నిజామాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో వెలుగు చూసిన దారణం తెలంగాణలో సంచలనం సృష్టిస్తోంది. మీడియాలో ఆ దృశ్యాలు చూసిన మంత్రి హరీష్‌రావు సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై నిజానిజాలు తెలిసేలా విచారణ జరిపి, తక్షణమే నివేదిక అందజేయాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు.


నిజామాబాద్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఓ పేషెంట్ అపస్మారక స్థితిలో వచ్చాడు. స్ట్రెచర్  అందుబాటులో లేకపోవడంతో పేషెంట్‌ని కుటుంబ సభ్యులే నేలపైనే పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు. రెండు కాళ్లు పట్టి లాక్కేళ్లడం కలిచి వేసింది. రోగిని లోపలికి తరలించేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో బయటి నుంచి లిఫ్ట్ దాకా పేషంట్ కాళ్లు పట్టుకుని తీసుకువెళ్లిన దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. పేషెంట్ ను లాకెళ్తున్న వీడియో ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట వైరల్ అయ్యిoది. 


హృదయవిదారకంగా ఉన్న ఈ విజువల్స్‌ను సోషల్ మీడియాలో చూసిన ఆర్థికమంత్రి హరీష్‌రావు స్పందించారు. అసలు ఏం జరిగిందో సమగ్ర విచారణ జరపాలని హెల్త్‌డైరెక్టర్‌ను ఆదేశించారు. సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే మాత్రం చర్యలు తీసుకోవాలని సూచించారు. 


జరిగిన ఘటనలో సిబ్బంది తప్పేమీ లేదంటున్నారు నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌. వైరల్‌గా మారుతున్న విజువల్స్‌పై వివరణ ఇచ్చిన ప్రతిమారాజ్‌.. అసలు ఏం జరిగిందో సిబ్బందితో మాట్లాడినట్టు తెలిపారు. ఆ పేషెంట్ ఆసుపత్రికి వచ్చిన తర్వాత సిబ్బంది వారితో మాట్లాడారని వివరించారు. వీల్‌చైర్‌ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యేలోపు లిఫ్ట్ వచ్చిందని రోగిని బంధువులు లాక్కెళ్లిపోయారన్నారు. రోగి తల్లిదండ్రులే ఆ పనిచేశారన్నారు. 


ఇది తెలియని వారు వీడియో తీసి సోషల్ మీడియా పెట్టారని ఇప్పుడు అదే వైరల్‌గా మారిందన్నారు. పూర్తి సమాచారం తెలియకుండానే మీడియా కూడా స్టోరీలు రాసిందన్నారు. ఇందులో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఏమీ లేదన్నారు.