నిజామాబాద్ రైల్వే జంక్షన్ మీదుగా నిత్యం 11 పాసింబర్ రైళ్లు, 3 గూడ్స్ రైళ్లు నడుస్తాయి. దీంతో మాధవనగర్ రైల్వే గేటును రోజుకు సగటున 26 సార్లు వేస్తుంటారు. నిజామాబాద్ - హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారి కావడంతో రోజుకు 75 వేల వాహనాలు ఈ మార్గంలో తిరుగుతుంటాయి. అటు కామారెడ్డి, హైదరాబాద్, ఇటువైపు మహారాష్ట్రలోని నాందేడ్, నాగ్‌పూర్, ఉమ్మడి ఆదిలాబాద్‌కు వెళ్లే వారికి ఇదే కీలకమైన రోడ్డు. గేటు పడిన ప్రతిసారి ఇరువైపులా కిలోమీటరు మేర ట్రాఫిక్ నిలుస్తోంది. ఇందులో అత్యవసర వైద్యం కోసం వెళ్లే అంబులెన్సులు ఇరుక్కుపోవడంతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి నిధుల విడుదల్లో జరుగుతున్న జాప్యంతో వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఏళ్ల తరబడిగా ఉన్న ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. యంత్రాంగం పరంగా జరగాల్సిన పనులు దాదాపు పూర్తయ్యాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన నిధులు తీసుకొచ్చేలా నేతలు చొరవ చూపాలని స్థానికులు కోరుతున్నారు.
గేటు పడితే గుండె దడే
నిజామాబాద్ - హైదరాబాద్ ప్రధాన రహదారిపై మాధవనగర్ రైల్వేగేటు ఉంది. సికింద్రాబాద్ - ముంబయి మార్గంలో పలు రైళ్లు నగరం మీదుగా ప్రయాణిస్తుంటాయి. రైలొచ్చిన ప్రతిసారి వాహనదారులు గేటు వద్ద 15 నిమిషాలు వేచి చూస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోతుండటంతో ఇక్కడి నుంచి కదలడానికి మొత్తంగా అరగంటకు పైగా సమయం వృథా అవుతోంది. ప్రాణాపాయ స్థితిలో రోగులను హైదరాబాద్‌కు తరలించే అంబులెన్సులూ ఇందులో చిక్కుకుంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి ఉమ్మడి రాష్ట్రంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లగా ఆమోదించారు. తర్వాత ఫోర్ లైన్ రోడ్డుగా అభివృద్ధి చెందిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఫోర్ లైన్ బ్రిడ్జ్ కోసం ప్రతిపాదించారు. దానికీ అనుమతులు లభించాయి. ఆర్వోబీ అనేక అడ్డంకులను అధిగమిస్తూ తుది దశకు చేరింది. రైల్వేశాఖ తన వాటా కింద రూ.30 కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. ఇంతకాలం భూసేకరణ సమస్య పూర్తికాక రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకుండా ఉంది. రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ సంయుక్తంగా సర్వే చేసి 3.30 ఎకరాలు అవసరమని తేల్చారు. నిర్వాసితులకు అందించే పరిహారం అంచనాలతో కూడిన నివేదికలు ప్రభుత్వానికి పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరయ్యేలా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. లేదంటే ప్రయాణికులకు నిత్యం తిప్పలు తప్పనట్లే.