తెలంగాణలో మెడికల్ సీట్ల కేటాయింపు జాబితాను విడుదల చేయడానికి కాళోజీ యూనివర్సిటీకి ఆగస్టు 19న హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని 54 కాలేజీల్లో మొదటి రౌండ్ కౌన్సెలింగ్‌కు సంబంధించి సీట్ల కేటాయింపు ఫలితాలను విడుదల చేయాలని ఆదేశించింది. మెడికల్, డెంటల్ సీట్ల భర్తీకి చెందిన నిబంధనలను సవరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జులై 3న జారీ చేసిన జీవో 72ను సవాలు చేస్తూ ఏపీకి చెందిన ఆరుగురు విద్యార్థులు హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు. వాటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. 


విచారణలో భాగంగా పిటిషనర్ల న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 95 ప్రకారం రాష్ట్ర విభజన జరిగిన 2014 జూన్ 2 నుంచి 2024 జూన్ 1 వరకు విద్యాసంస్థల్లో సీట్లను ప్రస్తుతం ఉన్నట్లుగానే రెండు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయించాల్సి ఉందన్నారు.  2014 జూన్ తర్వాత ఏర్పాటు చేసిన కళాశాలల్లో కాంపిటేటివ్ అథారిటీ కోటాలోని వంద శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్ చేస్తూ జీవో 72 తేవడం చెల్లదన్నారు.ప్రభుత్వం, యూనివర్సిటీ తరఫున అడ్వొకేట్ జనరల్ ప్రసాద్, ప్రభాకర్ రావు వాదనలు వినిపించారు. రాష్ట్రంలో మొత్తం 8 వేలకు పైచిలుకు సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇందులో కొత్తగా 5,365 సీట్లు రాష్ట్ర విభజన తరువాత ఏర్పాటైన 34 కాలేజీల్లో ఉన్నాయన్నారు. విభజనకు ముందు ఉన్న 20 కాలేజీల్లో సీట్లను ప్రస్తుతం ఉన్నట్లుగానే రెండు రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తున్నట్లు చెప్పారు. వాదనలను విన్న


ధర్మాసనం మొత్తం 54 కాలేజీల్లో సీట్ల కేటాయింపు ఫలితాలను వెల్లడించడానికి అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు ఏర్పాటైన 20 కాలేజీల్లో పిటిషనర్లకు సీటు దక్కినట్లయితే ఎలాంటి వివాదం లేదని, ఒకవేళ వీటిలో సీటు రాని పక్షంలో మిగిలిన 34 కాలేజీల్లో పిటిషనర్ల స్థానం ఏమిటో నివేదిక ఇవ్వాలంటూ యూనివర్సిటీని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. కేవలం ఆరుగురు విద్యార్థుల కోసం మొత్తం సీట్ల భర్తీ ప్రక్రియ ఆగిపోవడం సమంజసం కాదని పేర్కొంది.


మేనేజ్‌మెంట్‌ సీట్లలో రిజర్వేషన్‌పై హైకోర్టు నోటీసులు..
వైద్యకళాశాలల్లో మెడికల్, డెంటల్ కోర్సుల్లోని మేనేజ్‌మెంట్ సీట్లలో స్థానిక రిజర్వేషన్ కల్పించకపోవడంపై కాళోజీ వర్సిటీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వికారాబాద్‌కు చెందిన సౌమ్య పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్‌ల ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మేనేజ్‌మెంట్ సీట్లలో 10% రిజర్వేషన్ కల్పించకపోవడం అధికరణ 371(డి)కి విరుద్ధమని తెలిపారు.


యూనివర్సిటీ న్యాయవాది ప్రభాకర్ రావు వాదనలు వినిపిస్తూ కాలేజీలు మొత్తం సీట్లలో 50% ప్రభుత్వానికి కేటాయిస్తాయని, వీటిని సర్కారు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తుందని తెలిపారు. మిగిలిన 50%లో 25% మేనేజ్‌మెంట్‌కు, 15% ఎన్‌ఆర్‌ఐలకు, 10% సంస్థాగతంగా రిజర్వేషన్‌లు ఉంటాయని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం మేనేజ్‌మెంట్ సీట్లలో స్థానిక రిజర్వేషన్‌పై కౌంటరు దాఖలు చేయాలంటూ విచారణను వారానికి వాయిదా వేసింది. తెలంగాణలోని పలువురు విద్యార్థులు తమ స్థానికతను పరిగణనలోకి తీసుకోలేదంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.


మెడికల్, డెంటల్ సీట్లకు అడ్మిషన్లను తిరస్కరించడాన్ని వారు సవాలు చేశారు. వారిలో తెలంగాణలోనే ఉంటూ ఇతర ప్రాంతాల్లో ఆన్‌లైన్‌లో తరగతులు తీసుకుని చదివిన విద్యార్థులు కూడా ఉన్నారు. కనీసం ఏడేళ్లు తెలంగాణలో చదివినవారికే స్థానికత వర్తిస్తుందన్న నిబంధనలపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..