Mla Etela Rajender : టీడీపీ, ఇంకొక పార్టీ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడే పార్టీ కాదు బీజేపీ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు.  జనగామ జిల్లాలో పర్యటించిన ఆయన లింగలఘనపూర్ లో మాన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్.... దేశ ప్రజానీకానికి అన్ని విషయాలు తెలిసేలా ఎడ్యుకేట్ చేయడంలో మాన్ కి బాత్ ఉపయోగకరం అన్నారు.  వ్యవసాయం బాగుపడకుండా దేశం బాగుపడదన్నారు. ఒకప్పుడు వ్యవసాయంలో పురుగు మందులు లేకుండా ఆర్గానిక్ గా పంటలు పండించేవారన్నారు.  చాలా గొప్పగా ఉండేదని, ఇప్పుడు మొత్తం కెమికల్స్ ఆధారంగా పంటలు పండిస్తున్నారని తెసిపారు. వ్యవస్థను మార్చాలంటే విప్లవాత్మక మార్పు రావాలని సూచించారు. రాష్ట్రాల అభివృద్ధి దేశంతో ముడిపడి ఉందన్నారు. మాన్ కీ బాత్ తెలంగాణలోని లింగలఘనపూర్ లో జరగడం సంతోషకరం అన్నారు. మనిషి శ్రమని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, అదే అనారోగ్యానికి దారితీస్తుందన్నారు. 


 వ్యవసాయం కెమికల్స్ మయం 


"ఒకప్పుడు వ్యవసాయం కెమికల్స్ రహితంగా ఉండేది. ఇప్పుడు కెమికల్స్ మయం అయిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే శ్రమజీవులకు ఎలాంటి రోగాలు రాకుండా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కెమికల్స్ వాడకం ఎక్కువయ్యాక రోగాలు పెరిగిపోయాయి. అందుకు వ్యవసాయంలో పాత పద్దతులు పాటించేలా చేయాలి. మనిషి శ్రమ మర్చిపోతున్నాడు. శ్రమ లేకపోవడం వల్ల అనారోగ్యం పెరిగిపోతుంది. ప్రాచీన సంప్రదాయాలను ఆచరించాలని ప్రధాని మోదీ సూచిస్తున్నారు." - ఈటల రాజేందర్ 


బీజేపీ కార్యాలయంలో వాజ్ పేయి జయంతి వేడుకలు 


హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు నిర్వహించారు. వాజ్‌పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. బీజేపీ నాయకులు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ , ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వాజ్‌పేయి చిత్రపటానికి నివాళులు అర్పించారు. 


టీడీపీ నిషేధించిన పార్టీ కాదే? 


తెలంగాణలో టీడీపీ రీఎంట్రీపై బీజేపీ ఎమ్మె్ల్యే ఈటల రాజేందర్ స్పందించారు. టీడీపీని దేశవ్యాప్తంగా విస్తరించాలని చంద్రబాబు గతంలోనే ప్రకటించారన్నారు. టీడీపీ కూడా తెలంగాణ వాసన, పునాది ఉన్న పార్టీ అన్నారు. కాబట్టి ఖమ్మంలో మీటింగ్ పెట్టుకున్నారన్నారు.  టీడీపీ ఏం నిషేధించిన పార్టీ లేదా కొత్త పార్టీ కాదన్నారు. తెలంగాణ గడ్డ మీద కేసీఆర్ ను బొంద పెట్టాలని ప్రజలు నిర్ణయించుకున్నారని విమర్శించారు. టీడీపీనో లేక ఇంకోక పార్టీ దయా దాక్షిణ్యం మీద బీజేపీ ఆధారపడ్డ పార్టీ కాదన్నారు.  తెలంగాణలో కాషాయ జెండా ఎగరవేయడం ఖాయమని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. దేశంలో చట్టాలను‌ తమ చుట్టాలుగా మార్చుకున్న వారు చట్టం ముందు ఎలా చేతులు కట్టుకున్నారో చూశామన్నారు. అనేక దుర్మార్గాలు తెలంగాణలో జరుగుతున్నాయని ఆరోపించారు. చట్టం ముందు ఎవరైనా దోషిగా నిలబడాల్సిందే అని గుర్తుచేశారు. అవినీతిపై నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఈడీ, సీబీఐ సంస్థలదన్నారు. ఎంతటి వారైనా శిక్ష అనుభవించాల్సిందే అని ఈటల రాజేందర్ అన్నారు.