నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్ద జాతీయ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రం ఉంది. ఇక్కడ చేప పిల్లలను ఉత్పత్తి చేసి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు సరఫరా చేస్తారు. ప్రస్తుతం చేప పిల్లల ఉత్పత్తిని మత్స్య శాఖ అధికారులు నిలిపివేశారు. ఉత్పత్తి కేంద్రంలో ప్రస్తుత సంవత్సరం ఎకో హెచరీస్ చేప పిల్లల ఉత్పత్తి చేపట్టారు. అయితే ప్రస్తుతం తల్లి చేపల నుంచి నాణ్యమైన గుడ్లు అందడం లేదు. ఉత్పత్తి కేంద్రంలో మూడు సార్లు గుడ్లను ఎకో హెచరీలో బాయిల్ చేసినా స్పాన్ ఉత్పత్తి కాలేదు.
దీంతో చేప పిల్లల ఉత్పత్తిని నిలిపివేశారు. వారం నుంచి 10 రోజుల పాటు నిరంతరం వర్షాలు కురిసిన సమయంలోనే తల్లి చేపలు సాధారణ గుడ్లను అధికంగా వదిలేశాయి. దీంతో ప్రస్తుతం తల్లి చేపల నుంచి గుడ్లు అందడం లేదు. అనవరసంగా గుడ్లను సేకరించి ఉత్పత్తి ప్రకియ చేపట్టి విఫలమైతే పూర్తిగా నిలిపివేయాల్సి వస్తుందని, కొద్ది రోజుల తర్వాత తిరిగి ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రస్తుతం నిలిపి వేశారు. ఈ ఏడాది చేప పిల్లల ఉత్పత్తి కేంద్రంలో ఉత్పత్తికి మొదటి నుంచి ఆటంకాలే ఎదురవుతున్నాయి. సాధారణంగా జూలై, ఆగస్టు మాసాల్లో అధికంగా చేప పిల్లల ఉత్పత్తి జరుగుతుంది. కానీ జూలైలో ఎడతెరిపి లేకుండా వర్గాలు కురవడంతో కుండీల్లో నీరు ఎక్కువై తల్లి చేపలు చిక్కలేదు. దీంతో చేప పిల్లల ఉత్పత్తిని వర్షాలు కురిసినన్ని రోజులు నిలిపి వేశారు. ప్రస్తుతం గుడ్ల సమస్యతో నిలిపివేశారు. దీంతో ఇప్పటి వరకు 2.4 కోట్ల స్పాన్ మాత్రమే ఉత్పత్తి జరిగింది.
ఈ సారైనా ఉత్పత్తి లక్ష్యం చేరుకునేనా?
చేప పిల్లల ఉత్పత్తి ఆగస్టు 15 వరకే జరుగుతుందని మత్స్యకారులు చెబుతున్నా. మరో 10 రోజులు గడిస్తే చేప పిల్లల ఉత్పత్తి సీజన్ ముగుస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రంలో చేప పిల్లల ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేని పరిస్థితి. అంటే ఈ ఏడాది 2.4 కోట్ల కంటే ఎక్కువ స్పాన్ ఉత్పత్తి అయ్యే అవకాశం కనిపించడం లేదు. 10 కోట్ల స్పాన్ ఉత్పత్తి చేయాలని అధికారులు లక్ష్యం పెట్టుకున్నారు. ఇందులో కనీసం సగం వంతు కూడా ఉత్పత్తి అయ్యే పరిస్థితులు కనిపించటం లేదు. నిజామాబాద్ జిల్లాకే కాకుండా చుట్టుపక్కల జిల్లాలకు సైతం ఇక్కడి నుంచే చేప పిల్లలు సరఫరాీ అవుతాయ్. ఈ చేప పిల్లలను మత్స్యకారులు చెరువుల్లో వేసి పెంచుతారు. మత్స్యశాఖ అధికారులు 10 కోట్ల చేప పిల్లల ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నా... అది ఆచరణ సాధ్యం కాదు. ఇప్పటికే సమయం కూడా మించిపోయింది. దీంతో మత్స్యకారుల్లో ఆందోళన నెలకొంది. చేప పిల్లలను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుని పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మత్స్యకారులు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేపట్టినప్పటికీ ఇటీవల జిల్లాలో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల వల్ల చేప పిల్లల ఉత్పత్తి ఆటంకం ఏర్పడింది. మరోవైపు తల్లి చేపల నుంచి నాణ్యమైన గుడ్లు అందలేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే మూడు సార్లు ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందంటున్నారు మత్స్యశాఖ అధికారులు.