అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసినందుకు ఆనందంగా ఉందని టీమ్‌ఇండియా క్రికెటర్‌ దీపక్ హుడా (Deepak Hooda) అన్నాడు. ఐపీఎల్‌ ఫామ్‌నే ఇక్కడా కొనసాగిస్తున్నానని పేర్కొన్నాడు. సంజు శాంసన్‌ (Sanju Samson) తనకు చిన్ననాటి మిత్రుడని పేర్కొన్నాడు. ఐర్లాండ్‌ ఎంతో బాగుందని వెల్లడించాడు. రెండో టీ20లో విజయం సాధించాక అతడు మీడియాతో మాట్లాడాడు.


ఐర్లాండ్‌తో టీ20 సిరీసులో టీమ్‌ఇండియా దుమ్మురేపింది. 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. మంగళవారం రాత్రి జరిగిన రెండో మ్యాచులో 4 పరుగుల తేడాతో ఘన విజయం అందుకుంది. ప్రత్యర్థి బ్యాటర్లు విధ్వంసకరంగా ఆడినా 225 స్కోరును రక్షించుకుంది. మొదట టీమ్‌ఇండియాలో దీపక్‌ హుడా (104; 57 బంతుల్లో 9x4, 6x6) అంతర్జాతీయ క్రికెట్లో శతకం అందుకున్నాడు. పునరాగమనంలో సంజు శాంసన్‌ (77; 42 బంతుల్లో 9x4, 4x6) సత్తా చాటాడు. అరంగేట్రం చేసిన సిరీసులోనే హుడా మ్యాన్‌ ఆఫ్ ది సిరీస్‌ అవార్డు అందుకోవడం గమనార్హం.


'నేను ఐపీఎల్‌ నుంచి వచ్చాను. అక్కడెంతో బాగా ఆడాను. అదే ఫామ్‌ను ఇక్కడా కొనసాగించేందుకు ప్రయత్నించాను. దూకుడుగా ఆడటం నాకిష్టం. బ్యాటింగ్‌కు ముందుగానే రావడంతో నాకు సమయం దొరికింది. పరిస్థితులకు తగ్గట్టు ఆడాను. సంజూ చిన్ననాటి మిత్రుడు. మేమిద్దరం కలిసి అండర్‌-19 క్రికెట్‌ కలిసి ఆడాం. అతడూ భారీ స్కోరు చేసినందుకు హ్యాపీగా ఉంది. ఐర్లాండ్‌ చాలా బాగుంది. ఇక్కడెంతో ఎంజాయ్‌ చేశాను. అభిమానులు అండగా నిలిచారు. అస్సలు భారత్‌ బయట ఆడుతున్నట్టే అనిపించలేదు. వికెట్‌ కాస్త భిన్నంగానే ఉంది. ఏదేమైనా మద్దతుగా వచ్చినందుకు ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు' అని దీపక్‌ హుడా అన్నాడు.


భారత ఇన్నింగ్స్ తీరు


తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమ్‌ఇండియాకు శుభారంభం దక్కలేదు. జట్టు స్కోరు 13 వద్దే ఓపెనర్‌ ఇషాన్‌ కిషన్‌ (3) ఔటయ్యాడు. కానీ ఆ తర్వాతే మొదలైంది అసలు ఊచకోత! అంతర్జాతీయ క్రికెట్లో తమ సత్తా చాటాలని ఎన్నాళ్లుగానో ప్రయత్నిస్తున్న దీపక్‌ హుడా (104), సంజు శాంసన్‌ (77) చెలరేగారు. నువ్వా నేనా అన్నట్టుగా పోటీపడిమరీ బౌండరీలు, సిక్సర్లు బాదేశారు. వీరిద్దరి బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే! మరో ఛాన్స్‌ లేదన్నట్టుగా దంచికొట్టారు.


సంజు, హుడా కలిసి రెండో వికెట్‌కు 87 బంతుల్లో 176 పరుగుల భాగస్వామ్యం అందించారు. టీమ్‌ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక భాగస్వామ్యం సృష్టించారు. హుడా 27, సంజు 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు అందుకోవడంతో 13.3 ఓవర్లకే స్కోరు 150 దాటింది. 16.2వ బంతికి సంజూను అడైర్‌ బౌల్డ్‌ చేశాడు. ఆపై వరుస వికెట్లు పడుతున్నా హుడా తగ్గలేదు. 55 బంతుల్లో 100 కొట్టి టీ20ల్లో సెంచరీ బాదేసిన నాలుగో భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అతడిని 212 వద్ద లిటిల్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత ఎక్కువ బంతులేమీ లేకపోవడంతో మిగతా వాళ్లు దూకుడుగా ఆడబోయి త్వరగానే ఔటయ్యారు. జట్టు స్కోరును 225/7కు చేర్చారు.