నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో దారుణo చోటుచేసుకుంది. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్ కాళ్ళను పట్టుకొని లాక్కుంటూ తీసుకువెళ్లిన ఘటన కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఏడంతస్తుల అద్దాల మేడ. చూడటానికి బాగున్నా ఆస్పత్రిలో వసతులు లేక వచ్చే రోగులు నరకయాతన పడుతున్నారు అనడానికి ఓ ఉదారణ ఇప్పుడు వైరల్‌గా మారింది.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చేస్తామన్న ప్రజాప్రతినిధులు ఆ ఊసే మరిచారు. అన్ని హంగులు ఉన్నాయని బయటకు మెరుస్తుతున్నా సిబ్బంది లేక వైద్యులు రాక రోగులు పడుతున్న బాధలు అంతా ఇంతా కాదు. ఓ వైపు సర్కారు ప్రభుత్వ ఆస్పత్రుల్లో భేష్ అని గొప్పలు చెప్పుకుంటున్నా.... ఇక్కడి ప్రభుత్వ ఆస్పత్రిలో కనీసం స్ట్రెచర్ లేకపోవటం ఆందోళనకు గురి చేస్తోంది.
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఓ పేషెంట్ అపస్మారక స్థితిలో వచ్చాడు. స్ట్రెచర్ అందుబాటులో లేకపోవడంతో పేషెంట్‌ని కుటుంబ సభ్యులే నేలపైనే పడుకోబెట్టి ఈడ్చుకెళ్లారు. రెండు కాళ్లు పట్టి లాక్కేళ్లడం కలిచి వేసింది. అక్కడ ఉన్న సిబ్బంది సైతం చూస్తూ ఉండిపోయారు.
రోగిని లోపలికి తరలించేందుకు సిబ్బంది ముందుకు రాకపోవడంతో ఈ ఘటన వెలుగుచూసింది. దీంతో బయటి నుంచి లిఫ్ట్ దాకా పేషంట్ కాళ్లు పట్టుకుని తీసుకువెళ్లిన దృశ్యాలు స్థానికులను కలిచివేశాయి. పేషెంట్ ను లాకెళ్తున్న వీడియో ఓ వ్యక్తి తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో నెట్టింట వైరల్ అయ్యిoది.
ఈ వీడియో చూసిన నెటిజన్ లు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందిపై మండిపడుతున్నారు. గతంలో కూడా కరోనా సమయంలో ప్యాసింజర్ ఆటోలో మృతదేహాన్ని తరలించిన దృశ్యాలు దుమారం రేపింది. తాజాగా ఈ ఘటన జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
పేరుకు మాత్రం పెద్దాసుపత్రి. వసతులు మాత్రం కరువు. ఆస్పత్రిలో స్కానింగ్ ఉన్నా తీయరు. ప్రయివేట్‌కు రిఫర్ చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. కోట్ల రూపాయలు వెచ్చించి స్కానింగ్ మెషిన్ పెడితే పాడైందని సమాధానం వస్తోంది. ఎమర్జెన్సీ కేసులు వస్తే హైదరాబాద్ వెళ్లాలని చెప్పేస్తారు. ఇలా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే రోగులు.