పైకి తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితమే బాలిక నగ్న చిత్రాలను ఫోన్‌లో తీశాడు. వాటిని చూపించి తాను చెప్పినట్లు వినకపోతే బయట పెడతానంటూ బెదిరించాడు. 


రెండేళ్ల క్రితం కూడా అవే చిత్రాలను చూపించి తన ఇంట్లోకి బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనూ బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండడంతో అప్పుడు కూడా అత్యాచారం చేశాడు.


మరో యువకుడు ఇన్ స్టాలో..
అదే బాలికతో ఇటీవల భానుప్రసాద్‌ గౌడ్‌ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం పెంచుకున్నాడు. ప్రేమిస్తున్నానని నమ్మబలికాడు. మాయమాటలు చెప్పి ఓ కల్యాణ మండపం సమీపంలో నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఈ ఘటనలో కూడా నగ్న చిత్రాలు తీశాడు. వాటిని తిరిగి ఆమెకే పంపి బెదిరింపులకు పాల్పడ్డాడు. 


తన అక్క పెళ్లి కుదరడంతో విషయం బయటికి వస్తే పరువు పోయి పెళ్లి ఆగిపోతుందనే భయంతో కొంతకాలంగా ఇద్దరి వేధింపులను బాలిక భరిస్తూ వచ్చింది. ఇక బాలిక తట్టుకోలేక, చివరకు తల్లిదండ్రులకు విషయం చెప్పింది. సోమవారం వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై అత్యాచారం, పోక్సో, అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదుచేశారు. వారి ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు.