దక్షిణాది చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో పలు చిత్రాల్లో కథానాయికగా నటించిన మీనా భర్త  విద్యాసాగర్ కొద్దిసేపటి క్రితం మరణించారు. చెన్నైలోకి ఒక ప్రయివేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారని సమాచారం అందింది. అసలు వివరాల్లోకి వెళితే...


What Happened To Meena Husband Vidyasagar?: మీనా భర్త విద్యాసాగర్‌కు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చింది. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సకు వైద్యులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే... ఇన్ఫెక్షన్‌కు తోడు కరోనా రావడంతో ఆరోగ్య పరిస్థితి విషమించిందట. చెన్నైలోని ఆళ్వార్ పేటలో గల ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ... కొవిడ్ కారణంగా విద్యాసాగర్‌ను రక్షించలేకపోయారని సమాచారం (Meena Husband Vidyasagar Death Reason). 


విద్యాసాగర్ మృతితో మీనా కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి కుటుంబ సభ్యులతో పాటు దక్షిణాది చలన చిత్ర పరిశ్రమ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది.


విద్యాసాగర్‌ది బెంగళూరు. ఆయన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. మీనాను 2009లో పెళ్లి చేసుకున్నారు. ఆర్యవైశ్య సమాజ కల్యాణ మండపంలో పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత తిరుమల ఏడు కొండల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. సినీ ప్రముఖుల కోసం చెన్నైలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 


విద్యా సాగర్, మీనా దంపతులకు ఒక కుమార్తె. అమ్మాయి పేరు నైనికా. 'తెరి' (తెలుగులో 'పోలీస్') లో తమిళ స్టార్ హీరో విజయ్ కుమార్తె పాత్రలో నటించింది. రజనీకాంత్, కమల్ హాసన్, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి స్టార్ హీరోల సరసన మీనా పలు చిత్రాలు చేశారు. 


Also Read : గుండెపోటుతో సీనియర్ నటి అంబికా రావు మృతి


తెలుగులో ఈ ఏడాది విడుదలైన 'సన్ ఆఫ్ ఇండియా'లో మోహన్ బాబు భార్యగా, గత ఏడాది ఓటీటీలో విడుదలైన 'దృశ్యం 2'లో వెంకటేష్ భార్య పాత్రలో మీనా కనిపించారు. 


Also Read : ప్రభాస్ ఫస్ట్ సినిమా కృష్ణంరాజు ప్రొడ్యూస్ చేయాల్సింది - బయటకు ఎందుకు వెళ్లిందంటే?