నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో చక్రేశ్వర శివాలయానికి ఎంతో చరిత్ర ఉంది. పురాతన ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రమిది. బోధన్ పట్టణాన్ని గతంలో బహుధాన్యపురం అని పిలిచేవారు. రానురాను బహుధన్ అలా పిలుస్తూ.. చివరకు బోధన్‌గా మారింది. ఈ చక్రేశ్వరాలయం చరిత్రలోకి వెళితే... మహాభారతంలో చెప్పిన భీమ, బకాసుర యుద్ధం ఇక్కడే జరిగిందని ఇక్కడి వాళ్ల నమ్మకం.
బోధన్ అప్పట్లో బహుధాన్యపురం అనే పేరుండేది. అంటే అనేక రకాల ధాన్యాలు పండేవన్నమాట. అందుకే బకాసురుడు ఇక్కడ ఉండేవాడని... గ్రామస్తులు బండెడు అన్నాన్ని, ఒక మనిషిని రోజూ అతడికి ఆహారంగా పంపేవాళ్లని చరిత్ర చెబుతుంది. ఆ రాక్షసుడు ఆ అన్నం, మనిషిని తింటే ఊరిపై దాడి చేయకుండా ఉండేవాడని అంటారు. అదే టైంలో రాజ్యాన్ని కోల్పోయిన పాండవులు బహుధాన్యపురానికి వచ్చారని..... అప్పుడు భీముడికి, రాక్షసుడి గురించి తెలుస్తుంది. తర్వాత బకాసురుడితో యుద్ధం చేసి అతన్ని చంపేస్తాడని పురాణం. ఆ తర్వాత భీముడు, శాండిల్య మహాముని కలిసి ఇక్కడ ఒక ఆలయం కట్టించి శివలింగాన్ని ప్రతిష్టించారని ఆలయ చరిత్ర అని ప్రచారంలో ఉంది. అయితే ముస్లిం రాజులు దండయాత్రలు చేసి, ఆలయాలను ధ్వంసం చేస్తున్న టైంలో ఈ ఆలయాన్ని రక్షించేందుకు దాన్ని ఇసుక, రాళ్లతో కప్పేశారని అంటారు. అలా కప్పిన ఆలయాన్ని వందల ఏళ్ల పాటు ప్రజలు మరిచిపోయారు. అయితే 1959లో ఒక రైతు ఇల్లు కట్టుకోవడానికి స్థలాన్ని చదును చేస్తుండగా గర్భాలయ శిఖరం కనిపించింది. రాళ్లను తొలగించి చూస్తే ఆలయం చెక్కుచెదరకుండా ఉంది. అదే ఇప్పుడున్న శ్రీచక్రేశ్వర ఆలయం.
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల స్వరూపంగా బోధన్ ఎల్లమ్మ అమ్మవారిని కొలుస్తారు భక్తులు. ఈ అమ్మవారు మహారాష్ట్రలోని మాహురషర్ నుంచి దాదాపు 1500 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చినట్లు భక్తుల నమ్మకం. ఇందుకు సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది. అప్పట్లో బోధనను విశ్వపాల మహారాజు పరిపాలించేవాడు. ఆయన గుర్రమెక్కి ప్రతి ఏడాది మాహుర్‌వెళ్లి అమ్మవారిని దర్శించుకునేవాడు. ఆయన వృద్ధాప్యంలోకి వచ్చాక ఒకసారి అక్కడి వరకు వెళ్లలేక ఇక్కడే ఉండి ప్రార్థన చేశాడు. దాంతో అమ్మవారు మాహురనుంచి ఇక్కడి కొచ్చిందని చెప్తుంటారు. హరిద్ర నది పక్కన ఉన్న మామిడి తోట నుంచి ఒక చెట్టును నరికి ఆ మొద్దుతో అమ్మవారి విగ్రహాన్ని చెక్కించారు. మహారాష్ట్ర నుంచి కూడా చాలామంది భక్తులు ఈ ఆలయానికి వస్తుంటారు.
భారీ అతిపురాతన శివలింగం
ఆలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. గర్భగుడిలో ఎక్కడా లేని విధంగా భారీ పురాతన శివలింగం ఉంటుంది. ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడి వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రతి సోమవారం అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సోమవారం మధ్యాహ్నం స్వామి వారికి అన్న ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు. శివలింగంపై అన్నం ఉంచుతారు. స్వామి వారిని సుందరంగా అలంకరిస్తారు. ఆలయంలో ప్రతి సోమవారం సత్యనారాయణ పూజలు నిర్వహిస్తారు భక్తులు. చక్రేశ్వర ఆలయానికి మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. శివరాత్రి సమయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు స్వామివారు.