Eleti Maheshwar Reddy: ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పై శనివారం నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. మార్చి 21వ తేదీన ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి గురించి.. ఏలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేశారని బీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఆ ఆరోపణల వల్ల మంత్రి పరువు, ప్రతిష్టకు భంగం వాటిల్లిడమే కాకుండా  బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు పార్టీల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే విధంగా మంత్రి పై తప్పుడు, అసత్య ఆరోపణలు చేస్తూ నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని ఆరోపించినట్లు తెలిపారు. ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి పై ఇష్టం వచ్చేలా మాట్లాడారని, ఇవన్నీ మంత్రి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయని, దీంతో నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో మహేశ్వర్ రెడ్డిపై  117/23 యూ/ఎస్ 153, 504, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.














పార్టీ ఆధిష్టానం మేరకు ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై తీవ్ర స్ఖాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనిమిదేళ్ల కాలంలో ఆయన జిల్లాకు చేసింది ఏం లేదని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఆస్పత్రులు లేక తాము అనేక ఇబ్బందులు ఎదుర్కున్నామని.. అలాగే భూములు కబ్జా చేస్తూ కడుపు నింపుకున్నాడంటూ ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే నిర్మల్ మున్సిపాలిటీలో 42 ఉద్యోగాలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్ముకున్నారని అన్నారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో అతడిని ఓడించి.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి హస్తం పార్టీనే గెలిపించాలని కోరారు.