తెలంగాణలో డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్ నోటిఫికేషన్ నేడు విడుదల కానుంది. నిన్న (జూన్ 28) ఇంటర్‌ ఫలితాలు విడుదలైన వేళ నేడు డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యామండలి కార్యాలయంలో దోస్త్‌ నోటిఫికేషన్‌ విడుదల అవుతుంది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, పాలమూరు, మహాత్మగాంధీ, శాతవాహన యూనివర్సిటీల పరిధుల్లో ఉన్న దాదాపు 1,060 డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ లాంటి డిగ్రీ కోర్సుల్లో దాదాపు 4,25,000 సీట్లను భర్తీ చేయనున్నారు. 


3 లేదా నాలుగు విడతల్లో ఈ డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. దోస్త్ అఫీషియల్ వెబ్ సైట్ (dost.cgg.gov.in), టీఎస్ యాప్ ఫోలియో లేదా యూనివర్సిటీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లోని హెల్ప్ సెంటర్ల ద్వారా డిగ్రీలో చేరాలనుకొనే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.


ఇంటర్ ఫలితాల్లో బాలికలే టాప్
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 9,28,262 మంది ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయగా, అందులో 5,90,327 మంది ఉత్తీర్ణులైనట్లుగా మంత్రి సబిత ప్రకటించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో 4,64,892 మంది పరీక్షలు రాయగా, అందులో 2,94,378 మంది పాసైనట్లు చెప్పారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించినవారు 1,93,925, బీ గ్రేడ్ సాధించిన వారు 63,501 మంది ఉన్నారు. మొత్తం ఫస్టియర్ లో 63.32 శాతం మంది పాసయ్యారని మంత్రి సబిత ప్రకటించారు. 2,33,210 అమ్మాయిలు హాజరు కాగా, 1,68,692 మంది (72.33 శాతం) పాసయ్యారు. అబ్బాయిల్లో 2,31,682 మంది పరీక్షలు రాయగా.. 1,25,686 మంది బాలురు (54.24శాతం ) పాసయ్యారు.


ఇంటర్ సెకండ్ ఇయర్ విషయంలో 4,63,370 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,95,949 మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో ఏ గ్రేడ్ సాధించిన వారు 1,59,422 మంది ఉన్నారు. బీ గ్రేడ్ సాధించిన వారు 82,481 మంది ఉన్నారు. మొత్తానికి 67.82 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. అమ్మాయిలు సెకండ్ ఇయర్ లో 2,16,389 మంది పరీక్ష రాయగా.. 1,64,172 మంది (75.86 శాతం) పాసయ్యారు. 2,19,981 మంది పరీక్ష రాయగా.. 1,32,777 మంది (60 శాతం) పాసయ్యారు.