Garipally Ajay Kumar: గరిపల్లి అజయ్ కుమార్.. ఈ పేరు చాలా మందికి తెలిసే ఉంటుంది. పరుగు పందెంలో చిరుత వేగం ఈ యువకుడిది. అజయ్ రన్నింగ్ లో రాణిస్తున్నాడు. అథ్లెటిక్స్ అంటే చిన్నప్పటి నుంచి అజయ్ కి చాలా ఇష్టం. అయితే అజయ్ చిన్నతంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి నానమ్మ, తాతయ్యల దగ్గర ఉంటున్నాడు. వారి సంపాదనతోనే అజయ్ చదువుకున్నాడు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా దయనీయంగా ఉంది. నిజామాబాద్ జిల్లా ఖానాపూర్ కు చెందిన అజయ్ సాంఘీక సంక్షేమ కళాశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. అయితే ప్రస్తుతం డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. చదువుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నాడు అజయ్.




100, 200 మీటర్ల పెరుగులో చిరుత వేగం..


అజయ్ కి రన్నింగ్ అంటే చాలా ఇష్టం. మంచి అథ్లెట్. హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్నాడు. నాగపురి రమేష్ వద్ద కోచింగ్ తీసుకుంటున్నాడు. అజయ్ ఇప్పటి వరకు ఏడు రాష్ట్ర స్థాయి, 3 జాతీయ స్థాయి 100, 200 మీటర్స్ పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించాడు. సాంఘిక సంక్షేమ కళాశాల ద్వారా అథ్లెటిక్స్ అకాడమీలో చేరాడు. కాలేజీ సాయంతో గచ్చిబౌలి స్టేడియంలో ప్రాక్టీస్ చేశాడు. ప్రస్తుతం అకాడమీ శిక్షణ పూర్తి చేశాడు. ప్రస్తుతం అజయ్ వద్ద డబ్బులు లేకపోవటంతో ఉండటానికి అద్దె చెల్లించలేక, సప్లిమెంట్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. తల్లిదండ్రులు లేకపోవటం తాతయ్య, నానమ్మలకు అతన్ని అథ్లెట్ చేసే స్థోమత లేక అజయ్ ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం అజయ్ డిగ్రీ చదువుకుంటూ... అథ్లెట్ లో రాణించాలంటే అతనికి నెలకు మినిమం 50 నుంచి 60 వేల రూపాయలు అవసరం ఉంది. భారత్ తరఫున అథ్లెటిక్స్ లో రాణించాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అతనికి స్పాన్సర్ అవసరం అంటున్నాడు అజయ్.




అజయ్ సాధించిన విజయాలు..


అజయ్ ఇప్పటి వరకు సాధించిన విజయాలు ఇలా ఉన్నాయి. 2022లో సివర్ 100 మీటర్స్ పరుగు పందెంలో స్టేట్ లెవెల్ జూనియర్ ఫెడరేషన్ కప్ సాధించాడు. 2022లో తెలంగాణ రాష్ట్ర స్థాయి ఛాంపియన్ షిప్ 100, 200 మీటర్స్ లో కాంస్య పథకం సాధించాడు. 2022 లో సౌత్ జోన్ రాష్ట్ర స్థాయిలో 100 మీటర్స్ లో బంగారు పతకం సాధించాడు. జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలో 100మీలో కూడా బంగారు పతకం సాధించాడు. 2021లో జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీలో, 2019లో స్కూల్ గేమ్స్ రాష్ట్ర స్థాయి పోటీలో, 2018 స్కూల్ గేమ్ రాష్ట్ర స్థాయి పోటీ,  2018లో తిరుపతిలో జాతీయ స్థాయి పోటీలు,  2022లో గుజరాత్‌లో జూనియర్ ఫెడరేషన్ కప్, 2022 లో గుంటూరులో సౌత్ జోన్ జాతీయ స్థాయి పోటీల్లో రాణించాడు అజయ్.


స్పాన్సర్ కోసం...


అజయ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తాతయ్య, నానమ్మల సాయంతో చదువుకున్నాడు. ఆటల్లో రాణించాడు. ప్రస్తుతం వారు కూడా డబ్బులు పంపించలేని పరిస్థితి ఉంది. దీంతో తనకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున మరిన్ని పథకాలు సాధిస్తానని చెబుతున్నాడు. అజయ్ పేదరికం అతని టాలెంట్ కు ఇబ్బందిగా మారింది. అజయ్ కు సాయం చేయాలనుకున్న వారు ఈ అడ్రస్ , ఫోన్ నెంబర్ కు సంప్రదించగలరని కోరుతున్నాడు. అజయ్ ఫోన్ నెంబర్ 9391158580, ఖానాపూర్ గ్రామం, భాగ్య నగర్ కాలనీ, నిజామాబాద్ జిల్లా.