నిజామాబాద్ జిల్లాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ప్రధాన పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. నియోజకవర్గాల్లో తమ సత్తా చాటేందుకు సై అంటున్నాయ్. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు చురుకుగా ప్రజల్లోకి వెళ్తున్నారు. 
ప్రజా సమస్యలపై నిలదీస్తూ..
సమస్యలపైన నిలదీస్తునే పాదయాత్రలు, ధర్నాలు చేస్తున్నా ప్రతిపక్ష పార్టీల నేతలు మరింత బలం పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు దీటుగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గాల్లో ఢీ కొడుతూనే పోటీగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. పాదయాత్రలతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలను చేస్తున్నారు. జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో పరిధిల్లో ఈ కార్యక్రమాలను చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అభివృద్ధి పనులు, శంకుస్థాపన పనుల్లో నిమగ్నం కాగా సమస్యలపైన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఈ ఆందోళనలు చేస్తున్నారు. తమ క్యాడర్‌ ద్వారా ఢీ కొట్టే ప్రయత్నాలను చేస్తున్నారు. జిల్లాలో గడచిన కొన్ని నెలలుగా అధికార టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల అధికార పార్టీ నేతలను కార్యక్రమాల ద్వారా ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
బాల్కొండలోనూ పోటాపోటీ..
బాల్కొండ నియోజకవర్గం పరిధిలో మరో దఫా పోటీకి సిద్ధమవుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో రోడ్లు, ఆస్పత్రులు, పాఠశాలలు, కమ్యూనిటీ భవనాలకు నిధులు తీసుకొని రావడంతో పాటు నిర్మాణాలు చేస్తున్నారు. కప్పలవాగు, పెద్దవాగు చెక్‌డ్యామ్‌ల నిర్మాణాలు చేపట్టారు. పలు ప్రభుత్వ పథకాలు అమలయ్యే విధంగా చూస్తున్నారు. క్యాడర్‌కు మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండేందుకు మంత్రి హోదాలోనే వేల్పూర్‌లో ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఊపిరి సలపకుండా కార్యక్రమాలను చేస్తున్నారు. 
ఇదే నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎంపీ అర్వింద్‌తోపాటు బీజేపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్లికార్జునరెడ్డి పలు కార్యక్రమాలను చేపడుతున్నారు. నియోజకవర్గంలో పసుపు, ఇతర సమస్యలపైన ధర్నాలు నిర్వహించడంతో పాటు మంత్రి ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయంగా వేడిని పెంచారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతలు కూడా పాదయాత్రలు చేపట్టారు. వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌, మాజీ విప్‌ ఈరవత్రి అనిల్‌ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్‌రెడ్డి, ఇతర నేతలు పాల్గొన్నారు. నియోజకవర్గంలో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందరు ఒకే సారి కార్యక్రమాలు చేపట్టడంతో రాజకీయంగా కూడా పోటీ పెరిగింది. 


ఆర్మూర్‌ నియోజకవర్గంలో కూడా ఇదే రీతిలో వాతావరణం ఉంది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వరుస కార్యక్రమాలు నిర్వహించగా పోటీగా బీజేపీ నేతలు ఇంటింటికీ బీజేపీ పేరిట కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంపీ అర్వింద్‌ నియోజకవర్గాలపై ప్రత్యేక నజర్‌ పెట్టి ఆర్మూర్‌ నుంచి కార్యక్రమాలను చేపట్టే విధంగా చూస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జి వినయ్‌రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి, అల్జాపూర్‌ శ్రీనివాస్‌తో పాటు ఇతర నేతలతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నేతలు కూడా పాదయాత్రల పేరున గ్రామాలన్నీ తిరుగుతున్నారు. సీనియర్‌ నేతలు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, మానాలమోహన్‌రెడ్డి, తాహెర్‌బిన్‌హందాన్‌తో పాటు ఇతర నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చిన పోటీ పడే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. 


తాజా రాజకీయాలతో బోధన్‌ నియోజకవర్గంలో వేడెక్కింది. ఎమ్మెల్యే షకీల్‌ స్థానికంగా ఉంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. క్యాడర్‌ బలోపేతంపై దృష్టి పెట్టారు. నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి గ్రామాల్లో పర్యటిస్తూ, స్థానిక సమస్యలపైన స్పందిస్తున్నారు. క్యాడర్‌ను కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చూస్తూ.. ధర్నాలు, పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టిన బీజేపీ నేతలు బైక్‌యాత్ర పేరు మీద వారం రోజుల పాటు గ్రామాల్లో తిరిగారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు నియోజకవర్గ ఇన్‌చార్జి మేడపాటి ప్రకాష్‌, జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీ నర్సయ్య పాల్గొన్నారు. ఈ మధ్యనే పార్టీలో చేరిన వడ్డీ మోహన్‌రెడ్డి ఇంటింటికీ బీజేపీ పేరున మేడపాటితో కలిసి స్థానికంగా పర్యటిస్తున్నారు. 
నిజామాబాద్‌ అర్బన్‌లో..
నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో మూడు పార్టీల తరఫున కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే బిగాల గణేష్‌గుప్తా పలు అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూనే కార్యకర్తలకు, ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. మరింత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో బీజేపీ నేత ధన్‌పాల్‌సూర్యనారాయణ పోటీగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పలు డివిజన్లలో పర్యటిస్తూ సమస్యలపై ధర్నాల్లో పాల్గొంటున్నారు. ఆయనతో పాటు బీజేపీ నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇదే రీతిలో కాంగ్రెస్‌ తరఫున తాహెర్‌బిన్‌హందాన్‌ కార్యక్రమాలను చేస్తున్నారు. పార్టీ నేతలు కేశవేణుతో పాటు ఇతర నేతలు పాల్గొంటున్నారు.
నిజామాబాద్‌ రూరల్‌‌లో ఇలా..
నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం పరిధిలో ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్‌ బాజీరెడ్డి గోవర్ధన్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూనే కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తున్నారు. తాను నియోజకవర్గంలో అందుబాటులో లేని సమయంలో ఆయన కుమారుడు ధర్పల్లి జడ్పీటీసీ జగన్‌ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ భూపతిరెడ్డి పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. పాదయాత్రలు చేస్తూ గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పలు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలను కలుపుకుని కార్యక్రమాలను చేస్తున్నారు. బీజేపీ తరఫున దినేష్‌ కులాచారి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయా మండలాల్లో సీనియర్‌ నేతలతో కలిసి పర్యటిస్తున్నారు. పలు సమస్యలపైన ఆందోళన చేపడుతున్నారు. అన్ని నియోజకవర్గాలో వచ్చే ఎన్నికలు లక్ష్యంగా ఈ నేతలు పావులు కదుపుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన పోటీ చేసే విధంగా ఏర్పాట్లను చేసుకుంటూ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అన్ని పార్టీల నేతలు ఒకే సారి కార్యక్రమాలను చేపట్టడంతో రాజకీయ వేడి పెరిగింది.