Hyderabad Crime : క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఫోన్ ఎక్కువ మాట్లాడుతుందని సవతి తండ్రి కూతురుని హత్య చేసిన ఘటన ఇటీవల జరిగింది. హైదరాబాద్ లో మరో ఘటన వెలుగుచూసింది. నాలుగు వందల కోసం హత్య చేశాడో వ్యక్తి. హైదరాబాద్ బాలానగర్ లో ఆ దారుణ హత్య జరిగింది. కూలీలుగా పని చేసే కాశీరాం, శ్రీనివాస్‌ల మధ్య డబ్బుల కోసం గొడవ జరిగింది. నర్సాపూర్ చౌరస్తా రోడ్డు పక్కన ఫుట్ పాత్‌పై వీళిద్దరూ గొడవపడ్డారు. ఈ గొడవ కాస్త పెద్దదై కాశీరాం, శ్రీనివాస్‌ను కర్రతో బలంగా కొట్టి, అటువైపు వెళ్తోన్న లారీ కిందకు తోసేశాడు. లారీ కిందపడిన శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. 


హైదరాబాద్ లో  ఈ ఏడాది సంచలన కేసులు


హైదరాబాద్ లో ఈ ఏడాది(2022) సంచలనాత్మక కేసులతో  పాటు ఇలా కూడా జరుగుతాయా అని ఆశ్చర్యపోయే కేసులు నమోదయ్యాయి. హత్య కేసులు.. కిడ్నాప్ కేసులు సంచలనం సృష్టించాయి. డ్రగ్స్ కేసులు, రేప్ కేసులు, చీటింగ్ కేసులు భారీగా పెరిగాయి. 


జూబ్లిహిల్స్‌లో మైనర్ రేప్ కేసు  


2022లో  తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు.   జూబ్లీహిల్స్ పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లిన నిందితులు..  ఇన్నోవా కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ కారులోనే  మొయినాబాద్ వెళ్లారు.  మొయినాబాద్ లో ఉన్న  ఓ రాజకీయ నేత ఫాంహౌస్ లో ఆ రాత్రి నిందితులు మందు పార్టీ చేసుకున్నారు. తర్వాత ఫుల్ల్ గా ఎంజాయ్ చేశారు. బాధితురాలు రెండు రోజుల పాటు ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులు ఎక్కువగా మంది రాజకీయ నేతల పిల్లలు కావడంతో దుమారం రేగింది. వారిలోనూ కొంత మంది మైనర్లు. అయితే వీరిని మేజర్లుగా పరిగణించాలని పోలీసులు వేసిన పిటిషన్‌కు హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ కేసు వ్యవహారం తెలంగాణలో సంచలనం అయింది. 


కలకలం రేపిన దంత వైద్య విద్యార్థిని వైశాలి కిడ్నాప్ కేసు 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది ఆదిభట్ల డాక్టర్ వైశాలి కిడ్నాప్ కేసు.  హైదరాబాద్ శివార్లలో ఆదిభట్ల మన్నెగూడులో ఇంటిపై వంద మందికిపైగా దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి.  నిందితుడు నవీన్‌రెడ్డి మిస్టర్ టీ ఓనర్. అతడు వైశాలితో కలిసి బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.  నవీన్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురావడందో తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా తాను నిర్ణయం తీసుకోలేనని వైశాలి చెప్పిందని, దీంతో నవీన్‌రెడ్డి యువతి ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు.  దీంతో కోపం పెంచుకున్న నవీన్‌రెడ్డి గతంలో ఆ యువతితో చనువుగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు. దీంతో వైశాలి, నవీన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది మనుసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి, శుక్రవారం యువతిని చూడడానికి పెళ్లి చూపులకు వస్తున్న సంగతి తెలుసుకొని వందమందితో ఆమె ఇంటికి దాడిచేశాడు. అడ్డు వచ్చిన వారిపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి మరీ ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ కేసులో నవీన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. వైశాలి సేఫ్ గా ఉంది.