Nirmal News: నిర్మల్ జిల్లా కడెం మండలంలోని లక్మీసాగర్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మహారాష్ట్రలోని గడ్చిరోలి బీజాపూర్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఇటీవల జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు పార్టీ సీనియర్ నేత, ఇంద్రవెల్లి, మంగి డివిజనల్ కమిటీ మెంబర్ కంతి లింగవ్వ అలియాస్ అనిత(41) మృతి చెందడం తెలిసిందే. ఆదివారం ఆమె మృతదేహం స్వగ్రామం లక్ష్మీసాగర్ కు చేరడంతో కుటుంబ సభ్యుల్లో ఒక్కసారిగా రోదనలు మిన్నంటాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన మాజీ మావోయిస్టులతో అంతిమ యత్రలో పాల్గొన్నారు. అలాగే మావోయిస్టు అమర వీరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మ కుమారితో పాటు రాష్ట్రంలోని పలువురు మాజీ మావోయిస్టులు కమ్యూనిస్ట్ పార్టీల ముఖ్య నాయకులు కూడా హాజరై లింగవ్వ మృతదేహానికి నివాళులు అర్పించారు. రోదనల మధ్య జోహార్ కామ్రేడ్ లింగవ్వ అంటూ ఎర్ర జెండాలతో పెద్ద ఎత్తున నినాదాలు, విప్లవ గీతాలు చేస్తూ కంతి లింగవ్వ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.


తెలంగాణలో 5 లక్షలు, మహారాష్ట్రలో 16 లక్షల రివార్డు..
 
ఛత్తీస్‌గఢ్ లోని బీజాపూర్ జిల్లా దామ్రన్చ అటవీ ప్రాంతంలోని టేకుమట్లలో సీ60 బలగాలకు మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. అలాగే మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతుల్లో ఒకరు తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెంకు చెందిన కంతి లింగవ్వగా పోలీసులు గుర్తించారు. బోథ్ మండలం పొచ్చరకు చెందిన మైలారపు అడెళ్లు అలియాస్ భాస్కర్ భార్యనే కంతి లింగవ్వ. అయితే ఈమె మహారాష్ట్ర సీ60 దళ సభ్యురాలని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కంతి లింగవ్వ తెలంగాణ ఇంద్రవెళ్లి‌ డివిజన్ కార్యదర్శిగా కొనసాగుతోంది. కంతి లింగవ్వపై తెలంగాణలో రూ.5 లక్షలు, మహారాష్ట్రలో రూ.16 లక్షలు రివార్డును కూడా ప్రకటించారు.


లక్ష్మీ సాగర్ గ్రామానికి చెందిన లింగవ్వ పేద కుటుంబంలో జన్మించింది. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో ఆమెను తల్లే పెంచి పెద్ద చేసింది. అప్పట్లో పీపుల్స్ వర్క్ అనుబంధంగా ప్రధాన రిక్రూట్ విభాగంలో పని చేసే జన నాట్య మండలి సభ్యుల పాటలకు లింగవ్వ ఆకర్షితురాలు అయింది. వెంటనే పీపుల్స్ వార్ పార్టీ సింగపూర్ దళంలో చేరింది. రెండేళ్ల పాటు పార్టీలో కొనసాగిన ఆమె అప్పటికే దళంలో సభ్యుడిగా కొనసాగుతున్న మైలారం ఆడెల్లు అలియాస్ భాస్కర్ ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి భార్యాభర్తలు అజ్ఞాత ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. పీపుల్స్ వార్ పార్టీ మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ఆడెల్లు జిల్లా కమిటీకి నేతృత్వం వహించగా కంతి లింగవ్వ జిల్లా కమిటీ సభ్యురాలుగా కొనసాగారు. పార్టీ కార్యకలాపాల్లో భాగంగా ఆమె 2002లో నిర్మల్ పట్టణంలోని సోఫీ నగర్ లో తలదాచుకున్నారు. ఆమె షెల్టర్ తీసుకున్న సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు ఇంటిని చుట్టి ముట్టి అరెస్ట్ చేశారు. 


మూడేళ్ల పాటు లింగవ్వ జైలు జీవితం గడిపింది. తర్వాత జైలు నుంచి విడుదలై ఆరు నెలల పాటు లక్ష్మీ సాగర్ లోని ఉంటి వద్దే ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ దళంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జిల్లా కమిటీ మెంబర్ గా, ఏరియా కమిటీ మెంబర్ గా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆమెపై తెలంగాణ సర్కారు  5 లక్షల రివార్డు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం 16 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. అయితే లింగవ్వ రిక్రూట్ మెంట్ పై ఎక్కువ దృష్టి సాగించినట్లు పోలీసులు చెబుతున్నారు. ఛత్తీస్ గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణ కోసం సమావేశం అయ్యారు. ఈ సమయంలోనే పోలీసులు వీరిని చుట్టుముట్టి ఎదురు కాల్పులు చేశారు. ఈ క్రమంలోనే లింగవ్వతో పాటు మరో మావోయిస్టు మృతి చెందారు.