Mann Ki Baat Highlights: 'ఫెస్టివల్ మూడ్‌ను ఎంజాయ్ చేయండి- కానీ కరోనాతో జర జాగ్రత్త'

ABP Desam   |  Murali Krishna   |  25 Dec 2022 12:45 PM (IST)

Mann Ki Baat Highlights: దేశ ప్రజలంతా కొవిడ్ నిబంధనలు పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.

'ఫెస్టివల్ మూడ్‌ను ఎంజాయ్ చేయండి- కానీ కరోనాతో జర జాగ్రత్త'

Mann Ki Baat Highlights: ప్రధాని నరేంద్ర మోదీ 2022 ఏడాదికి గాను తన చివరి మన్‌కీ బాత్‌లో కీలక సూచనలు చేశారు. కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉండేందుకు దేశ ప్రజలంతా తప్పకుండా తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని పిలుపునిచ్చారు. 

ఈ సమయంలో చాలా మంది ప్రజలు హాలీడే మూడ్‌లో ఉన్నారు. ఈ పండుగలను ఆనందంగా జరుపుకోండి. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలోని అనేక దేశాలలో కరోనా పెరుగుతోందని మీరు కూడా చూస్తున్నారు. కనుక మనం అప్రమత్తంగా ఉండాలి. మాస్క్, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తల పట్ల మరింత శ్రద్ధ వహించండి. జాగ్రత్తగా ఉంటే, మనం కూడా సురక్షితంగా ఉంటాం. మన ఆనందానికి ఎటువంటి ఆటంకం ఉండదు.                         -      ప్రధాని నరేంద్ర మోదీ

'మన్ కీ బాత్' తదుపరి ఎడిషన్ 2023లో ప్రసారం కానుందని మోదీ అన్నారు. ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

మనం ఇక 2023లో మళ్లీ కలుద్దాం. కొత్త సంవత్సరం సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వచ్చే ఏడాది కూడా భారతదేశానికి ప్రత్యేకమైనది. మనం దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇప్పుడు మనం 'మన్‌కీ బాత్' 100వ ఎపిసోడ్.. వైపు కదులుతున్నాం. నాకు చాలా మంది నుంచి లేఖలు వచ్చాయి. అందులో వారు 100వ ఎపిసోడ్ గురించి చాలా ఆసక్తిని వ్యక్తం చేశారు. 100వ ఎపిసోడ్‌లో మనం ఏం మాట్లాడాలి? దానిని ఎలా ప్రత్యేకంగా రూపొందించాలి అనే దాని గురించి మీరు మీ సూచనలను పంపండి.                         -    ప్రధాని నరేంద్ర మోదీ

కరోనా పరిస్థితి

దేశంలోనూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే కరోనా వ్యాప్తి చెందుతున్న వేళ మరోసారి లాక్‌డౌన్ విధిస్తారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై నిపుణులు వివరణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్‌లో లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వారు తేల్చి చెప్పారు. అలాంటి స్థితి ఇప్పుడు లేదని, ఎవరూ భయపడొద్దని సూచించారు. అలా అని ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

వివిధ దేశాల్లో కేసులు పెరుగుతున్నందున అక్కడిపరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించాలని, ఇక్కడా నిఘా పెంచాలని చెబుతున్నారు. సెకండ్‌ వేవ్‌లో లాగా...పెద్ద మొత్తంలో కరోనా బాధితులు ఆసుపత్రుల్లో చేరే అవకాశాలు తక్కువే అని అన్నారు. ఎయిమ్స్‌ మాజీ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా మాటల్లో చెప్పాలంటే.."మొత్తంగా చూస్తే భారత్‌లో కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి.

ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు, లాక్‌డౌన్‌లు అవసరం లేదు" అని తేల్చి చెప్పారు. ఇప్పటి వరకూ ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే...వీలైనంత మేర వ్యాప్తిని అడ్డుకోవడమే ఉత్తమమన్న పాఠం నేర్చుకున్నామని గుర్తు చేశారు. "చైనాలో విస్తరిస్తున్న BF.7వేరియంట్ భారత్‌లోనూ వెలుగులోకి వచ్చింది" అని చెప్పారు. అయితే...వ్యాక్సినేషన్‌ను కొనసాగిస్తే పెద్ద ప్రమాదం ఏమీ ఉండదని అంటున్నారు నిపుణులు. ఇప్పటికే భారతీయుల్లోహైబ్రిడ్‌ ఇమ్యూనిటీ పెరిగిందని, అందుకే లాక్‌డౌన్ విధించాల్సిన అవసరం లేదని వెల్లడించారు. 

Also Read: Tawang clash: 'స్నేహమే కోరుకుంటున్నాం'- తవాంగ్ ఘర్షణపై మరోసారి చైనా రియాక్షన్

Published at: 25 Dec 2022 12:39 PM (IST)
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.