Narayanpet News :తెలంగాణ నారాయణపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. రైలు కింద పడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. క్రిష్ణా మండలం చేగుంట గ్రామ శివారులో  రైలు క్రింద పడి సూసైడ్ చేసుకున్నారు. మృతులు ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనాతి,పార్లపల్లి గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. కూలి పనుల కోసం కుటుంబసభ్యులతో కలిసి కొన్ని రోజుల క్రితం చేగుంట గ్రామానికి వచ్చారు. చేగుంట మాజీ ఎంపీటీసీ లింగప్ప పొలంలో 35 మంది కూలీలతో కలిసి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారు. పత్తి తీసేందుకు కూలికి వెళ్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు మునికుమార్ కు, మృతురాలు అనితకు బాబాయి వరస అవుతాడని కుటుంబ సభ్యులు తెలిపారు. మృతులు ఇద్దరూ ఇవాళ తెల్లవారుజామున చేగుంట గ్రామ సమీపంలో రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. 


లారీ ఢీకొని సీనియర్ అడ్వకేట్ మృతి


సిద్ధిపేటలో ముంద్రాయికి చెందిన సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బైక్ పై ఆయనను రంగధాంపల్లి అమరవీర స్థూపం వద్ద వేగంగా వచ్చిన ఓ లారీ ఢీ కొట్టింది. తీవ్ర గాయాల పాలైన దశమంతరెడ్డి సంఘటన స్థలంలోని ప్రాణాలు వదిలారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకు తరలించారు. విషయం తెలిసిన న్యాయవాదులు సన్నిహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 



(సీనియర్ అడ్వకేట్ దశమంతరెడ్డి)


తొమ్మిదో తరగతి విద్యార్థి ఆత్మహత్య 


అనంతపురంలో విషాదం చోటు చేసుకుంది. తొమ్మిదో తరగతి విద్యార్థి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పాఠశాల కరస్పాండెంట్ పెట్టిన చిత్ర హింసలు భరించలేకే తమ కుమారుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడని చెబుతున్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడి చావుకు కారణం అయిన కరస్పాండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


అనంతపురం జిల్లా కూడేరు మండలంలోని ముద్దలాపురం గ్రామానికి చెందిన గొల్ల రమేష్ దంపతులకు ఇద్దరు కుమారులు. రెండో కుమారుడు 13  ఏళ్ల హరికృష్ణ అనంతపురంలోని రామన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో 9వ తరగతి చదువుతున్నాడు. అయితే నాలుగేళ్ల నుంచి హరికృష్ణ అదే పాఠశాలలోని హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నాడు. అయితే ఇటీవల ముద్దలాపురంలోని ఇంటికి వచ్చాడు. గురువారం ఉదయం తల్లిదండ్రులు పనికి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉన్న హరికృష్ణ మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఇంట్లోని ఫ్యాన్ కు చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పొలం నుంచి వచ్చిన తల్లిదండ్రులు ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. హరికృష్ణను ఎంత పిలిచినా తలుపులు తెరవకపోవడంతో వాళ్లే పగులగొట్టి చూశారు. అయితే లోపలికి వెళ్లిన తల్లిదండ్రులకు ఉరికి వేలాడుతున్న కుమారుడు కనిపించాడు. దీంతో తల్లిదండ్రులు ఇద్దరూ కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తూనే ఉన్నారు. వారు ఏడుపు విన్న స్థానికులు అక్కడకు చేరుకొని విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన కూడేరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.