CSK Captain: ఐపీఎల్ వేలంలో తాము బెన్ స్టోక్స్ ను దక్కించుకోవడం పట్ల ఎంఎస్ ధోనీ చాలా సంతోషంగా ఉన్నాడని.. చెన్నై సూపర్ కింగ్స్ సీఈవో కాశీ విశ్వనాథన్ తెలిపారు. ఆక్షన్ సమయంలో ధోనీ తమతో నిరంతరం ఫోన్ కాల్ లో మాట్లాడుతూనే ఉన్నాడని.. తమకు మార్గనిర్దేశం చేశాడని చెప్పారు. ఇంకా తమ జట్టు భవిష్యత్ కెప్టెన్, కూర్పు గురించి అనేక విషయాలు కాశీ విశ్వనాథన్ పంచుకున్నారు.
ఆ విషయం ధోనీ చేతుల్లో
చెన్నై సూపర్ కింగ్స్ కు తదుపరి కెప్టెన్ స్టోక్స్ అవుతాడా అనే ప్రశ్నకు కాశీ బదులిచ్చారు. ఇది ఎంఎస్ ధోనీ చేతిలో ఉందని అన్నారు. 'మా లైనప్ లో బెన్ స్టోక్స్ ఉన్నందుకు మేం చాలా సంతోషంగా ఉన్నాం. ధోనీ సూపర్ హ్యాపీగా ఉన్నాడు. ఎంఎస్ వేలంలో మాకు మార్గనిర్దేశం చేశాడు. మేం కోరుకున్న ఆల్ రౌండర్ ను దక్కించుకున్నందుకు ఆనందంగా ఉంది అని కాశీ చెప్పారు. స్టోక్స్ కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అయితే ఆ విషయం ధోనీ చేతిలో ఉంది.' అని వివరించారు. 'మేం వేలంలో సామ్ కరణ్ లేదా స్టోక్స్ లలో ఒకరిని ఎంచుకోవాలని అనుకున్నాం. ఆ ప్రణాళిక ప్రకారమే వేలంలో పాల్గొన్నాం. ఇప్పుడు స్టోక్స్ ను చెన్నైలోకి స్వాగతించడానికి ఎదురు చూస్తున్నాం' అని వెల్లడించారు.
కైల్ జేమిసన్ ను కూడా చెన్నై మంచి ధరకు కొనుగోలు చేసింది. అయితే ఈ కివీస్ ఆల్ రౌండర్ 2022 సీజన్ లో గాయపడ్డాడు. అయినా కూడా చెన్నై ఇతనిపై ఆసక్తి చూపింది. దీనిపై కాశీ వివరణ ఇచ్చారు. 'జేమీసన్ కోలుకున్నాడని.. ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని మాకు ఫ్లెమింగ్ నుంచి సమాచారం ఉంది. అందుకే అతనిని తీసుకున్నాం' అని వివరించారు.
ఇదే సరైన సమయం
చెన్నై సూపర్ కింగ్స్ పగ్గాలు ధోనీ, స్టోక్స్ కు అప్పగిస్తే బావుంటుందని న్యూజిలాండ్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ అభిప్రాయపడ్డాడు. 'చెన్నై తదుపరి కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ధోనీ ఐపీఎల్ తప్ప ఏమీ ఆడడంలేదు. నాయకత్వ బాధ్యతలు స్టోక్స్ కు అప్పగించడానికి ధోనీకి ఇదే సరైన సమయం. వారు కూడా అలాగే చేస్తారని నేను భావిస్తున్నాను' అని స్టైరిస్ అన్నారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫుల్ స్క్వాడ్
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అంబటి రాయుడు, సుభ్రాంశు సేనాపతి, మొయిన్ అలీ, శివమ్ దూబే, డ్వైన్ ప్రిటోరియస్, రాజవర్ధన్ హంగర్గేకర్, మిచెల్ సాంట్నర్, రవీంద్ర జడేజా, తుషార్ దేశ్ పాండే, మతీర్ దేశ్ పాండే, ముఖేష్ పధర్, సిమర్ జీత్ సింగ్, దీపక్ చాహర్, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ, బెన్ స్టోక్స్, కైల్ జేమీసన్, నిశాంత్ సింధు, షేక్ రషీద్, అజింక్య రహానే, అజయ్ మండల్, భగత్ వర్మ.