నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించి రెండు వారాలు పూర్తి కావొస్తున్నా, నిజామాబాద్ జిల్లాలో మాత్రం వర్షాల కోసం అన్నదాత ఆకాశం వైపు చూడాల్సి వస్తోంది. వాతావరణ శాఖ ప్రకటనలు చేస్తున్నా.. జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురవటం లేదు. కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడుతున్నాయి. వానాకాలం ప్రారంభమై మూడు రోజులు గడుస్తున్నా ఇప్పటికీ జిల్లాలో పలు మండలాల్లో చెప్పుకోదగ్గ వర్షాలు లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం మొదలై రెండు వారాలు గడుస్తున్నా.. సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. 


తేలికపాటి జల్లులకు భూమి కూడా తడవడం లేదు. భారీ వర్షాల ఆశలతో పంటలు వేస్తున్న రైతులు సకాలంలో వానలు పడకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. బోర్లపైనే ఆధారపడి పంటలను కాపాడుకునే  పరిస్థితి తలెత్తింది. సీజన్‌ మొదలై నెలరోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు సరైన వర్షపాతం నమోదు కాలేదు. అన్ని మండలాల్లో గతేడాది కురిసిన విధంగా సీజన్ మొదట్లో వర్షాలు పడటం లేదు. జిల్లాలో భూగర్భ జలాలు ఉండడంతో ఎక్కువ మొత్తంలో రైతులు వాటిని నమ్ముకుని పంటలను వేస్తున్నారు.


కొన్ని మండలాల్లో సగటు వర్షపాతం కన్నా, మిగతా మండలాల్లో చాలా తక్కువగా వర్షం పడింది. జిల్లాలో ప్రతి ఏటా 1042 మి.మీలకు పైగా వానాకాలంలో వర్షం పడుతుంది. జూన్‌ నుంచి అక్టోబరు వరకు వర్షం నమోదవుతుంది. జూన్‌ ఆరంభం నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 150.5 మి.మీల వర్షం పడాల్సి ఉండగా ప్రస్తుతం 121.4 మీ.మీల వర్షం పడింది. జిల్లాలోని 5 మండలాల పరిధిలో మాత్రమే సగటు వర్షపాతానికి మించి వర్షం పడింది. బాల్కొండ, మోర్తాడ్‌, జక్రాన్‌పల్లి, నవీపేట మండలాల పరిధిలోనే సగటుకంటే ఎక్కువ వర్షం పడింది. జిల్లాలోని 10 మండలాలు కోటగిరి, కమ్మర్‌పల్లి, ఆర్మూర్‌, రేంజల్‌, నందిపేట, డిచ్‌పల్లి, వర్ని, మాక్లూర్‌, ముప్కాల్‌, ఎడపల్లి మండలాల పరిదిలో సగటు వర్షపాతం పడింది. జిల్లాలోని ధర్పల్లి, వేల్పూర్‌, బోదన్‌, మెండోరా, చందూర్‌, ఏర్గట్ల, రుద్రూర్‌, భీంగల్‌, సిరికొండ, నిజామాబాద్‌ సౌత్‌, నార్త్‌,  మోపాల్‌ మండలాల పరిధిలో సగటుకంటే తక్కువ వర్షం పడింది. జిల్లాలో ఇందల్‌వాయి, మోస్రా మండలాల్లో అతి తక్కువగా వర్షం కురిసింది.


నైరుతి ఋతుపవనాల్లో కదలిక లేకపోవడం వల్ల ఈ సీజన్ లో అనుకున్న విధంగా వర్షాలు లేవు. వాగులు, మంజీరా, గోదావరి కూడా వరద రావడంలేదు. ఎగువ ప్రాంతంలో పడే వర్షాల వల్ల స్వల్ప వరద కొనసాగుతోంది. జిల్లాలో జూన్‌ ఆరంభం నుంచే రైతులు భారీ వర్షాల ఆశతో పంటల సాగు మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సుమారు లక్షన్నర ఎకరాల్లో పంటలను వేశారు. ప్రతి రోజూ ఈ పంటల విస్తీర్ణం పెరుగుతోంది. ఆరుతడి పంటలతో పాటు వరినాట్లను కొనసాగిస్తున్నారు. సోయా, మొక్కజొన్న, పసుపు, కంది, పెసర సాగు కొనసాగిస్తున్నారు. వీటితో పాటు కూరగాయల సాగుకు మొగ్గుచూపుతున్నారు.


జిల్లాలో భూగర్భ జలాలు ఉండడంతో ఎక్కువ మంది రైతులు వాటిని నమ్ముకుని ఈ పంటలను వేస్తున్నారు. గతేడాదిలాగానే జూన్‌ నుంచి భారీ వర్షాలు పడతాయని ఆశతో ఈ పంటలను సాగుచేస్తున్నారు. అయితే భూగర్భ జలాలు ఉన్నా.. వర్షాలు భారీగా పడకపోవడం, ఎండలు కూడా ఉండడంతో వేసిన పంటలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు.