తెలంగాణ ఉద్యమకారుడు రాజేశ్ బాబును రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అవమానించడంపై ఆగ్రహజ్వాలలు, నిరసన వ్యక్తమవుతున్నాయి. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గిరిజన సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు నిరసనకు దిగి, మంత్రి తలసాని దిష్టిబొమ్మ దహనాలు చేపట్టారు. రాజేశ్ బాబుకు మద్దతుగా పెద్ద ఎత్తున మద్దతు వస్తుండగా.. మంత్రి చేసిన చర్యను తప్పుబడుతున్నారు. క్షమాపణ చెప్పకుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
హైదరాబాదులో శనివారం (ఆగస్టు 19న) జరిగిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం జరిగింది. అక్కడ మంత్రి కేటీఆర్ ప్రక్కన ముందుకు వెళ్తున్న భైంసా ఏఎంసీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ రాజేష్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అవమానించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. మంత్రి తలసాని దిష్టిబొమ్మకు లోకేశ్వరం మండలం రాజేశ్ తండా, పుస్పూరుతో పాటు పలు గ్రామాల్లో శవయాత్ర నిర్వహించారు. పాడెకట్టి దిష్టిబొమ్మ పెట్టి.. డప్పు భాజాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించి.. దహనం చేసి తమ నిరసన తెలిపారు. నిర్మల్, భైంసా, ముధోల్, ఖానాపూర్ తో పాటు గ్రామాల్లోనూ గిరిజన సంఘాల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని లోకేశ్వరం పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన రాజేశ్ బాబు కు రాష్ట్ర ఉద్యమకారులు అండగా నిలిచారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఉద్యమకారులకు, గిరిజన జాతికి క్షమాపణ చెప్పాలని నిర్మల్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్ అద్యక్షులు డాక్టర్ రామకృష్ణ గౌడ్ డిమాండ్ చేశారు. గిరిజన నేత, ఉమ్మడి ఆదిలాబాద్ తెలంగాణ ఉద్యమ కారుడు రాజేష్ బాబును నెట్టేసి, చెంపదెబ్బ కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. కేసీఆర్ హైదరాబాదులో అడుగుపెడితే ముక్కు నేలకు రాసిస్తాను.. హైదరాబాదు నుండి నీ ఇంటిని ఖాళీ చేయిస్తానన్న తెలంగాణ ఉద్యమ ద్రోహి తలసాని అని.. తెలంగాణ ఉద్యమం కోసం ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేన విద్యావంతుడు జాదవ్ రాజేష్ బాబును అవమానించటాన్ని తీవ్రంగా ఖండించారు ప్రముఖ న్యాయవాది అల్లూరి మల్లారెడ్డి. ఉద్యమ ద్రోహులను మంత్రివర్గం నుంచి తక్షణమే బర్తరఫ్ చేసి.. రాజేష్ బాబుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా సమావేశంలో తెలంగాణ ఉద్యమకారులు సాదు రామ్ రెడ్డి, గోపి గంగన్న, నరసయ్య ఉద్యమకారులున్నారు.
అధికార మదంతో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గిరిజన నేత, తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు రాజేష్ బాబును నెట్టేసి.. చెంపదెబ్బ కొట్టడాన్ని లంబాడీ సంఘం తీవ్రంగా ఖండించింది. లంబాడా సంఘం జిల్లా సీనియర్ నాయకులు రాజేంధర్ హపావత్, లంబాడీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు బానావత్ గోవింద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ జాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి జాదవ్ రాజేందర్, బంజారా సేవ సంఘ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాథోడ్ రాజేందర్ నాయక్ మంత్రి తలసాని తీరును తప్పుపట్టారు. గిరిజన సమాజానికి తలసాని శ్రీనివాస్ క్షమాపణ చెప్పాలని.. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.